President's Rule: రాష్ట్రపతి పాలన సిఫారసులకే కేంద్ర కేబినెట్ పచ్చజెండా: బ్రెజిల్ విమానం ఎక్కిన మోడీ.
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించాలని సూచిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి పంపించిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం- గవర్నర్ సిఫారసులను ఆమోదించడానికేనని సమాచారం. అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ముగించుకున్న ఆ మరుక్షణమే నరేంద్ర మోడీ బ్రెజిల్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 13, 14 తేదీల్లో ఆయన బ్రెజిల్ లో ఏర్పాటు కానున్న బ్రిక్స్ దేశాల ఉన్నత స్థాయి సమావేశానికి హాజరవుతారు.
President's rule: షాకింగ్ ట్విస్ట్: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు: గడువు దాటిన మరుక్షణమే..

గడువు దాటితేనే.. రాష్ట్రపతి పాలన
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కోష్యారి శివసేనకు మంగళవారం రాత్రి 8:30 గంటల వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. నిర్దేశిత గడువులోగా శివసేన తన అంగీకారాన్ని వ్యక్తం చేయక పోతే.. ప్రత్యామ్నాయంగా రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమైంది. శివసేన-కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సారథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ మూడు పార్టీలు ఎంత శరవేగంగా పావులు కదుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్.. రాష్ట్రపతి పాలన విధించడానికి సిఫారసు చేయడం, దాన్ని కేంద్రమంత్రివర్గం ఆమోదించడం అంతే శరవేగంగా జరిగిపోయింది.

ప్రధాని బ్రెజిల్ పర్యటన ఉన్నందున అత్యవసరంగా..
గడువులోగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుందని సమాచారం. సాధారణంగా- ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించాలంటే దాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. ఆ మంత్రి వర్గ సమావేశాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధానమంత్రి సారథ్యాన్ని వహించాల్సి ఉంటుంది. అలాంటప్పుడే కేంద్ర మంత్రివర్గం తీసుకునే చర్యలకు విలువ ఉంటుంది. ఈ కారణాల వల్లే ప్రధానమంత్రి అప్పటికప్పుడు దేశ రాజధానిలో అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించినట్లు చెబుతున్నారు.

బ్రెజిల్ విమానం ఎక్కడానికి ముందే..
ప్రధాన మంత్రి బ్రెజిల్ పర్యటనకు వెళ్లాల్సి ఉండటం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ శివసేనకు ఇచ్చిన గడువు ఈ రాత్రికే ముగియబోతుండటం వంటి పరిణామాల మధ్య.. కేంద్ర మంత్రివర్గం లాంఛనప్రాయంగా ఆమోదం పొందాలనే ఉద్దేశంతోనే అప్పటికప్పుడు, హడావుడిగా రాష్ట్రపతి పాలకు సంబంధించిన సిఫారసులను గవర్నర్ పంపించాని అంటున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఏర్పాటైతే- న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు శివసేన నాయకులు వెల్లడించారు. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.