
మొన్న హైదరాబాద్‌లో గే మ్యారేజ్.. నేడు లెస్బియన్ నిశ్చితార్థం: ఇదేం వైపరీత్యం
ముంబై: మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో ఇద్దరు స్వలింగ సంపర్కులు వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని ప్రభుత్వం గుర్తించదు. ఇది అనైతికంగానే భావిస్తుంది సమాజం కూడా. ఇప్పటిదాకా విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి మన దేశానికీ పాకింది. ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలిన ఇద్దరు స్వలింగ సంపర్కులు పంజాబీ అభయ్ డాంగే, బెంగాలీ సుప్రియో చక్రవర్తి..కొద్దిరోజుల కిందటే పెళ్లి పీటలు ఎక్కారు.

ఇద్దరు మహిళా డాక్టర్లు..
హైదరాబాద్ శంకర్ పల్లి వద్ద గల ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. బెంగాలీ సంప్రదాయంలో వారి వివాహం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటి గే వెడ్డింగ్‌గా గుర్తింపు తెచ్చుకుందీ వ్యవహారం. ఇప్పుడు ఇద్దరు లెస్బియన్లు పెళ్లి చేసుకోబోతోన్నారు. త్వరలో ఒక్కటి కాబోతోన్నారు. వారిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. నిశ్చితార్థం, పెళ్లికి వారి కుటుంబాలు కూడా అంగీకరించాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ నిశ్చితార్థాన్ని నిర్వహించారు.

కుటుంబ సభ్యులు వారించినా..
వారి పేర్లు పరోమిత ముఖర్జీ, సురభి మిత్ర. ఇద్దరూ డాక్టర్లే. చాలాకాలం నుంచీ వారి మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారు తమ కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. తొలుత వారు వ్యతిరేకించారు. మహిళలు పరస్పరం పెళ్లాడటమేమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో తలెత్తుకుని తిరగలేమంటూ ఆగ్రహించారు. కుటుంబ సభ్యులను నచ్చచెప్పడంలో సఫలం అయ్యారు.

రిలేషన్‌షిప్‌ను వివాహబంధంగా..
తమ మధ్య చాలాకాలం నుంచి రిలేషన్షిప్ ఉందని పరోమిత ముఖర్జీ తెలిపారు. దాన్ని వివాహబంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామని, ఈ విషయాన్ని తల్లికి చెబితే.. నిర్ఘాంతపోయిందని అన్నారు. తన లైంగిక కోరికలు ఎలా ఉన్నాయనే విషయంపై 2013లోనే తండ్రికి తెలుసునని, అందుకే ఆయన పెద్దగా ఆశ్చర్యపోలేదని చెప్పారు. తల్లి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించిందని పేర్కొన్నారు. తండ్రి కూడా నచ్చచెప్పడంతో అంగీకరించిందని వ్యాఖ్యానించారు.

ఇంట్లో వాళ్లు అడ్డు చెప్పలేదు..
తన స్నేహితురాలు పరోమిత ముఖర్జీని పెళ్లి చేసుకోవాలనుకున్న తన నిర్ణయాన్ని ఇంట్లో వాళ్లు అంగీకరించారని, అభ్యంతరం వ్యక్తం చేయలేదని సురభి మిత్ర చెప్పారు. తన నిర్ణయం తెలిసిన తరువాత.. తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారని అన్నారు. తాను సైకాలజిస్ట్‌నని, ఈ పెళ్లి పట్ల సొసైటీ ఎలా స్పందిస్తుందనే విషయంపై తనకు అవగాహన ఉందని అన్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసునని చెప్పారు.

త్వరలో గోవాలో పెళ్లి..
తామిద్దరం త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోన్నామని సురభి మిత్ర, పరోమిత ముఖర్జీ స్పష్టం చేశారు. గోవాలో వివాహ వేడుకలను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. తమ రెండు కుటుంబాలు, బంధువులు, స్నేహితులను ఆహ్వానిస్తామని అన్నారు. స్వలింగ సంపర్కుల వివాహం చేసుకోవడం అనైతికం అనడంలో అర్థం లేదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. చాలా సంవత్సరాలుగా తాము రిలేషన్షిప్లో ఉన్నామని, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.