త్రిపురలో పౌరసత్వ బిల్లుపై ఆందోళనలు తీవ్రం... ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలలో ఆందోళనలు మిన్నంటాయి. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఇఎస్‌ఓ)తో సహా పలు యువజన సంఘాలు, వివిధ గిరిజన పార్టీలు చేపట్టిన ఈ ఆందోళనలతో సాధారణ జన జీవనం స్తంభించింది. దీంతో త్రిపురలో ఇంటర్ నెట్ సేవలతో పాటు ఎస్ఎమ్మెఎస్ సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసింది. ఆందోళనలు, నిరసనల ఈ నేపథ్యంలోనే మొబైట్ ఇంటర్నెట్ సేవలతో పాటు ఇతర ఎస్ఎమ్మెఎస్ సేవలను వీటిని 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

సోషల్ మీడియాలో రూమర్స్
పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం రాత్రి లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీంతో బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళనలు రవాణాపై తీవ్ర ప్రభావం చూపాయి. రోడ్డు, రైలు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణీకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆందోళనకారులు వాహనాలు, రైళ్ళ రాకపోకలను అడ్డుకున్నారు. ఆందోళనల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేకపోయినా ఆందోళనల స్వరూపం మారుతుండడంతో సోషల్ మీడియాలో రూమర్స్ కొనసాగుతున్నట్టు పోలీసులు గమనించారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ సేవలను 24 గంటల పాటు రద్దు చేశారు.

ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
ఇక పౌరసత్వ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆందోళనలు కొనసాగాయి. గిరిజన ఆధారిత పార్టీల ఆధ్వర్యంలో బంద్ పాటించగా, ఆందోళన కారులు రహదారులను దిగ్బంధించారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రోడ్లు దిగ్బంధించిన వారిని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు నిర్బంధించారు.

ఉనికి ప్రమాదమని అందోళన
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర పారా మిలటరీ బలగాలు, త్రిపుర రాష్ట్ర రైఫిల్స్‌తో సహా భద్రతా బలగాలు ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో పెద్ద సంఖ్యలో మోహరించాయి. మరోవైపు అగర్తాలా, మీజోరాంలలో సైతం నిరసనలు చెలరేగాయి. బిల్లు కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు వలసలు పెరిగితే తమ సంస్కృతి సాంప్రదాయాలకు ముప్పు వాటిల్లుతుందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.