వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎఐఎంపీఎల్బీ వల్లే అంతా: ట్రిపుల్ తలాక్‌పై బుఖారీ.. అయినా మించిపోలేదు

అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపీఎల్బీ) వ్యవహార శైలి వల్లే ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారని ఢిల్లీ జమా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ప

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపీఎల్బీ) వ్యవహార శైలి వల్లే ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారని ఢిల్లీ జమా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పేర్కొన్నారు. అయితే ట్రిపుల్ తలాక్‌తో జరిగే పొరపాట్లను పరిష్కరించడంలో ఎఐఎంపీఎల్బీ విఫలం కాలేదన్నారు. ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన పౌర సమస్యల పరిష్కారానికి ఇప్పటికీ ఎఐఎంపీఎల్బీ మాత్రమే సంరక్షకురాలిగా ఉన్నదన్నారు.

దీనిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎందుకు ప్రతిస్పందించకూడదని ప్రశ్నించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ముందు వివాహ ఒప్పంద సమయంలోనే విడాకులు అంశం తప్పని, ఒకవేళ దీన్ని పాటిస్తే సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించాలని బుఖారీ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకించకపోయినా.. తాను మాత్రం అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.

తక్షణ తలాక్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏకగ్రీవం కాదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇన్‌స్టంట్ తలాక్‌నకు వ్యతిరేకంగా సుప్రీం ఇచ్చిన తీర్పు అమలుపై ఆచరణలో ఆచరణలో సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల అమలు సమాజంలోనే ప్రారంభం కావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చేనెల భోపాల్‌లో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) సమావేశమై దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు క్షేత్రస్థాయిలో కఠినమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల పరిధిలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తామని, కానీ ఇది బీజేపీ విజయం కాదని తేల్చి చెప్పారు.

స్వాతంత్ర్యానంతర అతిపెద్ద సాంఘిక సంస్కరణ అని వ్యాఖ్యలు

స్వాతంత్ర్యానంతర అతిపెద్ద సాంఘిక సంస్కరణ అని వ్యాఖ్యలు

ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుతో పిటిషనర్ల మోములో ఆనందం తొణికిసలాడింది. సుప్రీంకోర్టు తీర్పు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిపిన అత్యుత్తమ సంస్కరణల్లో ఒకటి అని ముస్లిం సామాజిక కార్యకర్తలు అభివర్ణించారు. తలాక్ పద్ధతి పాటిస్తే శిక్ష తప్పదని చట్టం చేసినప్పుడే నిజమైన విజయం సాధించినట్లని కొందరు పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ తీర్పు ముస్లిం మహిళల హక్కులను పరిరక్షిస్తుందని, సున్నీ ముస్లింలు ఇకనుంచి దీనికి దూరంగా ఉండాలని న్యాయనిపుణుడు సోలి సొరాబ్జీ అన్నారు.

అఖిల భారత ముస్లిం మహిళా పర్సనల్ లా బోర్డు (ఏఐఎండబ్ల్యూపీఎల్బీ)తోపాటు పిటిషనర్లు ఫరాహ్ ఫయాజ్, జాకియా సుమన్, నూర్జహాన్ నయాజ్ స్పందిస్తూ యుద్ధంలో సగం విజయం మాత్రమే సాధించాం అని పేర్కొన్నారు. చట్టం రూపొందించే వరకు దీనికి విరుగుడు లేదని రాష్ట్రవాది ముస్లిం మహిళా సంఘ్ అధ్యక్షురాలు ఫరాహ్ ఫయాజ్ అన్నారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బీఎంఎంఏ) ప్రతినిధి నయాజ్ స్పందిస్తూ ముస్లిం మహిళలు ఇక ప్రాథమిక హక్కులు పొందగలరని అన్నారు.

ఈ తీర్పు సాంఘిక సంస్కరణల్లో నూతన అధ్యయాన్ని లిఖిస్తుందని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సహ వ్యవస్థాపకురాలు, పిటిషనర్లలో ఒకరైన జాకియా సుమన్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రముఖ స్కాలర్ జీనత్ షౌకత్ అలీ మాట్లాడుతూ ఇది అద్భుతమైన తీర్పు, హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇది ముస్లిం మహిళల విజయం. అంతకుమించి ఇస్లాం సాధించిన విజయం అని అఖిల భారత ముస్లిం మహిళా పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు షైష్టా అంబర్ అన్నారు. అఖిల భారత షియా పర్సనల్ లాబోర్డు కూడా ఇస్లాం విజయంగా, ముస్లిం మహిళల విజయంగా అభివర్ణించింది.

తీర్పు పూర్తి పాఠం చూడకుండా స్పందించలేమన్న ఏఐఎంపీఎల్బీ

తీర్పు పూర్తి పాఠం చూడకుండా స్పందించలేమన్న ఏఐఎంపీఎల్బీ

అఖిలభారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) అధికార ప్రతినిధి మౌలానా యాసూబ్ అబ్బాస్ స్పందిస్తూ ఈ తీర్పుతో మహిళలపై వేధింపులకు చరమ గీతం పాడినట్లేనన్నారు. బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా వలీ రెహ్మానీ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. బాలీవుడ్ కథానాయిక షబానా అజ్మీ.. ఏండ్ల తరబడి పోరాడుతున్న మహిళలు సాధించిన విజయంగా సుప్రీంకోర్టు తీర్పును అభివర్ణించారు. సుప్రీం తీర్పును సవివరంగా అధ్యయనం చేయకుండా స్పందించడం సరికాదని ఎఐఎంపీఎల్బీ వర్కింగ్ కమిటీ సభ్యుడు జాఫర్యాబ్ జిలానీ అన్నారు. వచ్చేనెల 10న భోపాల్‌లో జరిగే ఏఐఎంపీఎల్బీ వర్కింగ్ కమిటీ సమావేశంలో తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.. ఈ సమావేశంలో బాబ్రీ మసీదు కేసు అంశంపైనా చర్చిస్తామని జాఫర్యాబ్ జిలానీ చెప్పారు.

2015లో ఇలా సుప్రీం అభ్యర్థన

2015లో ఇలా సుప్రీం అభ్యర్థన

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని, ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి ముందు 2015 అక్టోబర్‌లో తొలిసారిగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అప్పటినుంచి రెండేండ్లపాటు విస్తృత చర్చకు దారితీసింది. 2015 అక్టోబర్ 16వ తేదీన వివాహ రద్దు విషయంలో ముస్లిం మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారా? అనే అంశాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. 2016 ఫిబ్రవరి ఐదో తేదీన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం.. వీటి రాజ్యంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణలో సహాయపడాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని కోరింది.

గతేడాది జూన్‌లో ట్రపుల్ తలాక్ పై ఇలా తొలిసారి

గతేడాది జూన్‌లో ట్రపుల్ తలాక్ పై ఇలా తొలిసారి

2016 మార్చి 28వ తేదీన కుటుంబ చట్టాల వెలుగులో వివాహం, విడాకులు, కస్టడీ, వారసత్వం వంటి అంశాల అధ్యయనానికి అత్యున్నత కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆలిండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డ్ సహా పలు సంస్థలు కక్షిదారులుగా చేర్చింది. 2016 జూన్ 29వ తేదీన రాజ్యాంగమే గీటురాయిగా ట్రిపుల్ తలాక్ అంశాన్ని పరిశీలిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ ఏడో తేదీన భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారిగా లింగ సమానత్వం, సెక్యులరిజం వంటి కోణాల్లో ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, ఇతర వ్యవహారాలను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది.

తమ సంప్రదాయాలపై విచారణకు ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకం

తమ సంప్రదాయాలపై విచారణకు ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకం

2017 ఫిబ్రవరి 14-16 తేదీల మధ్య విచారించిన ధర్మాసనం ట్రిపుల్ తలాక్‌పై వచ్చిన పరస్పర విరుద్ధమైన ఫిర్యాదులనూ ప్రధాన కేసుతోపాటే విచారించాలని నిర్ణయించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2017 మార్చి 27వ తేదీన న్యాయవ్యవస్థ పరిధిలో లేని అంశాలపై విచారణ సహేతుకం కాదని ముస్లిం పర్సనల్‌లా బోర్డ్ పేర్కొంది. మే11 నుంచి రాజ్యాంగ ధర్మాసనం అన్నికోణాల్లో విచారణ ప్రారంభిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ఏడాది మే 11,12 తేదీల్లో జరిగిన విచారణలో ముస్లిం మతవిశ్వాసాల్లో ఇవి మౌలికమైన అంశాలా? అనే అంశాలను పరిశీలిస్తామని ధర్మాసనం ప్రకటించింది. వివాహ రద్దుకు ట్రిపుల్ తలాక్ అనేది ముస్లింలలో కోరుకోదగ్గ విధానం కాదని వ్యాఖ్యానించింది.

ఇలా ట్రిపుల్ తలాక్ సుప్రీం తీర్పు

ఇలా ట్రిపుల్ తలాక్ సుప్రీం తీర్పు

2017 మే 15-16 మధ్య జరిగిన విచారణలో ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేస్తే, కొత్త చట్టం తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఏ మేరకు ట్రిపుల్ తలాక్‌ను అనుమతిస్తుందో పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ట్రిపుల్ తలాక్ అనేది 1400 ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్న నమ్మకమని, దానిని రాజ్యాంగ విశ్వసనీయత కోణంలో పరీక్షించలేమని ముస్లిం పర్సనల్‌లా బోర్డ్ వాదించింది. 2017 మే 17-18 మధ్య జరిగిన విచారణలో ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించే అధికారం బాధిత మహిళకు ఇవ్వబడుతుందా? అని ఏఐఎంపీఎల్‌బీని ధర్మాసనం ప్రశ్నించింది. ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో అంతర్భాగం కాదని కేంద్రం పేర్కొన్నది. గత మే 18వ తేదీన ట్రిపుల్ తలాక్‌పై తీర్పును రిజర్వ్ చేస్తున్న అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. తాజాగా మంగళవారం ట్రిపుల్ తలాక్ అన్యాయమైనదని, రాజ్యాంగ విరుద్ధమని, 3:2 నిష్పత్తిలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు. పార్లమెంటు ఆమోదం ద్వారా ఆరునెలల్లో చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

English summary
Shahi Imam of Delhi’s Jama Masjid Syed Ahmed Bukhari today said the issue of triple talaq would not have reached the Supreme Court, had the All India Muslim Personal Law Board (AIMPLB) not failed to address the problems of women “wronged” by the divorce practice. Bukhari said the stand of the AIMPLB, which “considers itself as a custodian” of the matters related to civil issues of the Muslim community in the country, was ambivalent in the matter of triple talaq.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X