దారుణం: ప్రియుడితో పాటు మహిళ నగ్నంగా ఊరేగింపు, 9మంది అరెస్ట్
జైపూర్: ఓ మహిళను, ఆమె ప్రియుడిని నగ్నంగా ఊరేగించిన కేసులో రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లా పోలీసులు శనివారం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిందితులు నగ్నంగా ఊరేగించిన దృశ్యాలను చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
దనోకీభాగల్ గ్రామంలో శుక్రవారం ఈ దారుణ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిలో గిరిజన మహిళ, ఆమె ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి నగ్నంగా నడిపిస్తున్న దృశ్యాలున్నాయి. వారి వెనుక కొందరు గ్రామస్థులు నడుస్తూ సెల్ఫోన్లలో వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు కనిపించారు.
నిందితుల్లో బాధిత యువతి మాజీ భర్త కూడా ఉన్నాడు. అతడితో పాటు అతడి సోదరుడు, అత్త, మేనకోడలు ఉన్నారు. అరెస్టైన వారిలో వీరు కూడా ఉన్నారు. బాధితురాలికి మాజీ భర్తతో అయిదేళ్ల క్రితం పెళ్లయింది.
విభేదాలు రావడంతో తమ సంప్రదాయం ప్రకారం విడిపోయారు. అనంతరం వేరే వ్యక్తితో బాధితురాలు సహజీవనం సాగిస్తోంది. అతడిని కలవడానికి వెళ్లినప్పుడు మాజీ భర్త తన కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు.