TRP రేటింగ్స్ గోల్‌మాల్: ముంబై పోలీసులకు చిక్కిన అర్నాబ్ గోస్వామి న్యూస్ ఛానెల్
ముంబై: ఈ మధ్యకాలంలో టీఆర్పీ రేటింగ్‌ల కోసం టీవీ ఛానెళ్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని అవాస్తవ వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఇక టీవీ ఛానెళ్లు నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పేందుకు టీఆర్పీ రేటింగ్స్‌నే పరిగణలోకి తీసుకుంటారు. నీతి వాక్యాలు బోధించే పలు వార్తా ఛానెళ్లు తెరవెనుక టీఆర్పీ రేటింగ్స్‌ను మ్యానుపులేట్ చేస్తున్నాయన్న అసలు నిజం వెలుగులోకి ఆలస్యంగా వచ్చింది. ఇందులో ప్రముఖ జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీతో పాటు మరో రెండు న్యూస్ ఛానెల్స్‌ను ముంబై పోలీసులు గుర్తించారు.

టీఆర్‌పీ రేటింగ్స్‌ను మేనేజ్ చేసిన రిపబ్లిక్ టీవీ
టీవీ ఛానెల్స్ అసలు బాగోతం బయటపడింది. ఉదయం లేచిన దగ్గర నుంచి తమదే ఎక్స్‌క్లూజివ్ కవరేజ్ అంటూ ఊదరగొట్టే ఛానెల్స్ బండారం బయట పడింది. ఒక ఛానెల్ అగ్రస్థానంలో ఉందని చెప్పేందుకు ఆధారం టీఆర్పీ రేటింగ్స్. అయితే ఇక్కడ కూడా పలు ఛానెళ్లు రేటింగ్స్‌ను గోల్‌మాల్ చేస్తున్నాయి. ఇక మొదటి నుంచి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు, బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారాలను అరవీర భయంకరంగా కవర్ చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకున్న అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ ఛానెల్ డొల్లతనం బయటపడింది. ఆ ఛానెల్ యాజమాన్యం టీఆర్‌పీ రేటింగ్స్‌ను మేనేజ్ చేస్తోందంటూ ముంబై పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇందులో ఒకరు టీవీల్లో పీపుల్స్ మీటర్స్ అనే పరికరంను ఇన్స్‌టాల్ చేసే సంస్థ మాజీ ఉద్యోగని పోలీసులు తెలిపారు. పీపుల్స్ మీటర్ అనేది ఒక పరికరం. దీన్ని టీవీల్లో ఉంచుతారు. ఇదే రేటింగ్స్‌ను రికార్డ్ చేస్తుంది.

రిపబ్లిక్ టీవీ యాజమాన్యంకు సమన్లు
టీఆర్‌పీ రేటింగ్‌లో అగ్రస్థానంలో తమ ఛానెల్ ఉందని చెప్పుకుంటున్న రిపబ్లిక్ టీవీకి నేడో రేపో సమన్లు జారీ చేస్తామని ముంబై పోలీసులు తెలిపారు. న్యూస్ ట్రెండ్స్, తప్పుడు వార్తల ప్రసారం చేస్తున్నాయన్న అనుమానాలు రావడంతో విచారణ చేయగా టీఆర్‌పీ రేటింగ్స్‌ను మేనేజ్ చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ సమాచారం కేంద్రప్రభుత్వంకు అందజేశామని వెల్లడించారు. ఇక టీఆర్‌పీ రేటింగ్స్‌ను మేనేజ్ చేస్తున్న మూడు ఛానెల్స్‌ను గుర్తించడం జరిగిందని వాటికి సంబంధించిన బ్యాంకు ఖాతాలపై కూడా విచారణ జరుపుతామని ముంబై పోలీసులు చెప్పారు. ఈ ఛానెల్స్‌కు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి... బెదిరించి నిధులు రాబట్టారా, యాడ్స్ ఎలా వస్తున్నాయి అనే అంశాలను కూడా పరిశీలిస్తామని ముంబై పోలీస్ చీఫ్ పరమ్‌వీర్ సింగ్ చెప్పారు. ఇక రిపబ్లిక్ టీవీ టీఆర్‌పీ రేటింగ్స్‌ను కొనుగోలు చేసిందని ఇప్పుడే ముంబై పోలీసులు చెప్పారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.

కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు
ఇదిలా ఉంటే రిపబ్లిక్ టీవీ చేసిన తప్పును సమర్థించుకునే పనిలో పడింది. గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ముంబై పోలీస్ చీఫ్ పరమ్‌వీర్ సింగ్‌ను రిపబ్లిక్ టీవీ ప్రశ్నలు అడిగినందునే తమ ఛానెల్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ తమ టీవీలో ప్రకటన విడుదల చేసింది. పరమ్‌వీర్ సింగ్‌పై పరువునష్ట దావా వేస్తామంటూ ఛానెల్‌లో ప్రకటన ప్రసారం చేసింది. బార్క్ రేటింగ్స్‌ను మేనేజ్ చేస్తోందంటూ చెప్పేందుకు ఒక్క ఆధారం కూడా లేదని చెప్పిన రిపబ్లిక్ టీవీ...దేశ ప్రజలకు తమ ఛానెల్ నిజాయితీ నిబద్ధత గురించి తెలుసునని ప్రకటన విడుదల చేసింది. ఇలా తమను టార్గెట్ చేయడం వల్ల బెదిరేది లేదని మరింత గట్టిగా పనిచేస్తామని వెల్లడించింది.

టీఆర్‌పీ రేటింగ్స్‌ను ఎలా మేనేజ్ చేశారు
టీఆర్‌పీ రేటింగ్స్ గోల్‌మాల్ వ్యవహారంలో ఎంత పెద్ద వారున్నా వదిలేది లేదని వారిని పిలిచి విచారణ చేస్తామని ముంబై పోలీస్ బాస్ పరమ్‌వీర్ సింగ్ చెప్పారు. విచారణలో భాగంగా ఏదైనా నేరం జరిగిందని రుజువైతే వెంటనే వారి ఖాతాలను స్తంభింపజేస్తామని వెల్లడించారు. టీఆర్‌పీ రేటింగ్స్ మేనేజ్ చేసేందుకు ప్రతి ఇంటికి చెందిన సమాచారం సేకరించడం జరిగిందని పోలీసులు తెలిపారు. తప్పుడు రేటింగ్స్ చూపించి తద్వారా అక్రమంగా అడ్వర్టైజ్‌మెంట్ రూపంలో నిధులు పొందారని ఇది కచ్చితంగా మోసం చేయడమే అవుతుందని పోలీస్ చీఫ్ చెప్పారు.

యాడ్స్ కోసం అడ్డదారి తొక్కారా..
టీఆర్‌పీ రేటింగ్స్ తప్పుగా చూపించడమే కాదు.. వాటిని కొనుగోలు చేశారని పోలీసులు చెప్పారు. ఇదంతా కేవలం అడ్వర్టైజ్‌మెంట్స్ కోసమే చేశారని వెల్లడించారు. ఇందులో భాగంగానే ఫలానా ఛానెల్ ఎప్పుడూ ఆన్ చేసి ఉంచాలని చెప్పినట్లు పోలీసులు చెప్పారు. ఇక పెద్దగా చదువుకోని కుటుంబాల వారి ఇళ్లలో ఇంగ్లీష్ ఛానెల్ పెట్టి ఉంచాలని అదే పనిగా చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం నెలకు రూ. 500 చెల్లించేవారని తమ విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.