యూపీ ఎన్నికలవేళ: లఖింపూర్ ఖేరీ కేసు నిందితుడు, కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు కోర్టులో ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా.. గత అక్టోబర్ నెలలో అరెస్టైన విషయం తెలిసిందే.
ఆ తర్వాత పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు మొదలైన రోజే ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. గత సంవత్సరం అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన గటనలో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందడం, ఆ తర్వాత మిగిలిన రైతులు ఆగ్రహంతో మరో డ్రైవర్ తోపాటు నలుగురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు. దీంతో ఆ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆశిష్ మిశ్రాను పేర్కొన్న పోలీసులు.. అక్టోబర్ 9న అరెస్ట్ చేశారు. విచారణలో ఆశిష్ మిశ్రా సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పలుమార్లు కస్టడీలోకి తీసుకుని విచారించినట్లు సమాచారం.
ఇక బెయిల్ కోసం పలుమార్లు ఆశిష్ మిశ్రా ప్రయత్నించినప్పటికీ నిరాశే ఎదురైంది. తాజాగా, మరోసారి బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకోవడంతో పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఇది ఇలావుండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించడం చర్చనీయాంశంగా మారింది. యూపీలో మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గురువారం తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.