• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తర్ ప్రదేశ్: సీఎం యోగి జనాభా పాలసీకి, ముస్లింలకు ఏమైనా సంబంధం ఉందా?

By BBC News తెలుగు
|
ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్త జనాభా పాలసీ త్వరలో యోగీ ప్రభుత్వం ముందుకు రాబోతోంది.

2019 ఆగస్టు 15న ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యలను ప్రస్తావించారు. చిన్న కుటుంబం కలిగి ఉండటం, దేశభక్తి కలిగి ఉండటం ఒకటేనన్నారు.

''దేశంలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. ఇది మనకు, మన రాబోయే తరాలకు కొత్త సమస్యలను సృష్టిస్తుంది. మన దేశంలో చాలా పేద కుటుంబాలు చిన్న కుటుంబానికి పరిమితం కావడం ద్వారా దేశాభివృద్ధికి దోహద పడుతున్నాయి. దేశానికి మేలు చేయడంలో వారి పాత్రే ఎక్కువ. వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. చిన్న కుటుంబాన్ని కలిగి ఉన్నవారు దేశభక్తి ఉన్నవారని అర్ధం'' అని అన్నారు.

ప్రధాని మోదీ చేసిన ఈ ప్రసంగం నుంచి ప్రేరణ పొందిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం 2021-2030 పాపులేషన్ పాలసీని తీసుకు వచ్చింది. అవసరమైతే ఒక చట్టాన్ని తీసుకురావచ్చని కూడా స్పష్టంగా పేర్కొంది.

ఆ చట్టం ముసాయిదా (ఉత్తర ప్రదేశ్‌ జనాభా నియంత్రణ, స్థిరీకరణ మరియు సంక్షేమ బిల్లు)ను రాష్ట్ర న్యాయ కమిషన్ తయారు చేసింది. ప్రస్తుతం ఈ డ్రాఫ్టు బిల్లుపై సలహాలు, సూచనలు కోరింది.

అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ముసాయిదాను ఆగస్టు మొదటి వారంలో యోగి ప్రభుత్వానికి సమర్పిస్తారు. అయితే, చట్టాలు చేయడం ద్వారా జనాభాను నియంత్రించలేమని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంటున్నారు.

బిహార్‌లో బీజేపీ, జేడీయూ లు అధికార కూటమిలో భాగస్వాములు. వీరిద్దరి పరస్పర విరుద్ధ అభిప్రాయాలు చర్చనీయాంశంగా ఇప్పుడు మారాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ మాదిరిగానే జనాభా పెరుగుదల విషయంలో బిహార్‌లో కూడా ఆందోళన ఉంది.

సమాజ్‌వాదీ పార్టీ, ఏఐఎంఐఎం వంటి కొన్ని రాజకీయ పార్టీలు ప్రతిపాదిత జనాభా నియంత్రణ చట్టం ముసాయిదా బిల్లును ముస్లింలతో లింకు పెట్టడమే కాకుండా దాన్ని తీసుకొస్తున్న సమయాన్ని కూడా ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపాదిత చట్టం గురించి ఎక్కువ చర్చ జరగడానికి కారణం ఇదే.

కొత్త జనాభా విధానానికి, ప్రతిపాదిత చట్టానికి మధ్య ఉన్న తేడాను ఇక్కడ అర్ధం చేసుకోవాల్సి ఉంది.

దేశంలో సుమారు ఆరోవంతు మంది ప్రజలు ఉత్తర్ ప్రదేశ్‌లోనే నివసిస్తున్నారు

ఉత్తర ప్రదేశ్‌ జనాభా-గణాంకాలు

2011 జనాభా లెక్కల ప్రకారం, దేశ జనాభాలో ఆరో వంతు (సుమారు 16శాతం) మంది ఉత్తర్‌ ప్రదేశ్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం, ఉత్తర్‌ ప్రదేశ్‌ జనాభా సుమారు 20కోట్లు. 2050 నాటికి ఇది 28 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.

భారతదేశంలో కౌమార దశ (10-19 ఏళ్ల లోపు) ఉన్న బాలికలు ఎక్కువమంది ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉన్నారు.అత్యధిక యువ జనాభా (15-24 వయస్సు) కూడా దేశం మొత్తంలో ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే ఎక్కువ ఉన్నారు. ప్రస్తుతం

ఈ వయసు జనాభా గురించి ప్రభుత్వం ఎక్కువగా ఆందోళన చెందుతోంది.

దీనికి కూడా ఒక కారణం ఉంది. 4-19 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలు 15-19 సంవత్సరాల మధ్య తల్లులు అవుతారు. రాష్ట్రంలో 30% మంది అబ్బాయిలకు 21 ఏళ్లలోపు వివాహం జరుగుతుంది.

అందుకే ఉత్తర్‌ ప్రదేశ్‌ జనాభా విధానం ప్రధాన ఉద్దేశం రాష్ట్ర జనాభాను స్థిరీకరించడం, సంతానోత్పత్తి రేటును తగ్గించడమేనని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అంటున్నారు.

జనాభా విధానం ప్రధాన ఉద్దేశం రాష్ట్ర జనాభాను స్థిరీకరించడం, సంతానోత్పత్తి రేటును తగ్గించడమేనని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అంటున్నారు

ఉత్తర్‌ ప్రదేశ్‌లో జనాభా విస్ఫోటనం ఉందా?

జనాభా వేగంగా పెరుగుతున్నప్పుడు, సంతానోత్పత్తి రేటు 4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒక దేశం లేదా రాష్ట్రంలో జనాభా విస్ఫోటనం ఉందని చెబుతారని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ అలోక్ బాజ్‌పాయ్ అన్నారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌ విషయానికి వస్తే 1991-2011 మధ్య జనాభా పెరుగుదల రేటు 5శాతం తగ్గింది. అంటే ఇక్కడ జనాభా పెరుగుతోంది, కానీ వృద్ధిరేటు తగ్గింది.

అదే విధంగా గత దశాబ్దంలో ఉత్తర్‌ ప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు తగ్గింది. 2005-06లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు 3.8గా ఉంది.

ఇది 2015-16లో 2.7 కి పడిపోయింది. కాగా, భారతదేశ జాతీయ సగటు 2.2 శాతంగా ఉంది.

ఒక అంచనా ప్రకారం, 2025 నాటికి ఉత్తర్‌ ప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు 2.1 కి చేరుకుంటుంది. ఇది భర్తీ నిష్పత్తి(రీప్లేస్‌మెంట్ రేట్)కి దగ్గరగా ఉంటుంది.

సంతానోత్పత్తి రేటు అనేది ఒక మహిళ జన్మనిచ్చే పిల్లల సగటు సంఖ్యను సూచిస్తుంది.

సంతానోత్పత్తి రేటు 2.1శాతం అంటే ఒక తల్లి ఇద్దరు పిల్లలను కంటుంది. దీనిని బట్టి చూస్తే ఈ రెండు విషయాలలో అంటే జనాభా వృద్ధి రేటు, సంతానోత్పత్తి రేటు ఆధారంగా ఉత్తర్ ప్రదేశ్‌లో జనాభా విస్ఫోటనం లేదని చెప్పవచ్చు.

కొత్త జనాభా పాలసీ ప్రకారం 2030 నాటికి సంతానోత్పత్తి రేటును 2.0 కన్నా తక్కువగా ఉండేలా చూడాలన్నది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఈ విధానం ఎందుకు?

ఉత్తర్‌ ప్రదేశ్‌లో జనాభా పాలసీ అవసరమేనని, అయితే, ఇద్దరు పిల్లలు మాత్రమే కనాలన్న నియమం అవసరం లేదని జనాభా నిపుణుడు అలోక్ బాజ్‌పేయి అన్నారు.

కొత్త జనాభా పాలసీ ప్రకారం 2030 నాటికి సంతానోత్పత్తి రేటును 2.0 కన్నా తక్కువగా ఉండేలా చూడాలన్నది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం. దీన్ని సాధించడానికి కుటుంబ నియంత్రణ విధానం గురించి ప్రజలకు మరింత ప్రచారం చేయాల్సి ఉంటుంది.

ఉదాహరణకు చిన్న వయసులోనే కుటుంబ నియంత్రణ పద్ధతులు కాకుండా, పిల్లల జననాల మధ్య దూరాన్ని పెంచడం మంచిదని అలోక్ బాజ్‌పేయి అన్నారు.

ఈ విధానం గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి ఒక పాలసీ అవసరం. యోగి ప్రభుత్వం దగ్గర ఒక విధానం ఉంది. అయితే, దీన్ని అమలు చేయడానికి, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, నిధులు అవసరం.

ప్రత్యేక బడ్జెట్‌, కార్యాచరణ ద్వారా ఈ పాలసీని అమలు చేస్తే, చట్టం చేయాల్సిన అవసరం ఉండదని బాజ్‌పేయి అన్నారు.

జనాభా స్థిరీకరణ ప్రయత్నాల్లో యోగీ ఆదిత్యనాథ్

జనాభా నియంత్రణ చట్టం ఎప్పుడు అవసరం?

జనాభా పాలసీని అమలు చేస్తూనే, ఆ సమయంలో జనాభా స్థిరీకరణ జరగకపోయినా, సంతానోత్పత్తి రేటు తగ్గక పోయినా చట్టాన్ని తీసుకు వస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఈ చట్టం ముసాయిదాను రాష్ట్ర లా కమిషన్ తయారు చేసింది. ఇందులో ఇద్దరు పిల్లల కుటుంబానికి ప్రత్యేకంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని చెబుతున్నారు.

అంటే, ఇద్దరు సంతానం ఉన్నవారికి రెండు అదనపు ఇంక్రిమెంట్లు, తల్లిదండ్రులు కాబోయే ఉద్యోగస్తులైన భార్యా భర్తలకు పూర్తి జీతంతో కూడిన 12 నెలల సెలవు, అదనపు భత్యాలు చెల్లిస్తామని ఈ చట్టం చెబుతోంది.

ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్న వారు స్థానిక, పౌర, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేరు. వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదు. ఒక్కరినే కనడాన్ని కూడా ప్రోత్సహిస్తామని ఈ చట్టం చెబుతోంది.

జూలై 19 నాటికి రాష్ట్ర లా కమిషన్ దీనిపై సూచనలు, సలహాలు కోరింది. గత రెండు రోజుల్లో 4000కి పైగా సూచనలు వచ్చాయి. వాటిలో విశ్వ హిందూ పరిషత్ నుంచి వచ్చిన సలహా కూడా ఒకటి.

ఇద్దరు పిల్లల కుటుంబం ప్రతిపాదనను సమర్ధించిన వీహెచ్‌పీ, ఒకే బిడ్డ విధానాన్ని మాత్రం వ్యతిరేకించింది. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ లా కమిషన్‌కు మూడు పేజీల లేఖను పంపింది.

''ఒకే సంతానాన్ని ప్రోత్సహించడం అంటే సంతానోత్పత్తి రేటు 1 గా ఉంటుంది. సగటు సంతానోత్పత్తి రేటు 2.1 అయితేనే జనాభా స్థిరంగా ఉంటుంది. లేకపోతే జనాభా తగ్గిపోవడం మొదలవుతుంది. చైనాలో ఇటీవల అదే జరిగింది. 30 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ విధానాన్ని మార్చాల్సి ఉంటుంది'' అని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అన్నారు.

ఇక విశ్వహిందూ పరిషత్ రెండో వాదన-ఒకే పిల్లవాడు సంసారాన్ని మోయలేడు. ఒక్కో పిల్లవాడు కుటుంబంలో తల్లిదండ్రులు, తాత, నాయనమ్మలను కలిపి మొత్తం ఆరుగురిని పోషించాల్సి ఉంటుంది.

పైగా ఒకే బిడ్డ విధానం వల్ల పిల్లవాడు సంసార బాధ్యతలను తెలుసుకోలేడని వీహెచ్‌పీ వాదన. అందుకే ఒకే సంతానం ప్రతిపాదనను విరమించుకోవాలని విశ్వహిందూ పరిషత్ అంటోంది.

