యూపీలో ఓబీసీ ఓటు బ్యాంకు కీలకం: బీజేపీ-ఎస్పీల మధ్యే ప్రధాన పోరు-ఎవరు ఎటువైపు..?
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారం కోల్పోయినా ఇందులో కీలక పాత్ర వహించింది మాత్రం కులమే అని చెప్పాలి. అంతేకాదు రెండు వర్గాల మధ్య ఓట్లు ఏ మేరకు చీలాయనే అంశం కూడా ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతం మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓ వర్గం ఓటు బ్యాంకు కోసం రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆ వర్గం కోసం ఎక్కడా లేని హామీలు కురిపిస్తున్నాయి. ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి బీజేపీ మరియు సమాజ్‌వాదీ పార్టీ. ఈ వర్గమే ఓబీసీ వర్గం. ఓబీసీ వర్గం ఓటర్లతో కనెక్ట్ అయ్యేందుకు ప్రధాన పార్టీలన్నీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి తొలి ప్రధాని నెహ్రూ ఓబీసీ అనే పదాన్ని వినియోగించినట్లు ఫ్రెంచ్ పొలిటికల్ సైంటిస్టు క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ తెలిపారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ విషయానికొస్తే ఓబీసీ ఓటర్లు ఎక్కువగా సమాజ్‌వాదీ పార్టీకే మద్దతుగా నిలిచారు. సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ ఓబీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు వారి తరపున నిలిచి మాట్లాడారు. ఈ సమయంలోనే సామాజిక న్యాయం అనే పదాన్ని తెరపైకి తీసుకొచ్చారు ములాయం అదే సమయంలో ఓబీసీ ఓటుబ్యాంకుపై పట్టు సాధించేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్‌కు ఓబీసీ ఓటర్లను దూరం చేయగలిగాడు.

ఉత్తర్ ప్రదేశ్ జనాభాలో 54.5 శాతంగా ఉన్న ఓబీసీ వర్గాల్లు ఈ రోజున ఆ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ముఖ్యులంతా ఓబీసీ వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి అత్యధికంగా 102 మంది ఓబీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా... బీఎస్పీ అప్నాదల్ పార్టీలకు చెరో ఐదు మంది ఓబీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు.2009-2014 మధ్య బీజేపీ ఓబీసీ ఓటర్లను దాదాపుగా 12 నుంచి 14శాతం మేరా తమ వైపు తిప్పుకోగలిగిందని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ తమ సర్వే ద్వారా వెల్లడించింది.ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలైన 45శాతం ఓట్లు కులం ఆధారంగానే పోలైనట్లు తెలుస్తోంది.
2017లో అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ 66శాతం యాదవ ఓట్లు ఆపార్టీకి దక్కడం విశేషం. అయితే యాదవ రహిత ఓబీసీ ఓట్లు దాదాపు 60శాతం బీజేపీకి పోలైనట్లు సమాచారం. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని అగ్రకులాలు మరియు యాదవ రహిత ఓబీసీ ఓటర్లు దాదాపు 14 ఏళ్ల తర్వాత బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఇక్కడ ఓబీసీ నాయకుడిగా ఉన్న నరేంద్ర మోదీ చరిష్మా ఎక్కువగా వర్కౌట్ అయ్యిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీని చూసి యాదవ రహిత ఓబీసీ ఓటర్లు సమాజ్‌వాదీ పార్టీని కాదని బీజేపీకి దగ్గర కాగా... జాతవ్ రహిత దళిత ఓట్లు బీఎస్పీని వీడి కమలం వైపు తిరిగారు. ఇక ఓబీసీకి చెందిన పలువురు అగ్రనాయకులు పలు రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిలో ప్రధాని నరేంద్ర మోదీ, కళ్యాణ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ఉమా భారతి, గోపీనాథ్ ముండే ,సుశీల్ కుమార్ మోదీ లాంటి వారున్నారు.

ఇక ములాయం సింగ్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టని కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. పబ్లిక్‌లో ఉన్నప్పుడు ముస్లిం నాయకులతో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. మైనార్టీలకు మాత్రమే నాయకుడన్న ముద్ర తొలగించుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అగ్రకులాలకు చెందిన ఓటర్లను దూరం చేసుకోకూడదనే భావనతో క్రమంగా హిందుత్వ అజెండా కూడా అఖిలేష్ మోస్తున్నట్లు తెలుస్తోంది.ఇదంతా ఓబీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక సామాజిక న్యాయం అజెండాతో వెళ్లి తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు అఖిలేష్ యాదవ్. ఇప్పటికే యాదవ రహిత ఓబీసీ నేతలు బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అయితే పార్టీలో చేరిన వారందరికీ సమన్యాయం చేయాలనే విషయం అఖిలేష్‌కు తెలుసు. కేవలం ముస్లి యాదవ్ ఓటు బ్యాంకునే నమ్ముకోకుండా ఇతర వర్గాల ఓటు బ్యాంకును కూడా తమ వైపు మరల్చుకోవాలంటే ఓబీసీలకు తాను తప్ప మరొక నాయకుడు లేరనే భావన కలిగించాలని అఖిలేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే 2017లో సమాజ్‌వాదీ పార్టీపై గుర్రుగా ఉన్న యాదవ రహిత ఓబీసీలు, జాతవ్ దళితులను తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. ఈ రెండు వర్గాల వారికి కేంద్రం నుంచి వచ్చిన పథకాలు విరివిగా ఇచ్చింది. దీంతో 2017 ఎన్నికల్లో ఈ రెండు వర్గాల వారు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారు. ఎస్పీ బీఎస్పీ హయాంలో ఈ రెండు వర్గాల వారు అణచివేయబడ్డారనే భావన వీరిలో నెలకొనేలా చేసింది బీజేపీ. సమాజ్‌వాదీ పార్టీ హయాంలో గూండా రాజ్యమేలిందంటూ బీజేపీ అస్త్రాలను వదిలింది. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో ఐదు ప్రధాన వర్గాలు ఓటింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తాయి. అవి అగ్రకులాలు, ముస్లింలు, యాదవ రహిత ఓబీసీలు,జాతవ్ దళితులు. అయితే 30శాతం ఓటు షేరు ఏపార్టీ దక్కించుకుంటుందో ఆ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశాలుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక గత చరిత్ర చూస్తే ఓబీసీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో స్వామీ ప్రసాద్ మౌర్య కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2007లో ఈయన మాయావతి పార్టీలో చేరిన సమయంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2017లో ఆయన బీజేపీ గూటికి చేరినప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఈ సారి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు... అయితే ఏమేరకు స్వామీ ప్రసాద్ మౌర్య ఓబీసీ ఓటర్లపై ప్రభావం చూపగలరనేది తెలియాలంటే ఎన్నికలయ్యేవరకు వేచిచూడాల్సిందే. స్వామీ ప్రసాద్ మౌర్య ప్రభావం ఎక్కువగా తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌లో కనిపిస్తుంది. మొత్తం మీద ఆయన ప్రభావం 50 నుంచి 60 సీట్లలో కనిపిస్తుంది.
మొత్తానికి ఇటు అధికారిక బీజేపీ అటు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలు ఓబీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వరుస హామీలు గుప్పిస్తున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ ఈ విషయంలో ఓ అడుగు ముందుగానే ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఉత్తర్ ప్రదేశ్‌కు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోలరైజేషన్ అంశాన్ని ఏ పార్టీ ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుంటుందో వేచి చూడాలి.