సమాజ్ వాదీలోకి బీజేపీ, అప్నాదళ్ మాజీల క్యూ-ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు
ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమాజ్ వాదీ పార్టీకి అన్నీ శుభసూచికలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీని వీడిన ఇద్దరు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ మిత్రపక్షం అప్నాదళ్ కు గుడ్ బై చెప్పిన మరో ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ఇవాళ సమాజ్ వాదీ పార్టీలో చేరిపోయారు.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో వీరంతా ఇవాళ ఎస్పీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇవాళ ఎస్పీలో చేరిన వారిలో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీతో పాటు ఎమ్మెల్యేలు రోషన్‌లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, ముఖేష్ వర్మ, వినయ్ షాక్యా, భగవతి సాగర్, అప్నాదళ్‌కు చెందిన చౌదరి అమర్ సింగ్ ఉన్నారు. ఇద్దరు మంత్రులు ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, అధికార బిజెపికి గుడ్ బై చెప్పి ఇవాళ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్ వాదీ పార్టీలో చేరారు.

ఈరోజు బీజేపీ అంతం కోసం శంఖం మోగిందని, దేశ, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి.. వారి కళ్లలో దుమ్ము దులుపుకుని ప్రజలను దోపిడీ చేసింది బీజేపీ అని, వారిని ఇకనైనా తరిమికొట్టాలని,. ఉత్తరప్రదేశ్ దోపిడీ నుండి విముక్తి పొందాలని ఎస్పీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య వ్యాఖ్యలు చేశారు. మౌర్య రాజీనామా తర్వాతే బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వలసలు ప్రారంభమయ్యాయి. ఆయనకు మద్దతుగానే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మరోవైపు బీజేపీకి గుడ్ బై చెప్పిన మరో మాజీ మంత్రి దారా సింగ్ చౌహాన్ రాష్ట్రీయ లోక్ దళ్‌కు నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్యే అవతార్ సింగ్ భదానా రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.