శివసేనలో చేరిన ఊర్మిళ మటోండ్కర్ .. పార్టీలో చేరగానే ఎమ్మెల్సీ గా జాక్ పాట్ , కంగనాకు చెక్ !!
బాలీవుడ్ నటీమణి, రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో మహా రాష్ట్ర అధికార పార్టీ అయిన శివసేన లో చేరారు. నేడు శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో శివసేన తీర్థం పుచ్చుకున్న ఊర్మిళ మటోండ్కర్ మంచి జాక్ పాట్ కూడా కొట్టేసినట్టు తెలుస్తుంది . నేడు మహిళా నేతలు పార్టీ కండువా కప్ప గా శివసేన లోకి సాదరంగా ఆహ్వానం పలకగా ఊర్మిళ మటోండ్కర్ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీలో చేరిన తర్వాత ఆమె ముందుగా రాజ్ ఠాక్రే దంపతుల చిత్రపటానికి నివాళులు అర్పించారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఓడిపోయినా ఊర్మిళ మటోండ్కర్
గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉత్తర ముంబై నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మాటోండ్కర్ పరాజయం పాలయ్యారు. మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాడి (ఎంవిఎ) ప్రభుత్వానికి కీలకమైన మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మాటోండ్కర్ రాజీనామా చేశారు. ముంబై కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతోనే తాను ఓడిపోయానని, ముఖ్య నాయకుల తీరు ఆమె రాజీనామాకు కారణమని ఆమె పేర్కొన్నారు.
సీబీఐ 'పాన్ షాప్' లా మారింది ..బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇలా .. మహారాష్ట్ర మంత్రి సంచలనం

శివసేనలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్న ఊర్మిళ మటోండ్కర్
పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన ఊర్మిళ మటోండ్కర్ శివసేన మహిళా విభాగం చాలా బలంగా ఉందని అందులో భాగమైనందుకు నేను సంతోషంగా ఉన్నాను అని మీడియాతో అన్నారు. ముంబైలో భాగమైనందుకు గర్వపడుతున్నానని పేర్కొన్న ఆమె ఇప్పటికే తాను మహిళల మరియు పిల్లల సమస్యలపై పని చేస్తున్నానని తనను ఎమ్మెల్సీ గా అంగీకరించినట్లయితే, మహిళల మరియు పిల్లల సమస్యలపై మరింత పనిచేయాలనుకుంటున్నాను అని ఊర్మిళ మటోండ్కర్ తెలిపారు.

శివసేనలో చేరగానే బంపర్ ఆఫర్ ... ఎమ్మెల్సీగా స్థానం
బాలీవుడ్ నటీమణి,ఊర్మిళ మటోండ్కర్ శివసేన పార్టీలో చేరడమే కాకుండా బంపర్ ఆఫర్ కూడా కొట్టినట్లుగా తెలుస్తుంది. మహారాష్ట్ర శాసనమండలిలో సభ్యురాలిగా ఆమెకు అవకాశం ఇవ్వనున్నట్లు గా తెలుస్తుంది. మహారాష్ట్ర శాసనమండలిలో గవర్నర్ కోటాలో నామినేట్ చేసే 12 ఎమ్మెల్సీ స్థానాలకు పంపించిన జాబితాలో ఊర్మిళ మటోండ్కర్ పేరు కూడా ఉన్నట్లుగా శివసేన వర్గాలు వెల్లడించాయి. ఊర్మిళ మటోండ్కర్ శివసేన లో చేరడాన్ని స్వాగతించారు రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్.

ఊర్మిళ చేరికపై సంజయ్ రౌత్ హర్షం .. అందుకేనా ?
నిన్న ముందుగానే ఊర్మిళ మటోండ్కర్ శివసేన చేరికను ఉద్దేశించి మాట్లాడిన సంజయ్ రౌత్ రేపు ఆమె మా పార్టీలో చేరబోతున్నారు. ఆమె శివసైనిక్. ఆమె శివసేనలో చేరడం మాకు సంతోషంగా ఉంది. ఇది పార్టీ ‘మహిళా అగాడి'ని బలోపేతం చేస్తుంది అని శివసేన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ముందుగానే పేర్కొన్నారు. ప్రస్తుతం కంగనా రనౌత్ వ్యాఖ్యలకు సంజయ్ రౌత్ కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఇక ఉర్మిలను రంగంలోకి దించే అవకాశం లేకపోలేదు. అందుకే ఆమె రాక పట్ల సంజయ్ రౌత్ అమితానందం వ్యక్తం చేస్తున్నారు .

కంగనాపై ఊర్మిళ అస్త్రం .. శివసేన ప్లాన్ ఇదేనా ?
ఇదిలా ఉంటే ఇప్పటికే బాలీవుడ్ నటీమణీ కంగనా రనౌత్ శివసేన ను టార్గెట్ చేస్తూ, శివసేన సీఎం ఉద్ధవ్ ఠాక్రే పై విమర్శలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఈ సమయంలో బాలీవుడ్ నటీమణి ఊర్మిళ మటోండ్కర్ శివసేన లో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కంగనా కు గట్టి కౌంటర్ ఇవ్వడానికి ఇక నుండి శివసేన ఊర్మిళ ను రంగంలోకి దింపుతుంది అని మహారాష్ట్రలో రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.