• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తిరుమల డిక్లరేషన్ వివాదం: మక్కా మసీదు, వాటికన్ చర్చిలలోకి ఇతర మతస్తులు వెళ్లవచ్చా?

By BBC News తెలుగు
|

తిరుమల

తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశంపై రాజకీయ దుమారం చెలరేగింది. హిందూయేతరులు ఆలయంలోకి ప్రవేశించాలంటే.. వెంకటేశ్వర స్వామిపై విశ్వాసముందని ''డిక్లరేషన్'' తప్పనిసరిగా ఇవ్వాలని ఇక్కడ నిబంధనలు చెబుతున్నాయి. ఆ ఆంక్షలను తొలగిస్తున్నట్లు ఇటీవల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటన చేశారు. వివాదం చెలరేగడంతో ఈ డిక్లరేషన్‌ను తీసేయాలని తాను అనలేదంటూ ఆయన వివరణ ఇచ్చారు.

అయితే, ఈ వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. డిక్లరేషన్‌ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ గుడికీ, మసీదుకీ లేని డిక్లరేషన్.. తిరుపతికి మాత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అన్య మతస్తులు సంతకం పెట్టకుండా లోపలకు వెళ్తే గుడి అపవిత్రం అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు.

నాని వ్యాఖ్యలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోపాటు బీజేపీ, జనసేన నాయకులు ఖండించారు. అంతేకాదు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కూడా సొంత పార్టీని తప్పుపట్టారు.

ఇంతకీ ఇలాంటి డిక్లరేషన్లు వేరే మతాల్లోనూ ఉన్నాయా? వివిధ మతాల ప్రార్థనా మందిరాల్లోకి అన్య మతస్తులు కూడా వెళ్లవచ్చా?

రోమన్ క్యాథలిక్‌

ద్రాక్షరసం క్రైస్తవులకు మాత్రమే ఇస్తారు

క్రైస్తవుల్లోని ప్రధాన వర్గమైన రోమన్ క్యాథలిక్‌లకు వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా అత్యంత పవిత్రమైన ప్రార్థనా మందిరం.

http://www.museivaticani.va ప్రకారం... ఈ చర్చిలోకి క్రైస్తవులతోపాటు ఎవరైనా ప్రవేశించవచ్చు. ఎలాంటి మతపరమైన ఆంక్షలు విధించరు. అయితే కొన్ని నిబంధనలను మాత్రం అందరూ పాటించాల్సిందే.

స్లీవ్‌లెస్ దుస్తులు, మోకాళ్లపైకి ఉండే స్కర్ట్స్‌, షార్ట్స్, టోపీలు పెట్టుకోకూడదు. క్యాథలిక్ సంప్రదాయాలను అగౌరవపరిచే పచ్చబొట్లను వేసుకుంటే అనుమతి ఉండదు.

మరోవైపు క్రీస్తు జన్మ స్థలంగా చెప్పుకొనే బెత్లెహామ్ నగరం.. ఇటు రోమన్ క్యాథలిక్‌లతోపాటు ప్రొటెస్టెంట్‌లకూ పవిత్రమైనదే. దీన్ని ముస్లింలు, యూదులు కూడా పవిత్రంగానే భావిస్తారు. ఇక్కడ కూడా ఎలాంటి మతపరమైన నిబంధనలు ఉండవు. ఏ మతం వారైనా ఇక్కడి మూడు ప్రధాన చర్చిలను సందర్శించవచ్చు. వీటితోపాటు సెయింట్ పీటర్స్ బసిలికాలోనూ ఎలాంటి డిక్లరేషన్లూ అవసరం లేదు.

ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖటామీ 2007లో వాటికన్ సందర్శించి అప్పటి పోప్ బెన్‌డిక్ట్‌తో చర్చలు కూడా జరిపారు. 2014లో చరిత్రలో తొలిసారిగా క్రైస్తవులు, యూదుల, ముస్లింల సంయుక్త ప్రార్థనను వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్ నిర్వహించారు.

అయితే, రోమన్ క్యాథలిక్‌లలో ప్రార్థనల అనంతరం ఇచ్చే రొట్టె, ద్రాక్షరసాన్ని కేవలం క్రైస్తవులకు మాత్రమే ఇస్తారు.

