మేనకా, వరుణ్‌కు బీజేపీ షాక్: స్టార్ క్యాంపెయినర్ జాబితాలో లేని పేర్లు
మేనకాగాంధీ, వరుణ్ గాంధీపై బీజేపీ హై కమాండ్ గుర్రు మీదుంది. ఇటీవల వరుణ్ చేసిన ట్వీట్లతో.. వారికి స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు లభించలేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో వీరికి చోటు కల్పించలేదు. 30 మంది స్టార్ క్యాంపెయినర్లతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఉన్నారు.
యూపీలోని సుల్తాన్ పూర్, ఫిలిబిత్ నుంచి తల్లీకొడుకులు ఇప్పటి వరకు అనేకసార్లు గెలిచారు. వీరిద్దరూ బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. అయినప్పటికీ ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి వీరిని తొలగించిన అధిష్ఠానం.. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి కూడా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన లఖీంపూర్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపై నుంచి కారును నడిపి పలువురి మరణానికి కారణమయ్యారు.
ఘటనపై వరుణ్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. సొంత పార్టీ బీజేపీని ప్రశ్నిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించలేదని విమర్శించారు. దీంతో బీజేపీ అధిష్ఠానం వీరిపై ఆగ్రహంగా ఉంది.

యూపీలో రాజకీయాలు మరింత రసవత్తరంగా రంజుగా మారాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రస్తుం యూపీలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఓ వైపు ఎస్పీ మరో వైపు బీజేపీ మధ్యే ప్రధాన పోరు కొనసాగుతోంది. సర్వే సంస్థలన్నీ కాషాయానిదే పవర్ అంటుండగా 80 శాతం సీట్లు ఎస్పీకి 20 శాతం సీట్లు బీజేపీకి వస్తాయని జోష్యం చెప్పారు. ఇప్పటి దాకా ఎస్పీలో చేరిన మంత్రుల సంఖ్య ముగ్గురు కావడం విశేషం. చేరిన వారంతా బలమైన ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు.
ఇటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్పీ, కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఫస్ట్ ఫేజ్‌కు సంబంధించి 57 మంది, సెకండ్ ఫేజ్‌కు సంబంధించి 48 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. బీజేపీ యూపీ ఇంచార్జీ ధర్మేంద్ర ప్రదాన్ జాబితాను విడుదల చేశారు.సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ నుంచి బరిలోకి దిగుతారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మోర్య సిరటు నుంచి పోటీ చేస్తారు.