బెంగళూరులో బంధువుల ఇంటికి వచ్చి తల్లీ, కుమార్తె బలి, మృత్యువు రూపంలో వచ్చిన లారీ !
బెంగళూరు: బెంగళూరులోని బంధువుల ఇంటికి వెలుతున్న సమయంలో లారీ ఢీకొని తల్లీ, కుమార్తె దుర్మరణం చెందారు. తమిళనాడు నుంచి బెంగళూరు వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో మృత్యువురూపంలో వచ్చిన వాహనం డీకొనడంతో ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
తమిళనాడుకు చెందిన వెల్లాచి (75), ఆమె కుమార్తె వసంత (45) బెంగళూరులోని బాణసవాడిలో నివాసం ఉంటున్న బంధువులను చూడటానికి సోమవారం ఉదయం బెంగళూరు వచ్చారు. బాణసవాడిలోని బాబుసాబ్ పాళ్య లో బస్సు దిగి రోడ్డు దాటడానికి ప్రయత్నించారు.

ఆ సందర్బంలో టిన్ ఫ్యాక్టరీ-హెబ్బాళ రింగ్ రోడ్డులో వేగంగా వెలుతున్న లారీ రోడ్డు దాటుతున్న వెల్లాచి, వసంతలను ఢీకొనింది. ఈ ప్రమాదంతో తల్లీ, కుమార్తె సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనాడు.
విషయం తెలుసుకున్న బాణసవాడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లారీ స్వాధీనం చేసుకుని పరారైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని బాణసవాడి పోలీసులు తెలిపారు.