కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వార్డ్ బాయ్ మృతి .. టీకాతో సంబంధం లేదన్న ఆస్పత్రి అధికారి
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ తొలిరోజు వ్యాక్సిన్ తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రి వార్డ్ బాయ్ ఆ మరుసటిరోజు మృతి చెందడం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది.
ఉత్తర ప్రదేశ్ మొరాదాబాద్‌లో 46 ఏళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి, వార్డ్ బాయ్ గా పనిచేసే మహిపాల్ సింగ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల తరువాత ఆదివారం సాయంత్రం మరణించారు. ఈ మరణానికి టీకాతో సంబంధం లేదని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
50 దేశాలకు విస్తరించిన యూకే కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ .. ఇండియాలో కేసులు ఎన్నంటే

వ్యాక్సిన్ తీసుకున్న వార్డ్ బాయ్ మృతి .. వ్యాక్సినేషన్ కు ముందే అనారోగ్యం
మహిపాల్ సీరం ఇన్స్టిట్యూట్ కు చెందిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తీసుకున్న తరువాత శ్వాస సంబంధిత ఇబ్బందులైన చాతీ నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. వ్యాక్సినేషన్ తరువాత ఆయన నైట్ షిఫ్ట్ డ్యూటీ చేశాడని , అతని మరణానికి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారి వివరణ ఇచ్చారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే వార్డ్ బాయ్ మహిపాల్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధ పడిన మహీపాల్ సింగ్
మహీపాల్ సింగ్ కు శనివారం మధ్యాహ్నం టీకా వేయించారు. ఆదివారం ఆయన శ్వాస సంబంధిత ఇబ్బందులతో మృతి చెందారు. అయితే మరణానికి గల కారణాలను తాము పరిశీలిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్ట్ లో మరణానికి గల కారణం అర్థమవుతుందని పేర్కొన్నారు. అయితే ఇది టీకా తీసుకోవడం వల్ల కలిగిన ప్రతిచర్యగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు మొరాదాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంసి గార్గ్ .
"కార్డియో-పల్మనరీ డిసీజ్" కారణంగా ఆయన మరణం సంభవించినట్లుగా చెప్తున్నారు.

కార్డియోజెనిక్ షాక్ మరణానికి కారణం అన్న యూపీ ప్రభుత్వం ..
మరణానికి గల కారణం "కార్డియోజెనిక్ షాక్ లేదా సెప్టిసెమిక్ షాక్" అని పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించినట్లు యుపి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీకాలు వేయడానికి ముందు ఆయన అనారోగ్యంతో ఉన్నారని , కానీ షాట్ అందుకున్న తర్వాత అతను మరింత బాధపడ్డాడని మహీపాల్ కొడుకు మీడియాతో చెప్పాడు. తన తండ్రి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో టీకా కేంద్రం నుండి తిరిగి ఇంటికి వచ్చారని తానే ఆయనను ఇంటికి తీసుకువచ్చానని వెల్లడించారు .

వ్యాక్సిన్ వల్లే అని కుటుంబం అనుమానం
ఆయనకు అప్పటికే కొంత న్యుమోనియా, సాధారణ దగ్గు మరియు జలుబు ఉంది, కాని ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆయన ఎక్కువగా బాధపడ్డారని మహీపాల్ సింగ్ కుమారుడు విశాల్ పేర్కొన్నారు. మహీపాల్ ఆ తరువాత అకస్మాత్తుగా మృతి చెందారని వాపోయారు. అనారోగ్యంతో ఉన్న తండ్రి టీకా తీసుకోవడం వల్లనే ఇలా జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

జనవరి 22 శుక్రవారం మొదటి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్
భారతదేశం యొక్క కోవిడ్ టీకా డ్రైవ్ యొక్క మొదటి రోజు శనివారం 22,643 మందికి టీకాలు వేసినట్లు యుపి ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఉత్తర ప్రదేశ్‌లో జనవరి 22 శుక్రవారం రెండో డోస్ కోవిడ్ వ్యాక్సిన్లను మొదటి డోస్ తీసుకున్న వారికి ఇవ్వనున్నారు.