కళంకితులు.. కాదంటే సంపన్నులే అధికం.. త్రిపురలో బీజేపీ అభ్యర్థుల రికార్డు
అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించేశారు. ప్రధాని నరేంద్రమోదీ మరో అడుగు ముందుకేసి పురాతన కాలం నాటి 'మాణిక్ సర్కార్'ను పక్కనబెట్టి 'వజ్రా'న్ని ఎంచుకోవాలన్నారు. హీరా నినాదం అందుకోవాలని త్రిపుర వాసులకు పిలుపునిచ్చారు. కానీ 60 స్థానాలు గల త్రిపుర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీలో ఉన్నవారిలో అత్యధికులు క్రిమినల్ నేరాభియోగాలు ఉన్నవారు.. ఆర్థికంగా సంపన్నులైన మిలియనీర్లు అంటే అతిశయోక్తి కాదు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 51 మంది అభ్యర్థుల్లో 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కాకపోతే ప్రత్యర్థులెవరైనా క్రిమినల్ నేరస్థులను బరిలోకి దించితే మాత్రం విపక్షాలన్నీ కళంకితం అని కమలనాథులు అదేపనిగా ప్రచారం చేస్తుంటారు అది వేరే సంగతి.
ఇక మరో 18 మంది అభ్యర్థులు మిలియనీర్లుగా ఉన్నారు. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అటు త్రిపురలో అధికారంలో ఉన్న సీపీఎం జాతీయ పార్టీలే. కానీ సీపీఎం తరఫున పోటీ చేస్తున్న వారిలో క్రిమినల్ నేరాభియోగాలు ఉన్న వారు గానీ, సంపన్నులు గానీ చాలా తక్కువ మంది ఉన్నారని ఎన్నికల వాచ్ డాగ్ 'అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది.

అభ్యర్థుల్లో మిలియనీర్లు 11 శాతం మంది
మొత్తం 60 స్థానాలకు అన్ని పార్టీల నుంచి 22 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఏడీఆర్ తెలిపింది. ఇది 7.45 శాతం. ఒక మిలియనీర్ల సంఖ్య మొత్తం అభ్యర్థుల్లో 11 శాతం. రమారమీ 35 మంది అభ్యర్థుల చర, స్థిరాస్థులు రూ.కోటికి పైగా ఉన్నాయి. ఈ నెల 18న త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. బీజేపీ తర్వాత కళంకితులు అత్యధికంగా పోటీ చేస్తున్న పార్టీ కాంగ్రెస్. ‘హస్తం' పార్టీ తరఫున పోటీలో ఉన్న59 మంది అభ్యర్థులకు గానూ నలుగురు అభ్యర్థులపై క్రిమినల్ నేరాలు ఉన్నాయి. 57 స్థానాలకు పోటీ చేస్తున్న సీపీఎంకు చెందిన ఇద్దరు అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక ఐపీఎఫ్టీ నుంచి పోటీ చేస్తున్న 9 మందిలో ఇద్దరు, త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న 24 మందిలో ఒకరిపైన క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి.

అతి తక్కువగా ఐపీఎఫ్టీ, త్రుణమూల్ నుంచి ఒక్కొక్కరే
త్రిపురలో క్రిమినల్ నేరాభియోగాలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నారని త్రిపుర ఎన్నికల వాచ్ సమన్వయకర్త బిశ్వేందు భట్టాచార్జీ చెప్పారు. 35 మంది అభ్యర్థుల్లో రూ.కోటికి పైగా ఆస్తులు ఉన్నవారు బీజేపీ నుంచి 18 మంది, కాంగ్రెస్ పార్టీ తరఫున తొమ్మిది మంది, సీపీఎం నుంచి నలుగురు కోటీశ్వరులు, ఐఎన్పీటీ నుంచి ఇద్దరు, ఐపీఎఫ్టీ, త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీల నుంచి ఒక్కొక్కర్లు మిలియనీర్లు అని భట్టాచార్జీ చెప్పారు.

బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు అత్యంత సంపన్నులు
చార్లియామ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జిష్ణు దేవ్వర్మ ఆస్తుల విలువ రూ.11 కోట్ల పైమాటే. ఇక త్రిపుర పీపుల్స్ పార్టీ అభ్యర్థులు ఖగేంద్ర రియాంగ్, పర్కారాయ్ రియాంగ్ కేవలం రూ.100 మాత్రమేనని అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇద్దరు స్వతంత్ర్య అభ్యర్థులు సుదర్శన్ మజుందార్, కంచాయి మోగ్ తమకు ఆస్తులే లేవని డిక్లేర్ చేశారు. సుమారు 78 శాతం మంది అభ్యర్థులు తమ ఐటీ రిటర్న్స్ వివరాలు వెల్లడించనేలేదు. వారిలో ముగ్గురు బీజేపీ, ఒకరు కాంగ్రెస్ నుంచి అత్యధిక ఆస్తులు కలిగిన ఉన్నవారు కావడం గమనార్హం. బీజేపీ అభ్యర్థి జితేంద్ర మజుందార్ అత్యధికంగా ఏడు కోట్ల రూపాయల రుణాలు చెల్లించాల్సి ఉన్నది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద రుణాలు తీసుకున్న వారిలో 110 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో జితేంద్ర మజుందార్ మొదటి స్థానంలో ఉన్నారు.

అభ్యర్థుల్లో ఒక్కరే నిరక్షరాస్యులు
ప్రతి పది మంది అభ్యర్థుల్లో ఆరుగురు ఉన్న విద్యనభ్యసించారు. ఒక అభ్యర్థి మాత్రం నిరక్షరాస్యులు. మొత్తం 173 మంది అభ్యర్థులు ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. 121 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేషన్, ఫై చదువులు చదివారు. కాగా 24 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉండటం గమనార్హం. కాకపోతే ప్రధాన పార్టీలన్నీ ‘ఆకాశంలో సగం' మహిళల అభ్యున్నతికి పోరాడుతామని పదేపదే చెబుతుంటాయి. ఆచరణలో ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చే సరికి మహిళల పట్ల అన్ని పార్టీలు చిన్న చూపే చూస్తాయనడానికి త్రిపురలో పోటీలో ఉన్న మహిళా అభ్యర్థులే నిదర్శనం.