చెట్లను ‘దేవుడే’ కాపాడుతున్నాడు: మిశ్రా ప్రత్యేకతను అభినందించాల్సిందే!
లక్నో: జీవరాశుల మనుగడకు ప్రాణాధారమైన చెట్లను కాపాడుకోవడం కోసం ఎన్నో దశాబ్దాలుగా పోరాటం జరుగుతూనే ఉంది. చిప్కో ఉద్యమం మొదలు.. తాజాగా, ముంబైలోని ఆరే ప్రాంతంలోని చెట్లను కాపాడుకోవడానికి జరిగిన ఉద్యమం వరకు అనేక పోరాటాలు జరిగాయి. జరుగుతున్నాయి.

అడవులను కాపాడేందుకు..
తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్యావరణ కార్యకర్త అనే వ్యక్తి ప్రత్యేకమైన తరహాలో తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. గోండా ప్రాంతంలో ప్రజలు చెట్లను నరకకుండా ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నారు పరాగ్దత్ మిశ్రా. అడవులను కాపాడమని నేరుగా దేవుళ్లనే కోరుతుండటం గమనార్హం.

చెట్లపై దేవుళ్లు..
ఇంతకీ మిశ్రా ఏం చేస్తున్నారంటే.. చెట్లను స్థానిక ప్రజలెవరూ నరకకుండా.. ఆ చెట్లపై దేవీదేవతల చిత్రాలను గీస్తున్నారు. వెర్మిలియన్ రంగుతో బొమ్మలను వేస్తున్నారు.
అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో చెట్లను పెద్ద ఎత్తును నరికివేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు, సమతుల్యత అనే అంశాలపై గ్రామస్తులకు అంతగా అవగాహన లేదు. కానీ, వారు పూజించే దేవీదేవతల చిత్రాలను చెట్లపై గీస్తే వారు చెట్లను నరకకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే జరుగుతోంది కూడా అని వజియరగంజ్ అభివద్ది బ్లాక్స్ న్వా పంచాయత్ చీఫ్ అయిన మిశ్రా మీడియాకు తెలిపారు.

నరకడం లేదు.. పూజిస్తున్నారు..
మొదట చెట్ల కాండ భాగాలపై దేవీదేవతల చిత్రాలను చెక్కుతున్నానని, ఆ తర్వాత వాటికి వెర్మిలియన్ రంగులు వేస్తున్నట్లు మిశ్రా తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆ చెట్లను నరకడం లేదని.. పూజిస్తున్నారని చెప్పారు. గోండా ప్రాంతంలోని చెట్లను కాపాడేందుకు తాను ఇదే విధంగా అన్ని చెట్లపై చిత్రాలను గీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేవీదేవతలను తాను చెట్లను కాపాడేవారిగా చేశానని మిశ్రా చెప్పుకొచ్చారు. ఒక్కో చెట్టుపై చిత్రాన్ని చెక్కేందుకు, రంగులు వేసేందుకు సుమారు రూ. 200 వరకు ఖర్చు అవుతోందని, ఆ ఖర్చును తానే భరిస్తున్నానని పరాగ్దత్ మిశ్రా తెలిపారు.

ఫలితం విజయమే..
తమ పంచాయతీ వరకు వ్యాపించి ఉన్న అటవీ ప్రాంతంలో విచక్షణారహితంగా నరుకుతుండటంతో క్రమంగా చెట్లు తగ్గుతూ వచ్చాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను ఈ ఆలోచన చేశానని, తన ఆలోచన మంచి ఫలితాన్ని ఇస్తోందని మిశ్రా తెలిపారు. చివరి సారి తాను ప్రధాన్ అయిన తర్వాత నాటిన చెట్లన్నింటినీ నరికివేశారని.. దీంతో భారీ నష్టం వాటిల్లందని తాను భావించినట్లు తెలిపారు. తమ పంచాయతీలో దాదాపు 8వేల మంది జనాభా ఉందని, చెట్లు 10వేల వరకు ఉన్నాయని తెలిపారు. అయితే, గ్రామస్తులు చెట్లను క్రమంగా నరికివేయడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఇలాంటి ప్రచారాన్ని చేపట్టానని తెలిపారు. దీంతో తమ గ్రామంలోని ప్రజలు చెట్లను నరకడం లేదని చెప్పారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా చెట్లను కాపాడేందుకు తన ఆలోచనను అనుసరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.