మోడీ-బోరిస్ జాన్సస్ చర్చలు సక్సెస్-కీలక ప్రకటనలు-ఉక్రెయిన్ పోరుపైనా
భారత్ లో రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ ఇవాళ భారత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. పలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించుకున్నారు. ఇందులో ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతతో పాటు ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలున్నాయి. ఈ సందర్బంగా బోరిస్ జాన్సస్ ప్రధాని మోడీని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు.
భారత్, బ్రిటన్ ప్రధానుల చర్చల్లో ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ), ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి దౌత్యం యొక్క అవసరం, ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉగ్రవాదానికి వాడటం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. రెండు రోజుల పర్యటనలో చర్చల తర్వాత ఇరువులు ప్రధానులు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నందున జాన్సన్ పర్యటనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అన్నారు.గతేడాది భారత్-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. రక్షణ రంగం, వాణిజ్యం, వాతావరణం, ఇంధనంపై బోరిస్ జాన్సన్ తో చర్చించామన్నారు. ఉచిత, బహిరంగ, నియమ-ఆధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతంపై కూడా చర్చలు జరుగుతాయన్నారు.

యూకే భారతదేశానికి-నిర్దిష్ట ఓపెన్ జనరల్ ఎగుమతి లైసెన్స్‌ను సృష్టిస్తోందని ప్రధాని బోరిస్ జాన్సస్ తెలిపారు. అలాగే బ్యూరోక్రసీని తగ్గిస్తుందని, రక్షణ పరికరాల సేకరణలో జాప్యాన్ని తగ్గిస్తుందని హామీ ఇచ్చారు. తన చేతిలో భారతీయ వ్యాక్సిన్ ఉందని, అది తనకెంతో మేలు చేసిందని బోరిస్ జాన్సన్ తెలిపారు. భారతదేశానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ పరిణామాలపై బోరిస్ జాన్సన్ తో చర్చించినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఉక్రెయిన్ లో తక్షణ కాల్పుల విరమణతో పాటు సమస్య పరిష్కారం కోసం చర్చలు, దౌత్యం కోసం పట్టుబట్టినట్లు ఆయన తెలిపారు.
#WATCH I've the Indian jab (COVID19 vaccine) in my arm, and it did me good. Many thanks to India, says British PM Boris Johnson in Delhi pic.twitter.com/LiinvUCACB
— ANI (@ANI) April 22, 2022