చైనాకు ఆగడాలకు చెక్, ఆర్మీని వేగంగా తరలించేందుకు సొరంగం, ఇదీ భారత్ ప్లాన్!
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఆగడాలకు చెక్ చెప్పేందుకు భారత్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. అత్యవసర సమయలో భారత బలగాలు వేగంగా కదిలేందుకు వీలుగా ఓ భారీ సొరంగాన్ని నిర్మిస్తోంది.
యుద్ధం తప్పదా?: ఆంక్షలు అతిక్రమిస్తూ ఉత్తరకొరియా... డేగకన్నేసిన అమెరికా! ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు..
ఈ విషయాన్ని మొన్నటి కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఏకంగా సముద్రమట్టానికి 13,700 అడుగుల ఎత్తులో.. సేలా కనుమ గుండా ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు.

మితిమీరుతున్న చైనా ఆగడాలు...
మన దేశానికి పాకిస్తాన్ ప్రథమ శత్రువు అనుకుంటుంటే.. రానురానూ చైనా ఆగడాలు కూడా మితిమీరుతున్నాయి. దాదాపు 4 వేల కిలోమీటర్ల ఇండో-చైనా సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ తరచూ కయ్యానికి కాలుదువ్వుతోంది. వివాదాస్పద ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతూ భారత్‌ను కవ్విస్తోంది. ఆ మధ్య డోక్లామ్ తమ భూభాగమేనంటూ భారీగా సైన్యాన్ని మోహరించి.. చైనా ఏ స్థాయిలో గొడవ సృష్టించిందో అందరికీ తెలిసిందే.

చైనా ఆటకట్టించేందుకు సరికొత్త వ్యూహం...
సరిహద్దుల్లో చైనా హల్‌చల్ చేసినప్పుడల్లా ఆయా ప్రాంతాలకు భద్రతా దళాలను, ఆయుధాలను తరలించడం భారత్‌కు కష్టమవుతోంది. అందుకే మోడీ సర్కారు తాజాగా ఓ ప్లాన్ వేసింది. అత్యవసర పరిస్థితుల్లో భద్రతా దళాలను, ఆయుధాలను వేగంగా తరలించేందుకు వీలుగా సేలా కనుమ మీదుగా ఓ భారీ సొరంగం తవ్వాలని నిశ్చయించింది.

సేలా కనుమగుండా సొరంగ మార్గం...
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్-పశ్చిమ కమెంగ్ జిల్లాల మధ్య సేలా కనుమ ఉంది. ఇది చైనా సరిహద్దుల్లో భారత్‌కు వ్యూహాత్మకంగా కీలక ప్రాంతం. ఈ కనుమ మీదుగా సొరంగ నిర్మాణం చేపడితే చైనా సరిహద్దులకు దూరం తగ్గుతుంది. అటు తేజ్‌పూర్, ఇటు తవాంగ్ ఆర్మీ స్థావరాల మధ్య ప్రయాణ దూరం గంటపాటు తగ్గుతుంది.

బడ్జెట్‌లోనూ ప్రస్తావన...
అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యంత కీలకమైన తవాంగ్ పట్టణం నుంచి భారత బలగాలు వేగంగా కదలడానికి వీలుగా భారత్ భారీ సొరంగాన్ని నిర్మిస్తోంది. ఏకంగా సముద్ర మట్టానికి 13,700 అడుగుల ఎత్తులో.. సేలా కనుమ గూండా ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు అరుణ్‌జైట్లీ ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో కూడా ప్రకటించారు.

భద్రతా బలగాల తరలింపు కోసం...
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) ఆధ్వర్యంలో బలిపరా-చౌదుర్-తవాంగ్‌లను కలుపుతూ 475 మీటర్లు, 1790 మీటర్లు మేర రెండు సొరంగాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పూర్తయ్యాయి. ఈ సొరంగ మార్గాల నిర్మాణం వల్ల అన్నిటికీమించి 13వ జాతీయ రహదారిపై ఏ వాతావరణ పరిస్థితిలోనైనా భద్రతా బలగాలను వేగంగా తరలించడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా రహదారులను మంచు కప్పేసే శీతాకాలంలో.. ఈ సొరంగ మార్గం భారత సైన్యానికి బాగా ఉపయోగపడుతుంది.

ఇప్పుడు సేలా పాస్ మీదుగా...
ఇటీవలి బడ్జెట్‌లో ఈ సొరంగ మార్గం నిర్మాణం గురించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ‘లడఖ్ ప్రాంతాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో చేరుకోవడానికి రోహ్‌తాంగ్ సొరంగ నిర్మాణం పూర్తయింది. మరోవైపు 14 కిలోమీటర్ల జోజిలా పాస్ టన్నెల్ నిర్మాణం కొనసాగుతోంది. ఇక చైనా సరిహద్దుల్లో అత్యంత కీలకమైన సేలా పాస్ మీదుగా సొరంగ నిర్మాణ ప్రతిపాదనలను కూడా సిద్ధం చేశాం..' అని వెల్లడించారు.