రెండు అరటి పండ్లకు రూ.442 బిల్లు ఎలా వేశారు: మారియట్‌కు నోటీసులు
చండీగఢ్ : రెండు అరటిపళ్లపై రూ. 442.50 బిల్లు విధించడంపై వివరణ ఇవ్వాలంటూ అసలు అంత మొత్తం బిల్లును ఏ ప్రాతిపదికన వేశారని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ జే డబ్ల్యూ మారియట్‌ను వివరణ కోరింది ఎక్సైస్ అండ్ టాక్సేషన్ డిపార్ట్మెంట్. ఈ మేరకు హోటల్‌కు షో కాజ్ నోటీసులు పంపింది. కొద్ది రోజుల క్రితం ఆ హోటల్‌కు వెళ్లిన ప్రముఖ బాలీవుడ్ నటులు రాహుల్ బోస్ రెండు తాజా అరటి పళ్లను ఆర్డర్ చేశాడు. అయితే బిల్లు చూసిన అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. రెండు అరటి పండ్లకు రూ.442. 50 రూపాయలా అంటూ ఆశ్చర్యపోయిన రాహుల్ బోస్ బిల్లును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే ఈ విషయం వైరల్ అయ్యింది.
సాధారణంగా తాజా అరటిపండ్లపై ఎలాంటి ట్యాక్స్ లేనప్పుడు ట్యాక్స్ ఎందుకు విధించారో చెప్పాలంటూ హోటల్ యాజమాన్యాన్ని వివరణ కోరింది ఆదాయపు పన్ను శాఖ. తాజా పండ్లు పన్ను పరిమితిలోకి రావని అసిస్టెంట్ ఎక్స్సైజ్ మరియు టాక్సేషన్ కమిషనర్ రాజీవ్ చౌదరి చెప్పారు. ఏ ప్రాతిపదికన బిల్లువేశారో వివరణ ఇవ్వాల్సిందిగా చండీగడ్‌లోని హోటల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఇక రాహుల్ బోస్ సోషల్ మీడియాలో జరిగిన తంతును పోస్టు చేయగానే చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ మరియు ఎక్సైస్ టాక్సేషన్ కమిషనర్ మన్దీప్ సింగ్ బ్రార్ విచారణకు ఆదేశించారు.
ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ టీమ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వివరణ ఇవ్వాల్సిందిగా ఈ టీమ్ హోటల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. శనివారంలోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది. ఒక నిర్ణయంకు రాక మునుపే వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నట్లు విచారణాధికారులు తెలిపారు. ఈ విచారణ ఒక న్యాయవాది ముందు జరుగుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు హోటల్ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
You have to see this to believe it. Who said fruit wasn’t harmful to your existence? Ask the wonderful folks at @JWMarriottChd #goingbananas #howtogetfitandgobroke #potassiumforkings pic.twitter.com/SNJvecHvZB
— Rahul Bose (@RahulBose1) July 22, 2019
ఇదిలా ఉంటే.. హోటల్ యాజమాన్యం ప్రభుత్వానికి పన్ను సక్రమంగా కడుతోందా లేదా అనేదానిపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. ఒకవేళ తప్పు చేసినట్లుగా తమ విచారణలో తేలితే హాటల్‌కు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.