లా కమిషన్ రూపొందించిన జనాభా చట్టం ఒక ప్రతిపాదన అంటూనే, దీనిపై ప్రజల నుండి సలహాలు కోరడం విశేషం.

లా కమిషన్ రూపొందించిన డాఫ్ట్‌ చట్టాన్ని ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించ లేదు, చట్టాన్ని సిద్ధం చేయాలని కూడా సూచించ లేదు.

ఈ విషయంలో లా కమిషనే స్వయంగా చొరవ తీసుకుని ఈ ప్రతిపాదన చేసింది. ఆగస్టు తరువాత దీన్ని ప్రభుత్వానికి పంపుతారు.

అయితే, ఇద్దరు పిల్లల చట్టం తీసుకురావడం వల్ల కొన్ని ఇబ్బందులున్నాయని, పుట్టబోయే బిడ్డల లింగం ఎంపిక విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయని, లింగ నిష్పత్తి కూడా గందరగోళంలో పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ముస్లింలకు మాత్రమే ఇద్దరు పిల్లలు ఉన్నారా?

చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ చట్టాన్ని ముస్లింలతో లింక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో సమాజ్ వాదీ పార్టీ, ఏఐఎంఐఎం ముందు వరసలో ఉన్నాయి. ఈ చట్టం విషయంలో వారు రాజకీయ కోణాన్నిచూస్తున్నారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఆరు నెలలు సమయం ఉంది.

''ప్రాంతీయ పార్టీలు బరిలో ఉన్నచోట హిందూ ఓట్లను పూర్తిగా పొందడానికి, ముస్లిం ఓట్లను చీల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది'' అని రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కుమార్ అన్నారు.

పశ్చిమ బెంగాల్, బిహార్‌లనే చూస్తే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి ముస్లిం ఓట్లు బాగా వచ్చాయి.దీంతో ఆమె గెలవగలిగారు. వామపక్ష కూటమికి, తృణమూల్‌కు మధ్య ఆ ఓటు విడిపోయి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. బిహార్‌లో కూడా అదే జరిగింది. ఎంఐఎంకు సీట్లు లభించకపోతే బిహార్ రాజకీయాలు భిన్నంగా ఉండేవి.

''జనాభా బిల్లును ప్రతిపక్షాలు హిందూ-ముస్లిం ఓట్ల పరంగా చూస్తే, బీజేపీ హిందూ ఓట్లను తనకు అనుకూలంగా పోలరైజ్ చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు'' అని సంజయ్ కుమార్ అన్నారు

ముస్లింలు మాత్రమే ఇద్దరు పిల్లలకంటే ఎక్కువమందిని కంటారా? అనేది కూడా ప్రశ్న. ఉత్తర్‌ ప్రదేశ్ విషయంలో ఇది ఎంత వరకు నిజం అన్నది కూడా చూడాలి.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 గణాంకాలు ప్రకారం రెండు మతాలకు చెందిన వారిలో ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన వారు ఉన్నారు. హిందువులలో ముగ్గురు పిల్లలున్న కుటుంబాలు 40శాతం, ముస్లింలలో 50 శాతం ఉన్నాయి. అంటే హిందూ, ముస్లింల మధ్య వ్యత్యాసం 10 శాతమే.

ఇక మొత్తం జనాభా విషయానికి వస్తే, యూపీలో ముస్లిం జనాభా 18.5% కాగా, హిందువులు 80.6% కంటే తక్కువగా ఉంది.

ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రదేశ్ జనాభా నియంత్రణ చట్టం సంతానాన్ని ఇద్దరు పిల్లలకే పరిమితం చేయాలని చూస్తే అది హిందూ ముస్లింలిద్దరి జనాభాను ప్రభావితం చేస్తుంది.

అందుకే జనాభా నియంత్రణ కోసం మహిళలకు అవగాహన కల్పించడం అనే సూత్రాన్ని నీతీశ్ కుమార్ సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Uttar Pradesh: Does CM Yogi have anything to do with population policy and Muslims
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X