పురుషుల్లో సెక్స్ కోర్కెలు సహజం.. నిరుద్యోగంతోనే అత్యాచారాలు... : మార్కండేయ కట్జూ
హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. నిందితులకు కఠిన శిక్ష విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సత్వర న్యాయం జరిగేలా నిందితులను ఎన్కౌంటర్ చేసి పారేయాలన్న ఆగ్రహ జ్వాలలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ పక్కనపెడితే... అసలు అత్యాచారాలకు కారణమేంటన్న చర్చకు తెరలేపారు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ. తన అభిప్రాయం ప్రకారం... మహిళలపై అత్యాచారాలకు నిరుద్యోగం కూడా ఒక కారణమని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా కట్జూ స్పందించగా... ఆయన వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కట్జూ ఏమంటున్నారు...
'హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను నేను ఖండిస్తున్నాను. దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. పురుషుల్లో సెక్స్ అనేది సహజమైన కోరిక. తిండి తర్వాత మనిషికి కావాల్సింది సెక్స్ అని కొన్నిసార్లు చెబుతుంటారు. భారత్ లాంటి సంప్రదాయిక దేశంలో ఎవరైనా వివాహం ద్వారానే సెక్స్‌ను పొందుతారు. కానీ దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్న నేపథ్యంలో చాలామంది యువకులకు పెళ్లిళ్లు కావట్లేదు(సాధారణంగా యువతులెవరూ నిరుద్యోగులను పెళ్లి చేసుకోరు కదా).' అని చెప్పుకొచ్చారు.

జనాభా 135 కోట్లు... నిరుద్యోగం...
'అలా నిరుద్యోగం కారణంగా పెళ్లిళ్లు కాకుండా ఉండిపోతుండటంతో చాలామంది యువకులు ఒక వయసొచ్చాక కూడా సెక్స్‌ని పొందలేకపోతున్నారు. 1947కి ముందు అవిభాజ్య భారత్‌లో 42 కోట్ల జనాభా ఉండేది. ఇప్పుడది నాలుగు రెట్లు పెరిగి ఒక్క భారత్‌లోనే 135 కోట్లకు చేరింది. కానీ పెరిగిన ఆ నాలుగురెట్ల జనాభాకు అనుగుణంగా ఉద్యోగావకాశాలు పెరగలేదు. పైగా ఒక్క 2020లోనే దాదాపు 12 కోట్ల మంది భారతీయులు తమ ఉద్యోగాలు కోల్పోయారు.కాబట్టి అత్యాచారాలు పెరగకుండా ఉండగలవా...?' అంటూ మార్కండేయ కట్జూ ప్రశ్నించారు.

ఇలాంటివి జరగకుండా ఉండాలంటే....
'మరోసారి స్పష్టంగా చెప్తున్నా... అత్యాచారాలను నేను సమర్థించట్లేదు. ఖండిస్తున్నాను.. అయితే దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఇలాంటి ఘటనలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నిజంగా ఇలాంటి ఘటనలకు ముగింపు పలకాలనుకుంటే... భారత్‌లో నిరుద్యోగ సమస్య తలెత్తని సామాజిక,ఆర్థిక వ్యవస్థను మనం సృష్టించాలి. మళ్లీ చెప్తున్నా... గ్యాంగ్ రేప్ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాను.' అని మార్కండేయ కట్జూ స్పష్టం చేశారు.

కట్జూ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు...
కట్జూ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'అంటే,పురుషులు జంతువుల లాంటివారు... కోర్కెలను నియంత్రించుకోలేరు... కాబట్టి మహిళల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారిపై లైంగిక దాడి చేస్తారు... అంతేనా..' అంటూ కొంతమంది నెటిజన్స్ కట్జూని ప్రశ్నిస్తున్నారు. 'మహిళలు ఉన్నది పురుషుల కోర్కెలు తీర్చేందుకు.... వాళ్లు మమ్మల్ని కొడితే,తిడితే,వేధిస్తే భరించేందుకు... ఇంతేనా... నిరుద్యోగమే దీనంతటికీ కారణమని చెప్పడం మీ సంకుచిత ఆలోచనను బయటపెడుతోంది...' అని మండిపడుతున్నారు. పితృస్వామ్య వ్యవస్థను,కుల కోణాన్ని కూడా పూర్తిగా విస్మరించి ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.