దీదీకి షాకిచ్చి పార్టీ పదవులకు ఎమ్మెల్యే రాజీనామా.. సొంత పార్టీ నేతలపై ఆరోపణలకు షోకాజ్ నోటీస్ జారీ
పశ్చిమబెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి బిజెపి బాట పడుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని, బిజెపికి తగిన బుద్ధి చెప్పాలని మమతాబెనర్జీ ఒకపక్క ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క మమతా బెనర్జీ కి షాక్ ఇస్తూ, తృణమూల్ కాంగ్రెస్ ను బలహీనం చేస్తూ రాజీనామాల పర్వం కొనసాగుతోంది.
మమతా బెనర్జీకి షాకిచ్చిన మరో టీఎంసీ నేత ... అటవీశాఖా మంత్రి రాజీబ్ బెనర్జీ రాజీనామా

ఉత్తర్ పారా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రబీర్ ఘోషల్ రాజీనామా
ఇటీవల ఆ పార్టీకి చెందిన ఇరువురు ముఖ్యనేతలు రాజీనామా చేయగా, తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీ పదవుల నుంచి తప్పుకున్నారు . ఉత్తర్ పారా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రబీర్ ఘోషల్ తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవితోపాటుగా , హుబ్లీ జిల్లా కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తన పనులు తాను చేసుకోవడానికి అనుమతించడం లేదని, ఇబ్బంది కలిగిస్తుందని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన రెండు పార్టీ పదవులకు రాజీనామా చేశారు ఉత్తర్ పారా నియోజకవర్గ ఎమ్మెల్యే.

వచ్చే ఎన్నికల్లో తనను ఓడించటానికి సొంత పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపణ
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని ఘోషల్ చెప్పారు . రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తాను ఉత్తర్ పారా సీటు నుండి మళ్ళీ పోటీ చేస్తే తనను ఓడించడానికి సొంత పార్టీ నుండే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
లోక్సభ ఎన్నికలలో కూడా పార్టీలో గొడవల కారణంగా టిఎంసి ప్రభావం పేలవంగా ఉందని పేర్కొన్నారు. పార్టీలో మంచి వ్యక్తులకు స్థానం లేదని, స్వార్ధపూరిత రాజకీయాలు చేసే వారికి స్థానం ఉన్నట్లు గా కనిపిస్తుందని పార్టీకి రాజీనామా చేసిన అసంతృప్త ఎమ్మెల్యే పేర్కొన్నారు.

షోకాజ్ నోటీస్ జారీ .. పార్టీలో చర్చించి సమస్య పరిష్కారం చేసుకోవాలని టీఎంసీ నేతల సూచన
ఉత్తర్ పారా ఎమ్మెల్యే ప్రబీర్ ఘోషల్ కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ప్రబీర్ ఘోషల్,అంతర్గత పార్టీ వ్యవహారాలను ప్రెస్‌తో ఎందుకు చర్చించారో వివరించాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు . అంతేకాదు అలా చేయవద్దని హెచ్చరించారు . ఉత్తరపారాలో, టిఎంసి మద్దతుదారులు సదరు ఎమ్మెల్యే కార్యాలయం ముందు ఆందోళన చేసి , రాజీనామా చేసి వెళ్లే బదులు పార్టీతో చర్చించి విభేదాలను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

రాజీనామా చేసిన వారు బీజేపీలో చేరే అవకాశం .. బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చ
ఇటీవల రాష్ట్ర అటవీ మంత్రి పదవికి రాజీనామా చేసిన మరో తిరుగుబాటు నాయకుడు రాజీబ్ బెనర్జీ ఏప్రిల్-మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వారు బిజెపిలో చేరే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ దీదీకి చెక్ పెట్టటానికి టీఎంసీ పార్టీపై కాస్త అసంతృప్తి ఉన్న నేతలకు సైతం బీజేపీ గాలం వేస్తుందని చర్చ సాగుతుంది