టిక్ టాక్ కు కౌంటర్ గా మిత్రో యాప్- చైనా సెంటిమెంటే ఆధారం- షాకిచ్చిన గూగుల్...
చైనాతో లడఖ్ లో సరిహద్దు వివాదం తర్వాత భారతీయుల వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. చైనా ఉత్పత్తులకు పోటీగా దేశీయ ఉత్పత్తుల రూపకల్పనకు ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరుగుతుండగా.. కేంద్రం కూడా వీటికి మద్దతునిస్తోంది. ఇదే కోవలో చైనీస్ టిక్ టాక్ యాప్ కు కౌంటర్ గా తయారైన మిత్రో యాప్ ను తాజాగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడం కలకలం రేపుతోంది. అయితే దీని స్ధానాన్ని భర్తీ చేసేందుకు వందల కొద్దీ నకిలీ యాప్ లు పుట్టుకొస్తున్నాయి.

టిక్ టాక్ కు పోటీగా మిత్రో యాప్...
లఢక్ సరిహద్దుల్లో భారత బలగాలతో చైనా సైన్యం బాహాబాహీకి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో దేశీయంగా డ్రాగన్ కు వ్యతిరేకంగా ఓ భారీ ఉద్యమమే నడుస్తోంది. ఇందులో భాగంగా చైనా కు చెందిన ప్రతీ వస్తువును బహిష్కరించాలనే నినాదం కూడా ఊపందుకుంటోంది. ఇప్పటికే త్రీ ఇడియట్స్ చిత్ర నిర్మాత విధూ వినోద్ చోప్రాకు మార్గదర్శి అయిన సోనమ్ వాంగ్ చుక్ వీడియో రిలీజైన తర్వాత చైనా వ్యతిరేక వాదన మరింత బలపడింది. ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా యాప్స్ రిమూవ్ చేయాలంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం సాగుతోంది. ఇదే కోవలో చైనీస్ టిక్ టాస్ కు భారత్ కౌంటర్ గా చెప్పుకుంటూ మిత్రో యాప్ మార్కెట్లోకి రంగ ప్రవేశం చేసింది.

ప్లే స్టోర్ నుంచి తొలగింపు...
చైనీస్ టిక్ టాక్ యాప్ కు భారతీయ కౌంటర్ గా చెప్పుకున్న మిత్రో యాప్ ప్లే స్టోర్ లో పెట్టగానే లక్షల సంఖ్యలో డౌన్ లోడ్లు అయ్యాయి. ఓ దశలో టిక్ టాక్ మార్కెట్ ను సైతం మిత్రో యాప్ బ్రేక్ చేస్తుందని అంతా భావించారు. కానీ ఇలాంటి తరుణంలో సాంకేతిక కారణాలతో గూగుల్ ఈ యాప్ ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. స్పామ్, డెవలపర్ నిబంధనలు ఉల్లంఘించిందన్న కారణంతో గూగుల్ ఈ చర్య తీసుకుంది. అయితే కీలక సమయంలో మిత్రో యాప్ ప్లే స్టోర్ నుంచి అదృశ్యం కావడంపై భారతీయులు మండిపడుతున్నారు. అదే పేరుతో ఉన్న ఇతర యాప్ లు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.

మిత్రో యాప్ ఉద్యమం....
టిక్ టాక్ కు కౌంటర్ గా రూపొందిన మిత్రో యాప్ ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించినా అప్పటికే మిత్రో పేరుతోనే వచ్చేసిన వందలాది యాప్ లు ఇప్పుడు ప్లే స్టోర్ లో హల్ చల్ చేస్తున్నాయి. యూత్ వీటికి కూడా తెగ ఆకర్షితులు అవుతున్నారు. మిత్రో ఇండియన్ తో పాటు పలు పేర్లతో ఇప్పుడు ఇవి ప్లే స్టోర్ లో దర్శనమిస్తున్నాయి. వీటికి కూడా భారీగా స్పందన ఉంటోందని తెలుస్తోంది. చైనాకు కౌంటర్ గా చెప్పుకున్న మిత్రో పేరుతోనే ఇవి రావడంతో వీటిని డౌన్ లోడ్ చేసుకునేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు.

మిత్రో నకిలీ యాప్- పాకిస్తాన్ డెవలపర్ సృష్టి....
మిత్రో యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించడం వెనుక కారణాలు తెలిసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. టిక్ టాక్ కు కాపీ అయిన పాకిస్తానీ వెర్షన్ టిక్ టిక్ కు ఇది రీ ప్యాకేజెడ్ వెర్షన్ అని తేలింది. మిత్రో డెవలపర్లు టిక్ టిక్ కోడ్ ను అక్రమంగా కొనుగోలు చేసి దీన్ని గూగుల్ ప్లే స్టోర్లో అప్ లోడ్ చేసినట్లు తేలింది. దీనిపై అనుమానం వచ్చి విచారణ జరిపిన గూగుల్ తన దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా దీన్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. భారతీయుల్లో ప్రస్తుతం చైనాకు వ్యతిరేకంగా ఉన్న సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు కొందరు నకిలీ డెవలపర్లు పాకిస్తానీ "టిక్ టిక్" కోడ్ తస్కరించి ఈ యాప్ తయారు చేసినట్లు తేలింది. అయినా ఇప్పటికే మిత్రో యాప్ పాపులర్ కావడంతో దాని పేరుకు తోకలు తగిలించుకుని నడుస్తున్న యాప్ లపై భారతీయులు ఆసక్తి చూపుతూనే ఉన్నారు.