ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాఫీ టేబుల్ బుక్... ఆవిష్కరించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్
భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి సచివాలయం 'కనెక్టింగ్,కమ్యూనికేట్,చేజింగ్' పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ను రూపొందించింది.

తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మొదటి కాపీని వెంకయ్య నాయుడుకి అందించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పుస్తకాలు మంచి స్నేహితులు అని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పుస్తకాలు మంచి స్నేహితులు అని అభిప్రాయపడ్డారు. వెంకయ్య నాయుడు మంచి వాక్చుతుర్యం కలిగినవారని,ఆయన ఉపన్యాసాలు కళాత్మకంగా ఉంటాయని అన్నారు. ఇతరులకు సూచనలు,సలహాలు ఇవ్వడంలోనూ వెంకయ్య చక్కగా మాట్లాడుతారని చెప్పారు.
చాలా విషయాలపై పట్టు సంపాదించిన ఆయన... ఉపరాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చరాని కొనియాడారు.చాలా సందర్భాల్లో సంయమనంతో వ్యవహరించారని,కీలక సందర్భాల్లో ఆయన వ్యవహార శైలి స్పూర్తివంతంగా నిలిచిందని చెప్పారు. ఆయన జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శమని కీర్తించారు.
వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఉపరాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. నేడు కృష్ణాష్టమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు భయాందోళనకు గురికావద్దని కోరుతున్నానని... తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తన జీవితంలో ఎప్పుడూ 4 రోజుల కంటే ఎక్కువగా ఒకేచోట ఉండలేదని.. కానీ కరోనా తర్వాత ఒకే చోట చిక్కుకుపోవాల్సి వచ్చిందన్నారు.అయినప్పటికీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతున్నానని తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు అన్ని రంగాలు కృషి చేస్తున్నాయి. చాలామంది వ్యక్తులు,సంస్థలు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 6 నెలలు కరోనాతో గడిచిపోయాయని అన్నారు. తాను కూడా తన అభిప్రాయాలను,ఆలోచనలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకుంటున్నానని తెలిపారు.తాను మొదటి నుంచి రైతులకు ప్రాధాన్యతనిస్తున్నానని... రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు.