మాణిక్‌కు చెక్, కమ్యూనిస్ట్ కోటాలో కాషాయ జెండా: త్రిపుర, నాగాలాండ్ బీజేపీవే, మేఘాలయలో ఉత్కంఠ

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో కమలం వికసించింది. త్రిపుర, నాగాలాండ్‌లలో బీజేపీ విజయం సాధించింది. మేఘాలయలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరో పది సీట్లు తక్కువ పడ్డాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది.
త్రిపురలో కమలం దెబ్బకి కమ్యూనిస్టుల కోట బీటలు వారింది. పాతికేళ్ల లెఫ్ట్ ప్రస్తానానికి బీజేపీ చెక్ చెప్పింది. త్రిపురలో బీజేపీ జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. బీజేపీ త్రిపురలో తొలుత వెనుకబడినట్లు కనిపించినా ఆ తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.
త్రిపురలో బీజేపీ, మిత్రపక్షాలు 36, సీపీఎం 15, ఐపీఎఫ్‌టి, 8 రెండు స్థానాలు గెలవగా, నాగాలాండ్‌లో బీజేపీ 12, ఎన్డీపీపీ 17, ఎన్పీఎఫ్ 28, ఐఎన్డీ 1, ఇతరులు రెండు స్థానాల్లో గెలిచారు. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మేఘాలయలో కాంగ్రెస్ 21,ఎన్పీపీ 19, యూడీపీ 6, పీడీఎఫ్ 4, ఇతరులు 9 స్థానాలు గెలుచుకున్నారు.
త్రిపురలో చచ్చీచెడి సీపీఎం గెలుపు దిశగా
- త్రిపుర, నాగాలాండ్‌లలో బీజేపీ, మిత్రపక్షాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని రామ్ మాధవ్ అన్నారు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి మంచి ఫలితాలు ఇస్తాయన్నారు.
- మేఘాలయలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పరిశీలకులు కమల్ నాథ్, అహ్మద్ పటేల్‌లు ఢిల్లీ నుంచి మేఘాలయకు బయలుదేరారు.
- నాగాలాండ్‌లో ఎన్పీఎఫ్ కూటమి ఆధిక్యంలో ఉంది.
- త్రిపురలో హోరాహోరీ పోరీలో లెఫ్ట్ కొంత పైచేయి సాధించింది. ఏమాత్రం ప్రభావం లేని బీజేపీ సీపీఎంకు చుక్కలు చూపించింది. బీజేపీ గెలుస్తుందన్న అంచనాలు వచ్చాయి. అయితే సీపీఎంకు చుక్కలు చూపిన బీజేపీ రెండోస్థానంతో సరిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెజార్టీ వచ్చినా గతంతో పోల్చుకుంటే చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా సీపీఎం గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా పాలిస్తున్న సీపీఎంకు గత ఎన్నికల్లో 49 సీట్లు గెలిచింది.
- నాగాలాండ్‌లో సీఎం జలియాంగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
- త్రిపురలో పలు లెఫ్ట్ పార్టీ కంచుకోటల్లో బీజేపీ పాగా వేసింది.
- తొలుత వెనుకంజలో ఉన్న బీజేపీ సీఎం అభ్యర్థి, బీజేపీ చీఫ్ బిప్లవ్ కుమార్ దేవ్ ఆ తర్వాత ముందంజలోకి వచ్చారు.
- మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.
- కృష్ణపూర్‌లో గెలుపుబాటలో ఉన్న మంత్రి ఖగేంద్ర మృతి చెందారు.
కొంత ముందంజలో సీపీఎం
- త్రిపురలో బీజేపీ-సీపీఎం మధ్య హోరాహోరీ నడుస్తోంది.
- బీజేపీ కంటే సీపీఎం కొంత ముందంజలో ఉంది.
- తొమ్మిది గంటల సమయానికి త్రిపురలో సీపీఎం 23, బీజేపీ 22, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
- మేఘాలయలో ఎన్పీపీ 11, బీజేపీ 4, కాంగ్రెస్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది.
- నాగాలాండ్‌లో బీజేపీ 12, ఎన్పీపీ 3, కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది.
నాగాలాండ్‌లో బీజేపీ ముందంజ, త్రిపురలో సీపీఎంకు గట్టి పోటీ
- నాగాలాండ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. మేఘాలయలో - కాంగ్రెస్, ఎన్పీపీలు పోటాపోటీగా ఉన్నాయి.
- సీపీఎంకు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది.
- బనమాలిపూర్‌లో బీజేపీ చీఫ్ బిప్లవ్ కుమార్ దేవ్ వెనుకంజలో ఉన్నారు.
- ధనపూర్‌లో మాణిక్ సర్కార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
- త్రిపురపై అందరి దృష్టి ఉంది. నాగాలాండ్, మేఘాలయలలో హంగ్ వస్తుందని చెబుతున్నారు.
- త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

త్రిపురపై అందరి దృష్టి
కమ్యూనిస్టులకు త్రిపుర కంచుకోట. దశాబ్దాలుగా ఇక్కడ ఆ పార్టీదే ఆధిపత్యం. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈసారి బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ కనిపించింది. మార్పు నినాదంతో బీజేపీ బరిలోకి దిగింది. నాలుగు దఫాలుగా సీఎం పదవిలో కొనసాగుతూ అవినీతి మరక అంటని మాణిక్ సర్కార్ సీపీఎం ప్రధాన బలం. ప్రధాన బలం సీపీఎం, బీజేపీల మధ్యనే ఉంది.

ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారంటే
60 స్థానాలకు గాను సీపీఎం 58 స్థానాల్లో మిత్రపక్షాలైన సిపిఐ, ఫార్వార్డ్ బ్లాక్‌లు ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. బీజేపీ 51 స్థానాల్లో, మిత్రపక్షం ఐపీఎఫ్టీ 9 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 59 స్థానాల్లో, టీఎంసీ 24 స్థానాల్లో పోటీ చేశాయి.

మూడు రాష్ట్రాల్లో 59 స్థానాల్లో పోలింగ్
మేఘాలయ, నాగాలాండ్‌లలో కూడా అరవై చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లోను 59 స్థానాల్లోనే ఎన్నిక జరిగింది. ఎందుకంటే త్రిపురలో సీపీఎం అభ్యర్థి ఒకరు ఎన్నికలకు ముందు మృతి చెందారు. మేఘాలయలో ఓ ఎన్సీపీ అభ్యర్థి ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ అధ్యక్షులు నెయిపుయి రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎగ్జిట్ పోల్ అంచనాలు
ఈశాన్యంలో ఏడు రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ ఇప్పటికే 3 రాష్ట్రాల్లో జెండాను ఎగరవేసింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో గెలుస్తారని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్‌లలో బీజేపీ గెలుస్తుందని, మేఘాలయలో హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయి.