భార్య అత్తను హత్య చేసి, ముక్కలుగా నరికాడు, పిల్లలు ముందే కిరాతకం, అల్లాడిపోయారు
అగర్తాలా: త్రిపుర రాష్ట్రంలో దారుణ ఘటన చేసుకుంది. అత్తింటికి వెళ్లిన వ్యక్తి.. అతని భార్య, అత్తను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత వారి శరీరాలను ముక్కలు ముక్కలు చేశాడు. ఇదంతా అతని పిల్లల ముందే చేయడం గమనార్హం. దీంతో వారు భయంతో కేకలు వేశారు. ఆ తర్వాత నిందితుడు కూడా విషం తాగాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.

రక్తపు మడుగులో భార్య, అత్త.. వణికిపోయిన పిల్లలు
ఈ ఘటన సోమవారం ధలాయి జిల్లాలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇద్దరు మహిళలు రక్తపు మడుగులో ఉండగా.. నిందితుడి పిల్లలు భయంతో ఏడుస్తూ గదిలో మూలకు కూర్చున్నారు. నిందితుడు త్రిపుర రాజధాని నగరం అగర్తాలాకు ఏడు కిలోమీటర్ల దూరంలోని హపనియా ప్రాంతానికి చెందిన వ్యక్తని తెలిపారు.

నిందితుడి శరీరంలో విషం..
ఈ ఘోరానికి దెబడిన నిందితుడ్ని మేము అరెస్ట్ చేశాం. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించాం. అతని శరీరంలో విషం ఉన్నప్పటికీ.. అతని ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు. ఈ హత్యలు ఎందుకు చేశాడనేది ఇప్పటి వరకు తెలియరాలేదని, తమ విచారణలో బయటపడనుందని పోలీసులు చెప్పారు.

విడాకులు తీసుకున్నప్పటికీ..
అగర్తాలలోని జీబీపీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిందితుడ్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుడి పిల్లలను ధలాయి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ కు అప్పగించినట్లు తెలిపారు. కాగా, గత నాలుగు నెలల క్రితం నుంచి నిందితుడి భార్య, పిల్లలు కూడా ఆమె తల్లి దగ్గరే ఉంటున్నారు. కాగా, నిందితుడు భార్యకు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆ విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. భార్యభర్తల మధ్య వివాదాలే ఈ హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, నిందితుడ్ని తమక అప్పగించాలని, తామే అతడ్ని శిక్షిస్తామంటూ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.