యూపీ టూ మధ్యప్రదేశ్- 241 కి.మీ ఆగకుండా రైలు పరుగులు- రైల్వే అద్భుతంతో చిన్నారి సేఫ్
ప్రభుత్వ యంత్రాంగం తలుచుకుంటే దేశంలో ఎన్ని అద్భుతాలు చేయవచ్చో మరోసారి నిరూపితమైంది. నిబంధనలను పక్కనబెట్టి మరీ కిడ్నాపైన చిన్నారిని కాపాడేందుకు రైల్వేశాఖ చేపట్టిన ఓ అరుదైన ఆపరేషన్ విజయవంతం కావడమే కాకుండా దేశ ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఎక్కడో యూపీలో కిడ్నాపైన బాలికను రక్షించేందుకు రప్తీసాగర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగకుండా 241 కిలోమీటర్లు పరుగులు తీయించిన రైల్వేశాఖపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటివరకూ ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు రోడ్లపై గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి క్లియరెన్స్ ఇచ్చిన తరహాలోనే రైల్వే కూడా రెండు రాష్ట్రాల అధికారులను సమన్వయం చేస్తూ సాగిన ఈ ఆపరేషన్ ఇప్పుడు దేశంలో సాధారణ ప్రజలకు సైతం ఓ భరోసా ఇచ్చింది.

యూపీలో బాలిక కిడ్నాప్...
యూపీలోని లలిత్ పూర్లో అనుకోని పరిస్ధితుల్లో మూడేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. బాలికను అటు ఇటు తిప్పి చివరికి లలిత్పూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి చిన్నారిని తీసుకెళ్లాలనేది ఆతని ఆలోచన. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేయడమో, తన తల్లితండ్రులకు దూరం చేయడమో అతని ప్రయత్నం. చిన్నారి కనిపించకపోయే సరికి తల్లితండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లాడని గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగే సరికి పుణ్యకాలం పూర్తయింది. రఫ్తీ సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో చిన్నారిని ఎక్కించుకుని కిడ్నాపర్ వెళ్లిపోయాడు.

రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్, ఐఆర్టీఎస్..
కిడ్నాపర్‌ను పట్టుకుని మూడేళ్ల చిన్నారిని కాపాడాలంటే అంత సులువు కాదు. అప్పటికే రైలు లలిత్పూర్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది. మధ్యలో రైలు తర్వాతి స్టేషన్లో ఆగడం అతను చిన్నారిని దించి తీసుకెళ్లిపోవడం చకచగా జరిగిపోతాయి. వెంటనే స్పందించి రైల్వే, సాధారణ పోలీసులను అప్రమత్తం చేసినా ఫలితం ఉంటుందన్న గ్యారంటీ లేదు. దీంతో రైల్వే పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదించారు. కాసేపటి తర్వాత ఓ భారీ ఆపరేషన్‌కు వ్యూహం రచించారు. రైలును ఆగకుండా పరుగులు తీయిస్తే ఏ స్టేషన్ దగ్గర పోలీసులను మోహరిస్తే ఫలితం ఉంటుందో అంచనా వేశారు. మార్గ మధ్యలో దాదాపు అన్నీ ఓ మోస్తరు స్టేషన్లే. ఎక్కడ రైలు ఆపినా వెనువెంటనే భారీ ఎత్తున పోలీసులు చుట్టుముట్టడం సాధ్యం కాకపోవచ్చు. దీంతో మరో ఆపరేషన్‌కు రంగం సిద్ధమైంది.

241 కిలోమీటర్ల నాన్‌స్టాప్ ఆపరేషన్..
యూపీలోని లలిత్‌పూర్‌లో బయలుదేరిన రప్తీసాగర్ ఎక్స్‌ప్రెస్ ఆగకుండా 241 కిలోమీటర్లు ప్రయాణిస్తే మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కు చేరుకోవచ్చు. అప్పటివరకూ రైలు ఆగకుండా ప్రయాణించేందుకు లోకోపైలట్లకు అత్యవసర ఆదేశాలు ఇచ్చారు. మధ్యలో రైలును ఎట్టిపరిస్ధితుల్లో ఆపొద్దంటూ రైల్వే స్టేషన్లకూ, గార్డులకూ వాకీ టాకీల్లో ఆదేశాలిచ్చారు. రైలు ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆగకుండా ప్రయాణించేందుకు సిగ్నలింగ్ వ్యవస్ధలను కాసేపు ఆపేశారు. అలా రైలు ఆగకుండా పరుగులు తీస్తోంది. మధ్యలో కొన్ని స్టేషన్లలో దిగాల్సిన ప్రయాణికులు ఉన్నారు. వారికీ ఏమీ అర్ధం కావడం లేదు. చివరికి రైలు అనుకున్న విధంగా ఎక్కడా ఆగకుండా భోపాల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న ఆర్పీఎప్ పోలీసు బృందాలు కిడ్నాపర్ చెర నుంచి చిన్నారిని రక్షించాయి.

రైల్వే అద్భుతానికి ప్రశంసల వెల్లువ...
యూపీలో కిడ్నాపైన చిన్నారిని రక్షించేందుకు రైల్వేశాఖ అత్యంత సమన్వయంతో చేపట్టిన ఈ ఆరుదైన ఆపరేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. రైల్వేశాఖకు అభినందనలు తెలుపుతూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. రైల్వే సకాల స్పందన ఓ చిన్నారి అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకోవడం తనకు గర్వంగా ఉందని నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్ధి ప్రశంసించారు. రైల్వే ఓ అసాధారణ ప్రయత్నంతో చిన్నారిని కాపాడేందుకు భారీ ఆపరేషన్ చేపట్టడం దేశంలో ఎంతో మంది సాధారణ ప్రజలకి భరోసా ఇచ్చిందని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.