పోయేముందు నిప్పురాజేసిన ట్రంప్.. కాశ్మీర్, సీఏఏ, ఢిల్లీ హింసపై కామెంట్లు.. మరోసారి పాక్‌కు సమర్థన
ఇంకొద్దిగంటల్లో తన రెండ్రోజుల భారత పర్యటన ముగియనుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో భారత పారిశ్రామకవేత్తలతో భేటీ తర్వాత ఆయన మీడితో మాట్లాడారు. కేంద్రం పలు మార్లు హెచ్చరించిన తర్వాత కూడా కాశ్మీర్ వివాదంలో తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఆందోళనలు, ఢిల్లీలో హింస, త్వరలో జరుగనున్న అమెరికా ఎన్నికలపై ట్రంప్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

ఎందుకు చనిపోయారో తెలియదు..
ఒక విదేశీ అధ్యక్షుడు ఢిల్లీలో ఉండగా.. అక్కడ తీవ్ర హింస చెలరేగడం దేశచరిత్రలో తొలిసారి. సీఏఏపై ఢిల్లీలో పేట్రేగిన హింసలో మంగళవారం సాయంత్రానికి 10 మంది చనిపోయారు. ఇదే అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ‘‘అవును. ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. అయితే గొడవలు ఎందుకు జరుగుతున్నాయో, జనం ఎందుకు చనిపోయారో కారణాలు మాత్రం నాకు తెలియదు''అని ట్రంప్ బదులిచ్చారు.

మతసామరస్యంపై మోదీకి సలహా
పౌరసత్వ సవరణ చట్టంపై ఇండియా అంతటా ఆందోళనలను జరుగుతోన్న సంగతి తనకు తెలుసని, అయితే ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన చర్చల్లో మాత్రం సీఏఏ అంశం ప్రస్తావనకు రాలేదని ట్రంప్ చెప్పారు. ‘‘మత స్వేచ్ఛను గౌరవించడం, దాన్ని కాపాడుకోవడం అమెరికా విధానం. ఇండియాలోనూ మతస్వేచ్ఛను కాపాడాలని మోదీకి సలహా ఇచ్చాను. సీఏఏపై పలు చోట్ల దాడులు జరిగినట్లు నాకు తెలిసింది. ఈ సమస్యలను భారత ప్రభుత్వం పరిష్కరించుకోగలదని నమ్ముతున్నాను'' అమెరికా ప్రెసిడెంట్ తెలిపారు.

కాశ్మీర్‌పై అదే మాట..
కాశ్మీర్ వివాద పరిష్కారం కోసం తన వంతు సాయం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, అవసరమైతే మధ్యవర్తిత్వం కూడా చేస్తానని అమెరికా ప్రెసిడెంట్ అన్నారు. అయితే దీనికి రెండు దేశాలూ అంగీకరించాల్సిఉంటుందని, ప్రతస్తుతం పాక్, భారత్ వేర్వేరు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మధ్యవర్తిత్వం చేస్తాననడం తప్ప తాను చేయగలిగిందేమీ లేదని ట్రంప్ చెప్పారు. గతంలోనూ పలు మార్లు ట్రంప్ ఈతరహా వ్యాఖ్యలు చేయడం, వాటిని భారత ప్రభుత్వం ఖండించడం తెలిసిందే.

మళ్లీ పాక్ పాట..
సోమవారం అహ్మదాబాద్ లో జరిగిన ‘నమస్తే ట్రంప్'ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ముందే పాకిస్తాన్ ను పొగిడిన అమెరికా ప్రెసిడెంట్.. మంగళవారం ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లోనూ పాక్ పాట పాడారు. టెర్రరిజాన్ని రూపుమాపే విషయంలో ఇండియాతోపాటు పాకిస్తాన్ తోనూ అమెరికా కలిసి పనిచేస్తుందని కుండబద్దలుకొట్టారు. టెర్రరిజంపై పోరాటంలో పాక్ ప్రభుత్వం ప్రగతిసాధించిందని కితాబిచ్చారు. తద్వారా మోదీ గత ప్రకటనతో ట్రంప్ విభేధించారు. టెర్రరిస్టుల ఫ్యాక్టరీగా ఉన్న పాకిస్తాన్ పై ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలని మోదీ ఐక్యరాజ్యసమితిలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

నేను గెలవకుంటే అమెరికాకే నష్టం
అమెరికా అధ్యక్ష పదవి కోసం ఈ ఏడాది నవంబర్ లో జరుగనున్న ఎన్నికలపై ట్రంప్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. గడిచిన నాలుగేళ్లలో దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లానని, నిరుద్యోగం రేటు బాగా తగ్గి, అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్న ఆయన.. తానుగానీ ఎన్నికల్లో ఓడిపోతే అమెరికా అన్ని విధాలుగా నష్టపోతుందన్నారు. అమెరికా ఎన్నికల్లో రష్యా ప్రమేయాన్ని సహించబోమని ట్రంప్ చెప్పారు.


ట్రంప్‌తో అంబానీ భేటీ..
రెండో రోజు పర్యటనలో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మంగళవారం భారత పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు. అమెరికాలో పెట్టుబడులు, భారత కంపెనీల్లో అమెరికా పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలను చర్చించారు. ట్రంప్ ను కలిసినవారిలో ముఖేశ్ అంబానీ, గౌతం అదానీ, ఆనంద్ మహీంద్రా తదితర ప్రముఖులున్నారు. మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందు తర్వాత ట్రంప్ అమెరికా తిరుగుపయనమవుతారు.