కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే... ఆర్బీఐ పర్యవేక్షణలోకి ఆ బ్యాంకులు కూడా...
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రమంత్రలు ప్రకాష్ జవదేకర్,గిరిరాజ్ సింగ్,జితేంద్ర సింగ్ ఆ వివరాలను మీడియాతో ఆన్లైన్ ద్వారా వెల్లడించారు. స్పేస్ యాక్టివిటీస్,పశు సంరక్షణ,బ్యాంకింగ్,ఓబీసీ కమిటీ,ప్రధానమంత్రి ముద్ర యోజన తదితర అంశాలపై కేంద్రం కీలక నిర్ణయాలను మీడియాకు వివరించారు. సమావేశంలో చైనా అంశం చర్చకు వస్తుందని భావించినప్పటికీ అదేమీ జరగలేదు. పూర్తిగా స్వదేశీ సంస్థలు,రంగాల బలోపేతంపై మోదీ సర్కార్ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది.

కొత్త స్పేస్ సంస్థ...
'ఇండియన్ నేషనల్ స్పేస్,ప్రమోషన్&అథరైజేషన్ సెంటర్' అనే ఒక కొత్త సంస్థను భారత్‌లో నెలకొల్పబోతున్నట్టు తెలిపారు. స్పేస్ యాక్టివిటీస్‌కు సంబంధించి ప్రైవేట్ ఇండస్ట్రీలకు స్నేహపూర్వక వాతావరణంలో ఇది మార్గనిర్దేశం చేస్తుందన్నారు. అలాగే పాడి,పౌల్ట్రీ,మాంసం ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయల కల్పనకు రూ.15వేల కోట్ల నిధి కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

పశు సంవర్థక శాఖపై కీలక నిర్ణయాలు
పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వం 3% వడ్డీ మినహాయింపు ఇస్తుందన్నారు.మయన్మార్‌లోని ఏ -1, ఏ-3 బ్లాక్‌ల అభివృద్ధికి ఓఎన్జిసీ విదేశ్ లిమిటెడ్ అదనపు పెట్టుబడులను కేబినెట్ ఆమోదించిందన్నారు. ఓబీసీ కమిషన్ నివేదిక గడువును మరో ఆర్నెళ్లు పొడగించినట్టు తెలిపారు.

కోపరేటివ్ బ్యాంకులు ఇక ఆర్బీఐ పర్యవేక్షణలోకి..
దేశంలోని 1540 కోపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు. తద్వారా అందులోని 8.6 కోట్ల ఖాతాదారులకు సంబంధించిన రూ.4.84కోట్ల డబ్బుకు భద్రత,భరోసా కల్పిస్తున్నామన్నారు. 'ప్రభుత్వ బ్యాంకులతో పాటు 1482 అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు,58 మల్టీ స్టేట్ కోపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకువస్తున్నాం.' అని తెలిపారు.

ఖషీనగర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు...
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ప్రధాన్ మంత్రి ముద్ర యోజన కింద షిషు లోన్ కేటగిరీ రుణ గ్రహీతలకు 2% వడ్డీని తగ్గించే పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.