బీజేపీ నుంచి రెస్పాన్స్ లేదు..: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే జేడీయూ పోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరనున్న తరుణంలో జేడీయూ కీలక నిర్ణయం తీసుకుంది. తన భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీతో పొత్తు కుదరకపోవడంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయించారు.
జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మాట్లాడుతూ.. యూపీలో బీజేపీతో పొత్తు కురదలేదని, దీంతో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జేడీయూతో బీజేపీ పొత్తు కోరుకోవడం లేదని చెప్పారు. అప్నాదల్, నిశద్ పార్టీలతోనే బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకుంటోంది. బీజేపీ పెద్దలను కలిసేందుకు వెళ్లినప్పటికీ.. తమ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపలేదని జేడీయూ నేత తెలిపారు.

ఈ నేపథ్యంలోనే తాము ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిశ్చయించుకున్నామని కేసీ త్యాగి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తుకు ముందుకు రాకపోవడంపై జేడీయూ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ ఉపేంద్ర కుశ్వాహ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీహార్ రాష్ట్రంలో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, కేంద్రంలోనూ ఈ రెండు పార్టీలు భాగస్వామ్యం కొనసాగుతోంది. అయితే, యూపీలో మాత్రం జేడీయూకు ఎక్కువ సీట్లు కేటాయించడం సరికాదని భావించిన బీజేపీ.. ఆ పార్టీతో పొత్తుకు ఆసక్తి చూపలేదు. కాగా, జనవరి 18న లక్నోకు కేసీ త్యాగి చేరుకోనున్నారు. ఆ సమయంలోనే యూపీ అభివృద్ధి ప్రణాళికల గురించి తెలపనున్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 - మార్చి 7 మధ్య 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. మొదటి దశలో 58 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, రెండో దశలో 55 స్థానాలు, మూడవ దశలో 59 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరగనుంది.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ శివపాల్ యాదవ్‌కు చెందిన పీఎస్పీ(ఎల్), మహన్ దళ్, ఓపీ రాజ్‌భర్ నేతృత్వంలోని ఎస్బీఎస్పీ, ఆర్ఎల్డీ, కృష్ణ పటేల్‌కు చెందిన అప్నా దళ్ వర్గంతో పొత్తు పెట్టుకోనున్నట్లు ప్రకటించింది. .
మరోవైపు అప్నాదళ్, నిషాద్ పార్టీలతో బీజేపీ చేతులు కలిపింది. కాగా, 1987 తర్వాత యూపీలో ఏ సీఎం కూడా వరుసగా రెండోసారి విజయం సాధించలేకపోయినందున యోగి ఆదిత్యనాథ్‌కు గట్టి సవాలుగా ఈ ఎన్నికలు మారాయి. అయితే, ఓపీనియన్ పోల్స్ మాత్రం బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని, యోగి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని అంచనా వేస్తున్నాయి.