గర్భంలోనే కవలల మృతి .. కరోనా భయంతో గర్భిణీకి వైద్యం చెయ్యని కేరళ ఆస్పత్రులు .. విచారణకు ఆదేశం
కరోనా వైరస్ సోకిందన్న భయంతో ఒక గర్భిణీ స్త్రీకి ఆసుపత్రిలో సకాలంలో వైద్య చికిత్స అందక తనకు పుట్టబోయే ఇద్దరు కవలలను పోగొట్టుకున్న విషాదం కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన , నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీని, మూడు ఆసుపత్రులలో డెలివరీ చేయడానికి నిరాకరించడంతో ఆమె గర్భంలో ఉన్న కవలలు మృతి చెందారు. కేరళలోని మలప్పురం లో జరిగిన ఈ విషాద ఘటనపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది .
కరోనా చివరిది కాదు ...తరువాత మహమ్మారికి సిద్ధంగా ఉండండి : డబ్ల్యూహెచ్ఓ సంచలన హెచ్చరిక

కేరళ రాష్ట్రంలో గర్భిణీకి డెలివరీ చెయ్యని ఆస్పత్రులు
కేరళ రాష్ట్రంలోని మలప్పురం లో తన భార్యను డెలివరీ కోసం తీసుకువెళ్లగా ఆమెను కరోనా పాజిటివ్ గా గుర్తించిన వైద్యులు ఆమెకు డెలివరీ చేయడానికి నిరాకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు ఆస్పత్రులకు వెళ్ళగా కరోనా భయంతో చేర్చుకునేందుకు నిరాకరించారని, చివరకు ఆసుపత్రిలో చేరే సరికి తన భార్య గర్భంలో ఉన్న కవలలు మృతిచెందారని భర్త ఎన్ సి షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు తన భార్య షహాలాకు నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లానని పేర్కొన్న అతను ఆమెకు సెప్టెంబర్ నెలలో కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు.

ఉదయం నుండి సాయంత్రం వరకు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన గర్భిణి కష్టాలు .. కవలలు మృతి
కరోనా కారణంగా ఆసుపత్రి వర్గాలు డెలివరీ చేయడానికి నిరాకరించారని వెల్లడించారు. ఉదయం నాలుగున్నర గంటల నుండి సాయంత్రం ఆరున్నర గంటల వరకు తిరగని ఆసుపత్రి లేదని వాపోయారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణీ స్త్రీ కాబట్టి ఆమెకు వైద్యులు చికిత్స చేయలేదని షరీఫ్ పేర్కొన్నారు. నిన్న సాయంత్రం తన భార్యకు సిజేరియన్ నిర్వహించి డెలివరీ చేయగా అప్పటికే గర్భంలో కవలలు మరణించినట్లుగా వైద్యులు గుర్తించారు. కరోనా వైరస్ మహమ్మారి భయంతో తన భార్యకు సకాలంలో వైద్యం అందించకపోవడంతో తమకు పుట్టబోయే కవలలు మరణించారని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన కేరళ వైద్య శాఖా మంత్రి
ఈ సంఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి కే కే శైలజ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ సంఘటన చాలా బాధాకరమైనదని ఆమె అభివర్ణించారు.
షరీఫ్ ముందుగా తన భార్యను మంజేరి మెడికల్ కాలేజీకి తీసుకువెళ్ళాడని, కానీ వారు ఆమెను అంగీకరించలేదని, ఇది కోవిడ్ -19 ఆసుపత్రి అని పేర్కొంటూ, ఆమె నొప్పితో ఉన్నప్పటికీ ఆమెను మరొక ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ ఆరంభంలో సదరు గర్భిణీ మహిళ షహాలా కరోనా పాజిటివ్ కు గురి కాగా ,ఆ తర్వాత సెప్టెంబర్ 15 న యాంటిజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చిందని భర్త షరీఫ్ చెప్పారు.

డెలివరీ చేసే సరికే జరగరాని నష్టం ... ఆవేదనలో ఆ కుటుంబం
దానిని పరిగణలోకి తీసుకోకుండా మంజేరి మెడికల్ కాలేజ్ నుండి , కోజికోడ్ మెడికల్ కాలేజ్ కి పంపించారు. అక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడంతో మరో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. వారు కూడా ఆమెకు డెలివరీ చేయడానికి అంగీకరించకపోవడంతో కేఎంసీటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు . చివరగా కేఎంసీటీ ఆస్పత్రిలో గర్భిణీని చేర్చుకొని శస్త్ర చికిత్స చేయగా గర్భంలో ఉన్న కవల శిశువులు అప్పటికే మృతి చెందారు.