కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లోనే చికిత్స
న్యూఢిల్లీ: మరో కేంద్రమంత్రి కరోనావైరస్ మహమ్మారి బారినపడ్డారు. కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇటీవల తనను కలిసినవారంతా క్వారంటైన్లో ఉండి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని నితిన్ గడ్కరీ కోరారు. ఇప్పటికే రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే.

కేంద్రమంత్రులు భారతి పవార్, మహేంద్ర నాథ్ పాండే, నిత్యానంద్ రాయ్ లతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తోపాటు బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, వరుణ్ గాంధీ తదితరులు కరోనా బారినపడ్డారు. వీరిలో కొందరు హోంఐసోలేషన్లో ఉండగా, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
కాగా, ప్రముఖ సీనియర్ నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు కరోనా పాజిటివ్ అని తేలినట్లు తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'మొత్తానికి కరోనా వచ్చేసింది. గత రెండు వేవ్‌ల నుంచి తప్పించుకున్నప్పటికీ ఈసారి కోవిడ్ నన్ను చేరుకుంది. నిన్న సాయంత్రం వరకు ఎలాంటి లక్షణాలు లేని నాకు ప్రస్తుతం కరోనా లక్షణాలు రావడంతో టెస్ట్ చేయించుకున్నాను. నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా ఉంది. కానీ, తప్పదు కాబట్టి రాబోయే 5 రోజులు నన్ను ఎంటర్టైన్ చేయండి. అలాగే మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నా పరీక్షించుకోండి' అంటూ ఖుష్బూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కాగా, దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాగా, ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సినీ ప్రముఖులు మంచు లక్ష్మి, థమన్, వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష, ఇషా చావ్లా, రేణుదేశాయ్, లతా మంగేష్కర్ ... ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. సెలబ్రిటీల్లో వరుస కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలైంది.