వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోంట్ మిస్: ఇక్కడ వారసులకే చాన్స్! (ఫొటోలు)

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో: క్రమశిక్షణకు మారుపేరని, విలక్షణమైన పార్టీగా ప్రచారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా మిగతా రాజకీయ పార్టీలకు అతీతమేమీ కాదు. తమ పార్టీలో ఎవరైనా అగ్రస్థానానికి చేరుకోవచ్చు గానీ, కాంగ్రెస్ పార్టీలో ఏకైక కుటుంబం ఆధిపత్యం ప్రదర్శిస్తున్నదని నిరంతరం కమలనాథులు విమర్శలు గుప్పిస్తుంటారు.

కానీ తమ దాకా వస్తేగానీ భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలో అర్థంగానీ పరిస్థితి కమలనాథులది. ప్రస్తుతం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మొదలు అధికార సమాజ్ వాదీ పార్టీ, దాని మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ, అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్ డీ) పార్టీల్లోని నేతలు తమ కుమారులు, కుమార్తెలను వారసులుగా తమ ముందుకు తీసుకొస్తున్నారు.

భారతదేశ రాజకీయాల్లో ఒక్క కమ్యూనిస్టులు తప్ప మిగతా అన్ని పార్టీల నుంచీ నేతల వారసులు రంగంలోకి దిగారు. రాజకీయానుభవం లేకపోయినా వారసుడిగా రంగంలోకి దిగితే నాలుగు ఓట్లు రాలుతాయన్న నమ్మకంతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బరిలో నిలిచిన యువ కిశోరాల్లో పలువురు ఉన్నతస్థాయి విద్యాభ్యాసం పూర్తి చేసిన వారు ఉన్నారు.

బిజెపిలో నేతల తనయుల జోరు

బిజెపిలో నేతల తనయుల జోరు

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి జాతీయ నాయకుల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్ వారే. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కల్ రాజ్ మిశ్రా, రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, సీనియర్ నేత లాల్జీ టాండన్ తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. బంధువులు, కుమారులు, కూతుళ్లకు టిక్కెట్లు అడగవద్దని ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన హితోక్తులేవీ వీరి తలకెక్కినట్లు కనిపించడం లేదు.

లక్నో ఈస్ట్‌లో టాండన్ తనయుడు అశుతోశ్..

లక్నో ఈస్ట్‌లో టాండన్ తనయుడు అశుతోశ్..

2012 అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో(తూర్పు) నియోజకవర్గం నుంచి గెలుపొందిన కల్‌రాజ్‌ మిశ్రా ఆ తర్వాత 2014లో దేవరియా స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రమంత్రి అయ్యారు. ఖాళీ అయిన లక్నో(తూర్పు) నుంచి అశుతోష్‌ టాండన్‌ ఉప ఎన్నికల్లో గెలిచారు. ఈయన బిజెపి మరో దిగ్గజం లాల్జీ టాండన్‌ తనయుడు. అశుతోష్‌కు ఇప్పుడు మళ్లీ ఈ సీటును కేటాయించారు. ఈ స్థానం నుంచి టిక్కెట్ కోసం ప్రయత్నించిన కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రా తనయుడు అమిత్‌కు పార్టీ నాయకత్వం మొండి చేయి చూపింది.

నోయిడాలో రాజ్‌నాథ్ తనయుడు

నోయిడాలో రాజ్‌నాథ్ తనయుడు

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తన తనయుడు పంకజ్‌ సింగ్‌కు నోయిడా సీటు ఇప్పించుకున్నారు. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే బిమ్లా బాథంను పక్కనబెట్టేసింది బిజెపి నాయకత్వం. ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా పార్టీ కార్యకర్తలు, ప్రజలతో సంబంధ బాంధవ్యాలు గల బిమ్లా బాథం వైఖరేమిటో బయటకు తెలియకున్నా పోలింగ్ వేళ.. రాజ్‌నాథ్ తనయుడికి సహకరించడం అనుమానమే. పంకజ్ సింగ్ కూడా సాదాసీదాగా లేరు. అమిటీ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేసిన పంకజ్.. 2002 అసెంబ్లీ ఎన్నికల నుంచి రాజకీయాల్లో చురుగ్గా స్పందిస్తున్నారు. 2007 ఎన్నికల్లోనూ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు కంచుకోట చాందౌలీ నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తొలిదశ టిక్కెట్ల కేటాయింపులో కుమారుడికి అవకాశం ఇవ్వలేదని హోంమంత్రి రాజ్‌నాథ్ ఆగ్రహించినట్లు వార్తలొచ్చాయి. రెండో జాబితాలో బిజెపి నాయకత్వం పంకజ్ సింగ్ అభ్యర్థిత్వానికి పచ్చజెండా ఊపింది.

అక్కడ కల్యాణ్ మనువడ సందీప్

అక్కడ కల్యాణ్ మనువడ సందీప్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నేత, ప్రస్తుతం రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌సింగ్‌ కంచుకోట అత్రౌలి స్థానం నుంచి ఆయన మనువడు సందీప్‌సింగ్‌ బరిలోకి దిగుతున్నారు. ఇంగ్లండ్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఇదే అత్రౌలి స్థానంలో కల్యాణ్‌ పలుమార్లు గెలిచారు. గతంలో బిజెపి నాయకత్వంపై కల్యాణ్‌ సింగ్ పలుసార్లు తిరుగుబాటు చేసి పార్టీ నుంచి రెండుసార్లు బహిష్కరణకు గురయ్యారు. కానీ ఆ పరిణామాలేవీ ప్రస్తుత బిజెపి నాయకత్వం పట్టించుకోవడం లేదు. దీనికి కారణం కల్యాణ్‌కు ఎంబీసీల్లో ముఖ్యంగా తన సామాజిక వర్గం లోధ్‌లలో గట్టి పట్టు ఉండటమే. రాష్ట్ర జనాభాలో లోధీలు నాలుగు శాతం. అలీగఢ్‌, బులంద్‌షహర్‌, ఆగ్రా పరిసరాల్లో వీరి జనసంఖ్య ఎక్కువ. ఇక్కడ బిజెపి మంచి ఫలితాలు సాధిస్తే పార్టీ విజయం తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కల్యాణ్‌సింగ్‌ తనయుడు రాజ్‌వీర్‌ సింగ్‌ ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడు.

కెరానాలో ఎంపి హుకుం సింగ్ కూతురు

కెరానాలో ఎంపి హుకుం సింగ్ కూతురు

ఒకనాడు కైరానా వాసులు భారీగా వలసలు వెళ్లాల్సి వచ్చిందని, దీనికి ఒక సామాజిక వర్గం రంగు పులిమి వివాదం రేకెత్తించారు. దీనికి ప్రస్తుత ఎంపి హుకుంసింగ్ సారథ్యం వహించిన వారిలో ఒకరు. ఆయన కూతురు మ్రిగాంకా ఈ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ ప్రస్తుతం ఆర్ఎల్డీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. హుకుంసింగ్ మేనల్లుడే అనిల్ చౌహాన్. కూతురు కోసం తనకు టిక్కెట్ రాకుండా చేశారని అనిల్ కుమార్ అభియోగం. ఈ నియోజకవర్గం నుంచి 2014 ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నహీద్ హసన్ కూడా బరిలో నిలిచారు.

బ్రిజ్ భూషణ్ తనయుడికి గొండా సీటు

బ్రిజ్ భూషణ్ తనయుడికి గొండా సీటు

గొండా ఎంపీగా ఉన్న మాఫియా డాన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనయుడు ప్రతీక్ భూషణ్‌కు గొండా అసెంబ్లీ స్థానం లభించింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌లో ఎంబిఎ పూర్తిచేసిన ప్రతీక్ రాజకీయంగా తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారణాసి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోత్స్న శ్రీవాస్తవ్‌కు బిజెపి ఈ దఫా టిక్కెట్టు నిరాకరించి, ఆమె తనయుడు సౌరభ్‌కు కేటాయించింది.

ప్రసాద్ మౌర్య కుమారుడు కూడా..

ప్రసాద్ మౌర్య కుమారుడు కూడా..

బీఎస్పీ నుంచి బిజెపిలో చేరిన ప్రస్తుత ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్యను కూడా పార్టీ నాయకత్వం సంత్రుప్తి పరిచింది. ఆయన కుమారుడు ఉత్తర్ష్‌కు ఉంచాహర్ స్థానం కేటాయించింది. ప్రేమ్ లతా కతియార్ తనయ నిలీమా కతియార్ కు కల్యాణ్ పూర్, ఫరూఖాబాద్ స్థానం నుంచి బ్రాహ్మ్ దత్ ద్వివేది కొడుకు సునీల్ దత్ ద్వివేదికి టిక్కెట్లు లభించాయి.

ములాయం కుటుంబ సభ్యులంతా...

ములాయం కుటుంబ సభ్యులంతా...

అధికార సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులంతా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ములాయం తనయుడు అఖిలేష్‌ యాదవ్‌ యూపీ ముఖ్యమంత్రి. అఖిలేష్‌ సతీమణి డింపుల్‌ కనౌజ్‌ ఎంపీ. ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్‌ యూపీ మంత్రి. ఇప్పుడు ములాయం మరో కోడలు అపర్ణా యాదవ్‌ లక్నో కంటోన్మెంట్‌ నుంచి పోటీచేస్తున్నారు. ఇక్కడ గతంలో కాంగ్రెస్‌ టిక్కెట్టుపై రీటా బహుగుణ గెలిచారు. రీటా ఈ సారి భాజపా తరఫున పోటీచేస్తున్నారు.

స్వార్ నుంచి ఆజంఖాన్ తనయుడు

స్వార్ నుంచి ఆజంఖాన్ తనయుడు

ములాయంకు అత్యంత సన్నిహితుడైన ముస్లిం నేత ఆజాంఖాన్‌ రాంపూర్‌ నుంచి పోటీచేస్తుండగా.. ఆయన తనయుడు అబ్దుల్లా ఆజాంఖాన్‌ ఎస్పీ టిక్కెట్‌పై స్వార్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆజాంఖాన్‌ సతీమణి ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

నరేష్ తనయుడికి మళ్లీ...

నరేష్ తనయుడికి మళ్లీ...

ఎస్పీకే చెందిన రాజ్యసభ సభ్యుడు నరేష్‌ అగర్వాల్‌ తన తనయుడు నితిన్‌ అగర్వాల్‌కు మళ్లీ టిక్కెట్టు ఇప్పించుకోగలిగారు. మరో సీనియర్‌ ఎంపీ బేణీ ప్రసాద్‌ వర్మ తన తనయుడు రాకేశ్‌ వర్మను బరిలోకి దించుతున్నారు. మాజీ ఎంపీ రూయబ్‌ సయ్యద్‌ బహ్రెయిచ్‌ నుంచి, ఆమె తనయుడు యాసర్‌ షా మతేరా నుంచి పోటీచేస్తున్నారు. మంత్రి పవన్‌పాండే అయోధ్య నుంచి, ఆయన మామ జయశంకర్‌ కతేహ్రి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బరిలో జమా మసీదు ఇమాం అల్లుడు

బరిలో జమా మసీదు ఇమాం అల్లుడు

బెహత్‌ నుంచి ఢిల్లీ జామా మసీదు ఇమాం సయ్యద్‌ బుఖారీ అల్లుడు ఉమర్‌ ఖాన్‌ పోటీచేస్తున్నారు. కానీ ఈ దఫా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి ఓటేయాలని బుఖారీ పిలుపునిచ్చారు. బీఎస్పీ హయాంలోనే అన్ని వర్గాలకు లబ్ది చేకూరిందని పేర్కొన్నారు. అధికార ఎస్పీ తమను మోసం చేసిందని తెలిపారు. యూపీ ముస్లింలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఎస్పీ ప్రభుత్వ హయాంలో ముస్లింలపై 400లకు పైగా దాడులు జరిగాయని గుర్తుచేశారు.

బిఎస్పీలో కూడా వారసులు..

బిఎస్పీలో కూడా వారసులు..

వారసత్వ రాజకీయాలకు దూరమని చెప్పుకొనే బీఎస్పీ దీనికి మినహాయింపేమీ కాదు. మాఫియా నేత ముక్తార్‌ అన్సారీ బృందంలోని ముగ్గురికి బీఎస్పీ టిక్కెట్లు ఇచ్చింది. మౌ నుంచి ముక్తార్‌, మహమ్మదాబాద్‌ నుంచి ఆయన పెద్ద సోదరుడు సిబగ్‌తుల్లా, ఘోషీ నుంచి ముక్తార్‌ తనయుడు అబ్బాస్‌ పోటీచేస్తున్నారు. మౌ నుంచి వరుసగా గెలుస్తున్న ముక్తార్‌ ఆ తర్వాత భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్యకేసులో ఆగ్రా జైలులో ఉన్నారు. కాంగ్రెస్‌ మాజీ మంత్రి హరిశంకర్‌ తివారీ తనయుడు వినయ్‌ శంకర్‌ తివారీ తన తండ్రి కంచుకోట చుల్లూపూర్‌ నుంచి బీఎస్పీ టిక్కెట్టుపై పోటీచేస్తున్నారు.

అఖిలేష్ సింగ్ కూతురుకు కాంగ్రెసు టికెట్

అఖిలేష్ సింగ్ కూతురుకు కాంగ్రెసు టికెట్

కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా బలమైన రాయబరేలీ స్థానం నుంచి పహిల్వాన్ అఖిలేశ్ సింగ్ కూతురు, లండన్ లో ఎంబీఏ పూర్తిచేసిన అదితి సింగ్ కు సీట్ కేటాయించింది. ఇంతకుముందు ఈ స్థానం నుంచి అఖిలేశ్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీఎల్ పూనియా తనయుడు.. ఐఐటీ రూర్కీ పట్టభద్రుడు తనూజ్ పూనియా.. జైద్ పూర్ స్థానం నుంచి బరిలో నిలిచారు. రాజ్యసభ ఎంపీ ప్రమోద్‌ తివారీ కూతురు ఆరాధనామిశ్రా రాంపూర్‌ ఖాస్‌ నుంచి రంగంలోకి దిగుతున్నారు. మరో రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సిన్హా సతీమణి అమితాసింగ్‌ అమేథీ నుంచి బరిలోకి దిగబోతున్నారు.

English summary
Lucknow:Uttar Pradesh Assembly elections will not just be a fight for power, it will also be for inheriting political legacy by the new generation of several leaders cutting across party lines
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X