సీన్ రివర్స్: ట్రాఫిక్‌లో చిక్కుకున్నందుకే ప్రాణాలు దక్కాయి..
గురుగ్రామ్: మెట్రో నగరాల్లో ట్రాఫిక్ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు తరలించే పేషెంట్స్ కొన్నిసార్లు ట్రాఫిక్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ అదే ట్రాఫిక్ ఇప్పుడు ఓ టోల్ అధికారికి ప్రాణభిక్ష పెట్టింది.
ట్రాఫిక్ పుణ్యమాని సదరు అధికారి కిడ్నాప్ బారి నుంచి తప్పించుకున్నాడు. అప్పటికే అతన్ని తీవ్రంగా కొట్టి దుండగులు.. కారులో వేరే చోటుకు తరలిస్తున్నారు. ఇంతలో ట్రాఫిక్ రూపంలో పెద్ద చిక్కు వచ్చి పడటంతో.. కిడ్నాప్ వ్యవహారం అందరికీ తెలిసిపోతుందన్న అప్రమత్తతో అతన్ని వదిలిపెట్టారు. దీంతో బతుకు జీవుడా అంటూ తన ప్రాణాలు దక్కించుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 10.15 గంటలకు ఖేర్కీ డౌలా టోల్ ప్లాజా వద్దకు ఓ ఖరీదైన మెర్సిడస్ బెంజ్ కారు వచ్చింది. అందులో ఉన్న వ్యక్తిని టోల్ రుసుం చెల్లించాల్సిందిగా కోరగా.. కారులో ఉన్న వ్యక్తి ససేమిరా అన్నాడు. అంతేకాదు నన్నే టోల్ ఫీజు అడుగుతావా? నీ అంతు చూస్తా.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అతను అక్కడినుంచి వెళ్లిపోయిన మరో గంటకు అదే కారు మళ్లీ ఆ టోల్ ప్లాజా వద్దకు వచ్చింది. అయితే ఈ సారి అందులో 15మంది దుండగులు.. డబ్బులు అడిగిన టోల్ అధికారిని బెదిరించడానికి ఆయుధాలతో వచ్చారు. అసిస్టెంట్ మేనేజర్ ను బెదిరించి కిడ్నాప్ చేశారు. కారులో అతన్ని తీవ్రంగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు.
అయితే కొద్ది దూరం వెళ్లగానే గుర్గాన్ ట్రాఫిక్ రూపంలో వారికి పెద్ద చిక్కు ఎదురైంది. వందలాది వాహనాలు రోడ్డు పొడుగునా బారులు తీరడంతో దుండగుల కారు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ట్రాఫిక్ క్లియర్ అయితే తప్ప అక్కడినుంచి బయటపడే మార్గం లేదు.
ఈలోగా కిడ్నాప్ వ్యవహారాన్ని ఎవరైనా పసిగడితే తమకే ప్రమాదమని దుండగులు భావించారు. అంతే చేసేదేమి లేక సదరు టోల్ ఉద్యోగిని వదిలిపెట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ పుణ్యమాని సదరు టోల్ ప్లాజా ఉద్యోగి తన ప్రాణాలు దక్కించుకున్నాడు.