దారుణం: రేప్ చేసింది తండ్రి, బలైంది కొడుకు
లక్నో: ఓ వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలిక అందుకు ప్రతీకారంగా అతని కుమారుడిని అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖైర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాంసం ముద్దగా ఉన్న బాలుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడంతో ఈ అత్యంత దారుణ సంఘటన గురువారం వెలుగు చూసింది.
ఖైర్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజ్‌వీర్ సింగ్ మీడియాకు తెలిపిన సమాచారం ప్రకారం తనపై అత్యాచారానికి పాల్పడిన రింకు కుమారుడు అమిత్ (5) ఆరుబయట ఆడుకుంటుండగా ఓ పథకం ప్రకారం ఎత్తుకెళ్లి అత్యంత దారుణంగా హత్య చేసింది. మంగళవారం సాయంత్రం బాలుడిని ఎత్తుకెళ్లిన బాలిక బాలుడు అమిత్ తల నరికి నరికి, ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా ఇటుక రాళ్లతో ఛిద్రం చేసింది.

అనంతరం మృతదేహాన్ని పాలిథిన్ బ్యాగులో చుట్టి కిరోసిన్ పోసి నిప్పంటించింది. అయితే గురువారం సగం కాలిన అమిత్ మృతదేహాన్ని కుక్కలు వీధిలోకి లాక్కురావడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలను చూసిన పోలీసులు సైతం నివ్వెర పోయారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్రు ప్రారంభించారు.
చివరిసారిగా అమిత్‌తో ఉన్న బాలికను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఆమె నేరాన్ని అంగీకరించింది. బాలుడి తండ్రి రింకూ తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తెలిపింది.
అందుకు ప్రతీకారంగానే తాను ఈ హత్య చేసినట్టు విచారణలో బాలిక అంగీకరించింది. దీంతో బాలికతో పాటు బాలుడి తండ్రి రింకూపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ హత్య కేసులో మరికొందరు ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications