టైమ్ మ్యాగజైన్ అంతర్జాతీయ కవర్ ఫోటోగా రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మహిళలు
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సాగుతున్న రైతుల ఆందోళన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకు తగ్గట్టుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనకు నాయకత్వం వహిస్తున్న మహిళలకు టైమ్ మ్యాగజైన్ తన అంతర్జాతీయ ముఖచిత్రాన్ని అంకితం చేసింది . ఆందోళన చేస్తున్న మహిళా రైతుల ఫోటోను టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటోగా ప్రచురించింది.

రైతుల ఆందోళనకు మహిళల నాయకత్వం .. టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత మూడు నెలలకు పైగా రైతులతో పాటు, మహిళా రైతులు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టైమ్ మ్యాగజైన్
కొత్త అంతర్జాతీయ ముఖచిత్రంలో ఆందోళన చేస్తున్న మహిళా రైతుల ఫోటోతో మమ్మల్ని భయపెట్టలేరు, మమ్మల్ని కొనలేరు, భారతదేశ రైతు నిరసనలకు నాయకత్వం వహిస్తున్న మహిళలు అని పేర్కొంది .
కవర్ చిత్రంలో నిరసనల నుండి కొంతమంది మహిళా రైతులు తమ చిన్న పిల్లలను ఎత్తుకొని మరీ నినాదాలు చేస్తున్నారు.

టైమ్ మ్యాగజైన్ లో మహిళా రైతుల ఆందోళనలపై ప్రచురించిన కథనం
ఛాయాచిత్రంలో ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసన ప్రదేశాలలో నెలల తరబడి ఉండి పోరాటం చేస్తున్న అనేక మంది మహిళా నిరసనకారులు కూడా ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ ఢిల్లీలో రైతుల ఆందోళన పై ప్రచురించిన కథనంలో మహిళలను తిరిగి ఇంటికి వెళ్ళమని ప్రభుత్వం కోరినప్పుడు మహిళా రైతులు తమ ఆందోళనను కొనసాగించడానికి ఎలా సంకల్పించారు అనే దాని గురించి ప్రధానంగా ప్రస్తావించారు. వారు రైతులకు హాని కలిగించే చట్టాలను ఉపసంహరించుకునే వరకు వెళ్ళమని తేల్చి చెప్పారు.

రైతుల ఆందోళనకు అంతర్జాతీయ మద్దతు .. ఇప్పుడు టైమ్స్ మ్యాగజైన్ లోనూ స్థానం
పంజాబ్, హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్ నుండి వేలాది మంది రైతులతో వారు ఆందోళనను చేపట్టి కొనసాగిస్తున్నారు.
భారతదేశంలో వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతుల నిరసనలు అంతర్జాతీయంగా పలువురి దృష్టిని ఆకర్షించాయి. అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న రైతుల నిరసనకు రిహన్న మరియు గ్రెటా థన్‌బెర్గ్ వంటి ప్రముఖుల నుండి భారీ మద్దతు లభించింది, ఇది మరింత వివాదానికి దారితీసింది. రిహన్న మరియు గ్రెటా ట్వీట్లు చేసిన వెంటనే కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది . భారతదేశ అంతర్గత విషయాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని ప్రముఖులను కోరింది.