Exit polls: ఉత్తర ప్రదేశ్‌పై ఇండియా టుడే సంచలనం: వాటన్నింటికీ భిన్నంగా
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. చివరి విడత ఉత్తర ప్రదేశ్ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్‌లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌పై నిలిచాయి. దీనితో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటితమౌతున్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు కలిసి మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోందని ఇండియా టుడే-మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్‌పోల్ స్పష్టం చేసింది. ఇప్పటిదాకా అన్ని ఎగ్జిట్ పోల్స్ కంటే భిన్నంగా దీని అంచనాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభంజనం వీస్తుందని తేల్చి చెప్పింది. 2017 నాటి ఎన్నికల్లో వచ్చిన స్థానాలతో పోల్చుకుంటే- ఈ సారి బీజేపీకి లభించే సీట్ల సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేసింది.

బీజేపీ-తన మిత్రపక్షాలతో కలిసి 288 నుంచి 326 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జెండా ఎగుర వేస్తుందని ఇండియా టుడే-మై యాక్సిస్ ఇండియా అంచనా వేసింది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీకి 71 నుంచి 101 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ కనీసం రెండంకెలను కూడా అందుకోలేవని అభిప్రాయపడింది. బీఎస్పీకి 3 నుంచి 9, కాంగ్రెస్‌కు 1 నుంచి 3 స్థానాలు మాత్రమే దక్కుతాయని పేర్కొంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఇండియా టుడే-మై యాక్సిస్ ఇండియా పేర్కొంది. అసెంబ్లీలో బీజేపీకి ఉన్న సీట్ల సంఖ్య మిత్రపక్షాలతో కలిపి 312. ఇండియా టుడే మాత్రం ఈ సంఖ్య కంటే ఎక్కువే సీట్లను ప్రిడిక్ట్ చేసింది. 326 వరకు వస్తాయని అంచనా వేసింది. ఇప్పటిదాకా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా- బీజేపీకి సీట్లు తగ్గుతాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 220 నుంచి 240 వరకు అంచనా వేశాయి అవన్నీ.
ఇండియాటుడే మాత్రం బీజేపీ ప్రభంజనం ఉంటుందని తేల్చి చెప్పింది. బీజేపీ-46, సమాజ్‌వాది పార్టీ-36, బహుజన్ సమాజ్‌వాది పార్టీ-12, కాంగ్రెస్-3, ఇతరులు- 3 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని అంచనా వేసింది. యోగి ఆదిత్యనాథ్ తిరుగులేని మెజారిటీతో ఘన విజయాన్ని సాధిస్తారని, ఎన్నికల ప్రచార సమయంలో ఆయన చేసిన ప్రకటనలకు అనుగుణంగా బీజేపీ మరోసారి 300 మార్క్‌ను దాటుతుందని స్పష్టం చేసింది.