పూర్తయిన ఎంపిక.. ఉత్తరాఖండ్ సీఎం ఈయనే..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం ఎంపికకు సంబంధించి శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో రావత్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఠాకూర్ వర్గానికి చెందిన రావత్ తన రాజకీయ కెరీర్ ను ఆరెస్సెస్ తో మొదలుపెట్టారు. ఆయన వయసు 56 ఏళ్లు.
శనివారం డెహ్రాడూన్ లో జరిగే కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ లో బీజేపీ మొత్తం 56 సీట్లు నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
అంతకుముందు ఈ పదవికి మొదట సత్పాల్ మహరాజ్, ప్రకాశ్ పంత్ తదితరుల పేర్లు వినిపించినప్పటికీ.. త్రివేంద్ర సింగ్ రావత్ వారిందరికంటే ముందంజలో నిలిచారు. ఈయనకు ఆరెస్సెస్ నుంచి గట్టి మద్దతు ఉంది.
అంతేకాదు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విశ్వాసాన్నీ రావత్ చూరగొన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి పనిచేయడం రావత్ కు బాగా కలిసొచ్చింది. అప్పుట్లో అమిత్ షాకు ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యత అప్పగించగా, త్రివేంద్ర ఆయనకు డిప్యూటీగా పని చేశారు.