Exit polls: ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి సీట్లు తగ్గుతాయ్ గానీ
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. చివరి విడత ఉత్తర ప్రదేశ్ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్‌లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌పై నిలిచాయి. దీనితో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటితమౌతున్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు కలిసి మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోందని టీవీ9 భారత్‌వర్ష్-పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్‌పోల్ రిజల్ట్స్ స్పష్టం చేసింది. సమాజ్‌వాది పార్టీ, దాని మిత్రపక్షాలు మరోసారి ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతాయని అంచనా వేసింది. 2017 నాటి ఎన్నికల్లో వచ్చిన స్థానాలతో పోల్చుకుంటే- ఈ సారి బీజేపీకి లభించే సీట్ల సంఖ్య భారీగా తగ్గుతుందని పేర్కొంది. సమాజ్‌వాది పార్టీకి లభించే స్థానాలు పెరిగినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌ను అందుకోలేదని స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోందని టీవీ9 భారత్‌వర్ష్ పేర్కొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను బీజేపీ అందుకుంటుందని, బీజేపీ-తన మిత్రపక్షాలతో కలిసి 211 నుంచి 225 సీట్లను దక్కించుకుంటుందని అంచనా వేసింది. సమాజ్‌వాది పార్టీకి 146 నుంచి 160 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెంది బహుజన్ సమాజ్‌వాది పార్టీకి 14 నుంచి 24 సీట్లు దక్కుతాయని తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ కనీసం రెండంకెలను కూడా అందుకోలేకపోవచ్చని అభిప్రాయపడింది. హస్తం పార్టీ 4 నుంచి 6 స్థానాలకు మాత్రమే పరిమితమౌతుందని టీవీ9 భారత్‌వర్ష్ ఎగ్జిట్‌పోల్ పేర్కొంది. బీజేపీ-40.1, సమాజ్‌వాది పార్టీ-34.93, బీఎస్పీ-14, కాంగ్రెస్-7.4, ఇతరులు 3.6 మేర ఓట్ల శాతం పోల్ అవుతాయని స్పష్టం చేసింది. దీన్ని బట్టి చూస్తే- యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం కానుంది. సమాజ్‌వాది పార్టీ తన ఓటు శాతాన్ని, అసెంబ్లీ స్థానాల సంఖ్యను భారీగా పెంచుకున్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతుందని ఈ సర్వే ద్వారా స్పష్టమౌతోంది.