టీటీవీ దినకరన్ రివర్స్ గేర్: కొత్త పార్టీ ఎందుకు, పన్నీర్ సెల్వం ఎఫెక్ట్, సీఎం ఫైర్ !
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలను బయటకు పిలిపించి వారిని ఎటూ కాకుండా చేసిన టీటీవీ దినకరన్ ఇప్పుడు మరో తీవ్రస్థాయి చర్చకు దారితీశారు. టీటీవీ దినకరన్ కొత్త రాజకీయ పార్టీ పెడుతారని రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. అయితే పన్నీర్ సెల్వం ఎఫెక్ట్ తో టీటీవీ దినకరన్ ఒక్క సారిగా రివర్స్ గేర్ వేసి కొత్త పార్టీనా? ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.

గంటల్లోనే రివర్స్
కొత్త రాజకీయ పార్టీ విషయంపై త్వరలో క్లారిటీ ఇస్తానని బుధవారం ఉదయం టీటీవీ దినకరన్ చెప్పారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చిన టీటీవీ దినకరన్ కొత్త రాజకీయ పార్టీనా ఎందుకు అని మీడియానే ప్రశ్నించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
Recommended Video


నాలక్షం అదే
ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వంను పదవి నుంచి తప్పించి వారి చేతుల్లో ఉన్న అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం స్వాధీనం చేసుకోవడమే నాలక్షం అని టీటీవీ దినకరన్ మీడియాకు చెప్పారు. ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం గాలిలో దీపంలాంటిది, అది ఎప్పుడు ఆరిపోతుందే వారికే తెలీదని టీటీవీ దినకరన్ ఎద్దేవ చేశారు.

హైకోర్టులో పన్నీర్
బుధవారం మద్రాసు హైకోర్టు పన్నీర్ సెల్వం, ఆయన వర్గానికి మీ ఎమ్మెల్యేల పదవి మీద, అనర్హతవేటు విషయంలో మీమీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఫిబ్రవరి 5వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ విషయం తెలుసుకున్న టీటీవీ దినకరన్ కొత్త పార్టీ విషయంలో వేచి చూడాలని నిర్ణయించారని తెలిసింది.

పదవులు పోతాయి !
అన్నాడీఎంకే ప్రభుత్వంలో స్లీపర్ సెల్స్ ఉన్నాయని, త్వరలోనే బయటకు వస్తాయని టీటీవీ దినకరన్ కొంత కాలంగా చెబుతున్న విషయం తెలిసిందే. టీటీవీ దినకరన్ కొత్త పార్టీ పెడితే తాము బయటకు వెళితే ఉన్న పదవులు ఊడిపోతాయని కొందరు ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నారని తెలుసుకున్న టీటీవీ దినకరన్ కొంత వెనక్కి తగ్గారని సమాచారం.

సమయం ఉంది కదా ?
తమిళనాడులో త్వరలో స్థానిక, సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అంతవరకు అన్నాడీఎంకే పార్టీ చిహ్నం కోసం చట్టపరంగా మళ్లీ పోరాటం చెయ్యాలని టీటీవీ దినకరన్ నిర్ణయించారని ఆయన వర్గీయులు అంటున్నారు. అది సాధ్యం కాకపోతే కొత్త పార్టీ విషయం తరువాత ఆలోచించాలని టీటీవీ దినకరన్ నిర్ణయించారని తెలిసింది.

సీఎం ఫైర్
టీటీవీ దినకరన్ లాంటి వారు ఎన్ని రాజకీయ పార్టీలు పెట్టుకున్నా అన్నాడీఎంకే పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. శశికళ కుటుంబ సభ్యులు అందరూ ఏకం అయినా ఎంజీర్, జయలలిత ముందుకు నడిపించిన అన్నాడీఎంకే పార్టీని ఏమీ చెయ్యలేరని పళనిస్వామి చెప్పారు.

చివరికి రివర్స్ గేర్
టీటీవీ దినకరన్ ఎప్పుడు ఏమి చేస్తాడో, ఏం మాట్లాడుతారో ఆయన అనుచరులకే అర్థం కాదు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా రాజకీయం చేస్తున్న టీటీవీ దినకరన్ మద్రాసు హైకోర్టు పన్నీర్ సెల్వం వర్గానికి గడువు ఇవ్వడంతో కొంత కాలం వేచి చూడాలని కొత్త పార్టీ విషయంలో రివర్స్ గేర్ వేశారని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications