వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఎంఐఎం తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్ఎస్ సర్కారు కూలుతుంది’ - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఎంఐఎం తలుచుకుంటే తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు నెలల్లో కూలిపోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారంటూ 'ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

'నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి, కళ్లు తెరిచిన’ టీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ చిలుక పలుకులు పలుకుతున్నారని అహ్మద్ ఖాన్ ఎద్దేవా చేశారు.

తమ‌ పార్టీ ఇలాంటి నాయకులను ఎంతో మందిని చూసిందని అన్నారు.

''మా పార్టీ‌ పూర్వ అధినేత సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ చెప్పినట్టుగా రాజకీయం మాకు మా ఇంటి గుమస్తాతో సమానం’’ అని అహ్మద్ ఖాన్ అన్నారు.

''రాజకీయాల్లో మాకు ఒకరిని కుర్చీ మీద కూర్చోబెట్టడమూ తెలుసు. దించేయడమూ తెలుసు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

సర్జరీ

'ఆయుర్వేద వైద్యులూ సర్జరీ చేయొచ్చు’

ఆయుర్వేద వైద్యులు కూడా సర్జరీలు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని 'ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.

ఆయుర్వేదంలో పోస్టుగ్రాడ్యుయేట్‌(పీజీ) విద్యార్థులకు శస్త్రచికిత్సల్లో శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం పీజీ ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌-2016 (ఆయుర్వేద విద్య) రెగ్యులేషన్స్‌కు సవరణలు చేసి తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

దీని ప్రకారం పీజీ పూర్తయిన విద్యార్థులు నిరపాయకార కణితులు తొలగించడం, దంత, కంటి, ముక్కు సంబంధిత శస్త్రచికిత్సలు స్వతంత్రంగా నిర్వహించొచ్చు. అయితే.. తాజా ఉత్తర్వుల్లో కేవలం 58 శస్త్రచికిత్సలకు మాత్రమే అనుమతిచ్చామని కేంద్రం స్పష్టంచేసింది.

ప్రాచీన ఆయుర్వేదంలో అధునాతన వైద్యాన్ని కలిపే ప్రయత్నం జరుగుతుందన్న విమర్శలను ఖండించింది.

ఇది కొత్త విధానం కాదని, ఇప్పటికే ఉన్న నిబంధనలకు సవరణలు చేయడం ద్వారా స్పష్టత ఇచ్చామని ఆయుష్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేశ్‌ కోటేచా తెలిపారు.

ఈ నిర్ణయంపై ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని తిరోగమన చర్యగా అభివర్ణించింది. వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది.

'పోలవరం ప్రాజెక్టు నిషిద్ధ ప్రాంతమా?’

''పోలవరం ప్రాజెక్టు నిషిద్ధ ప్రాంతమా? అక్కడికి వెళ్లకుండా అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు?’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు 'ప్రజాశక్తి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శనకు బయలుదేరిన సీపీఐ నాయకులను గృహ నిర్బంధంలోకి తీసుకోవడం, అరెస్టు చేయడాన్ని చంద్రబాబు నాయుడు ఖండించారు.

''ప్రజాపక్షంగా పనిచేసే ప్రతిపక్షాలపై దాడి చేయడం అంటే అది ప్రజలపై దాడి చేయడమే. వైఎస్సార్సీపీ అప్రజాస్వామిక పోకడలను ప్రతి ఒక్కరూ ఖండించాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఏడాదిన్నరగా పోలవరం పనులపై నిర్లక్ష్యం ముంపు బాధితుల పునరావాసాన్ని గాలికి వదిలేశారనీ, ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు కూడా తగ్గించనున్నట్లు కథనాలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.

72 శాతం పనులను టీడీపీ ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసిందని, వైఎస్సార్సీపీ 18 నెలల పాలనలో పోలవరం నిర్లక్ష్యానికి గురైందని చంద్రబాబు ఆరోపించారు.

కేటీఆర్

'బీజేపీలో విషయం లేదు... విషమే ఉంది’

ప్రజలకు చేసిన పనులను వివరిస్తూ రాజకీయ పార్టీలు ఓట్లు అడుగుతుంటాయని, బీజేపీ మాత్రం విషం చిమ్ముతూ ఓట్లు అడుగుతుందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు 'సాక్షి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

''ఎవరైనా మేమిది చేశాం, ఇంకా ఇవి చేస్తామని చెప్పి ఓట్లడుగుతారు. కానీ బీజేపీ దగ్గర విషయం లేదు. ఎందుకంటే వాళ్లు హైదరాబాద్‌కు చేసిందేమీ లేదు. అందుకే విషం చిమ్ముతున్నారు. ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో నాలుగు ఓట్ల కోసం మతం పేరిట చిచ్చుపెట్టాలని చూస్తున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.

74 లక్షల మంది ఓట్లు వేసే గ్రేటర్‌ ఎన్నిక ప్రజాభిప్రాయానికి ప్రతీక (రిఫరెండం) కాదని తాను అనడం తప్పు అవుతుందని... కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముఖ్యమైనవేనని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగని ఈ ఎన్నికను భూతద్దంలో చూడాల్సిన పనికానీ, విస్మరించాల్సిన అవసరం కానీ లేదు అని అన్నారు.

''మేము పనిచేశాం కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు మాకు బలమైన మెజారిటీ ఇస్తారు’’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్‌ పాత్ర అత్యంత కీలకమని‌.. మరో మూడేళ్లలో నాలా అభివృద్ధి పథకాన్ని ప్రాధాన్యంగా తీసుకుని హైదరాబాద్‌ నగర రూపురేఖలు మారుస్తామని చెప్పారు.

జీహెచ్‌ఎంసీతో పాటు పరిసర మున్సి పాలిటీలు, కార్పొరేషన్లను 'గ్రేటర్‌ హైదరాబాద్‌ అథారిటీ’ పేరిట ఒకే గొడుగు కిందకు తెచ్చే ఆలోచన ఉందన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
TRS government will collapse in two months if MIM concentrates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X