మక్కా

మక్కాలోకి ఇతర మతస్తును రానివ్వరు

ముస్లింల జీవితంలో మక్కా, మదీనాలకు ప్రత్యేక స్థానముంది. ఈ మక్కాతోపాటు ముజ్దాలిఫా, మౌంట్ ఆఫ్ అరాఫత్, మీనాలను కలిపి హజ్‌గా పిలుస్తారు. జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లి ఈ పవిత్ర ప్రార్థనా మందిరాలను సందర్శించుకోవాలని ముస్లింలు భావిస్తారు. ఈ ప్రాంతాలన్నీ సౌదీ అరేబియాలో ఉన్నాయి.

అయితే, ముస్లింలు తప్ప మరే ఇతర మతస్తులూ వీటిని సందర్శించడానికి వీళ్లేదని సౌదీ నిబంధనలు చెబుతున్నాయి.

క్రైస్తవులు, యూదులు కూడా అబ్రహామును విశ్వసించినప్పటికీ వారిని మక్కా నగరంలోకి ప్రవేశించేందుకు సౌదీ అనుమతించదు.

ముస్లిమేతరులు హజ్ వీసా పొందకుండా చూసేందుకు సౌదీ పక్కాగా ధ్రువపత్రాలు చెక్‌ చేస్తుంది. నేరుగా ప్రభుత్వమే దగ్గరుండి అన్ని చర్యలూ తీసుకుంటుంది.

ఇస్లాం మతం స్వీకరించిన పశ్చిమ దేశాల ప్రజలు హజ్‌కు రావాలంటే.. స్థానిక ఇమామ్‌ నుంచి ధ్రువపత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలి.

జెరూసలేం

యూదుల్లో అయితే...

జెరూసలేంలోని ద టెంపుల్ మౌంట్.. యూదులకు అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థలం. ముస్లింలతోపాటు క్రైస్తవులకూ ఇది ముఖ్యమైన ప్రార్థనా స్థలమే.

యూదులు ఎక్కడ ఉన్నా.. ఈ మందిరంవైపే తిరిగి ప్రార్థనలు చేస్తుంటారు. ఇక్కడకు క్రైస్తవులతోపాటు ముస్లింలను కూడా అనుమతిస్తారు.

అయితే, అప్పుడప్పుడు ఇక్కడ మత ఘర్షణలు చోటు చేసుకుంటుంటాయి. ఆ సమయంలో ముస్లింలు ప్రవేశంచకుండా తాత్కాలిక ఆంక్షలు విధిస్తుంటారు.

స్వర్ణదేవాలయం

సిక్కుల్లోనూ అందరికీ..

సిక్కులకు అత్యంత పవిత్రమైన గురుద్వారా హర్మందిర్ సాహిబ్. దీన్నే స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది అమృత్‌సర్‌లో ఉంది.

స్వర్ణ దేవాలయంలోకి ఎవరైనా ప్రవేశించి ప్రార్థనలు చేసుకోవచ్చు. దీనికి నాలుగు వైపుల నుంచి ద్వారాలు ఉంటాయి. అందరినీ తాము స్వాగతిస్తామని చెప్పేందుకే నాలుగు వైపుల నుంచి ప్రవేశాలకు అనుమతిస్తున్నట్లు సిక్కులు చెబుతుంటారు.

అయితే, లోపలకు వెళ్లే అందరూ కాళ్లు తప్పనిసరిగా కడుక్కోవాలి. తలపై వస్త్రాన్ని కప్పుకోవాలి. చెప్పులను బయటే వదిలిపెట్టాలి.

ఇక్కడ ఆహారం తయారుచేసేందుకు వలంటీర్‌గా వెళ్లొచ్చు. అక్కడ కూడా ఎలాంటి మతపరమైన ఆంక్షలు విధించరు.

ఏ గురుద్వారాలోనైనా నిబంధనలు ఇలానే ఉంటాయి. అన్ని మతస్తులకూ ప్రవేశం ఉంటుంది. అయితే, గురుద్వారాలోని పవిత్రమైన పరిక్రమలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) అనుమతి లేకుండా ఎవరూ మతపరమైన సమావేశాలు, ప్రసంగాలు ఇవ్వకూడదు.

అయితే, ముస్లింలు, క్రైస్తవులు ఇలా అన్ని మతాల్లోనూ ఏదోఒక రకమైన ఆంక్షలు ఉండేటప్పుడు.. తిరుపతిలో డిక్లరేషన్ ఉంటే తప్పేంటని రఘు రామ కృష్ణరాజు ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Can Hindus visit Vatican Church and Mecca Masjid
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X