• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌కు కాంగ్రెస్ టికెట్... ఆమె స్పందన ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ప్రకటించారు. మొత్తం 125 మందితో కూడిన ఈ జాబితాలో 50 మంది మహిళలకు చోటు దక్కింది.

గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ముఖ్యంగా మహిళా అభ్యర్థుల గురించి ప్రియాంక ప్రస్తావించారు. వారి వివరాలను వెల్లడించారు.

కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన మహిళా అభ్యర్థుల్లో ఒక్కరు మాత్రం మరింత ప్రత్యేకం.

2017లో సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసు బాధితురాలి తల్లి ఆశా సింగ్‌కు కాంగ్రెస్ టికెట్ లభించింది. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ ఈ కేసులో దోషిగా తేలాడు. ఉన్నావ్‌కు చెందిన 17 ఏళ్ల బాలికపై అత్యాచార కేసులో దోషిగా నిర్దారించిన కోర్టు ఆయనకు జీవితఖైదు విధించింది.

ఆశా సింగ్‌తో పాటు కొంతమంది సామాజిక కార్యకర్తలకు, జర్నలిస్టులకు కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

ఆశా సింగ్ స్పందన ఏంటి?

బీబీసీతో మాట్లాడిన ఆశాసింగ్.. ఉన్నావ్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ టికెట్ ఇవ్వబోతున్నట్లు మీకు ఎప్పుడు తెలిసింది? అని ప్రశ్నించగా... ''ప్రియాంకా గాంధీ మాకు సహాయంగా ఉన్నారు. ఆమె పీఏ మాకు ఫోన్ చేసి.. మీరు ఎన్నికల్లో పోటీచేస్తారా అని అడిగారు. నేను సరే అని చెప్పా'' అని ఆమె బీబీసీ హిందీకి వివరించారు.

ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ''నా పోరాటంలో, కష్టాల్లో మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. ఉన్నావ్ సదర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీజీకి ధన్యవాదాలు'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

https://twitter.com/INCAshaSingh/status/1481597430194139138

ఆశాసింగ్ కుమార్తె, ఉన్నావ్ అత్యాచార కేసు బాధితురాలు కూడా బీబీసీతో మాట్లాడారు. ''మేం మా యుద్ధంలో పోరాడుతున్నాం. ప్రియాంకా గాంధీజీ మమ్మల్ని నామినేట్ చేశారు. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు. కాబట్టి ఆమె ఎక్కువగా మాట్లాడలేదు'' అని ఆమె చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో మీ పరిచయం ఎలా జరిగిందని బీబీసీ అడగగా ఆశాసింగ్ మరో కుమార్తె స్పందించారు. 'మేం కాంగ్రెస్ పార్టీ సభ్యులం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరచుగా వస్తూ పోతుంటాం. ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రియాంకా గాంధీ మమ్మల్ని అడిగారు. ఆమె మాకు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నారు'' అని వివరించారు.

''ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు మేం పోరాడతాం. ఉన్నావ్ ప్రజలు మాకు ఓట్లు వేస్తారు'' అని ఎన్నికల ప్రచార వ్యూహం గురించి చెప్పారు.

https://twitter.com/ANINewsUP/status/1481510314835574784

ప్రియాంకా గాంధీ ప్రకటన

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 సీట్లలో మహిళా అభ్యర్థులను బరిలోకి దించుతామని ప్రియాంకా గాంధీ ప్రకటించారు.

''పెద్ద సంఖ్యలో మహిళలకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందుకు ప్రియాంక గాంధీకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ పని చేసి మహిళలకు చాలా సహాయం చేశారు. ఆమె మమ్మల్ని సమర్థులుగా భావించి పార్టీ టికెట్లు ఇచ్చారు'' అని సోనాలి సింగ్ అన్నారు.

మహిళలకు సాధికారత కల్పించే ప్రయత్నంలో భాగంగా 50 టికెట్లు మహిళా అభ్యర్థులకు కేటాయించినట్లు ప్రియాంకా గాంధీ చెప్పారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా మహిళలు ఏ విధంగా శక్తిమంతంగా మారతారు? అని ప్రశ్నించగా... ''మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తారు. గెలుస్తారు. వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు'' అని సోనాలి సమాధానమిచ్చారు.

అభ్యర్థుల ప్రకటన సందర్భంగా ప్రియాంకా గాంధీ మాట్లాడారు. ''రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలు చేసే అభ్యర్థుల కోసం మేం ప్రయత్నించాం. వీరిలో 40 శాతం మహిళలు, 40 శాతం యువతకు చోటిచ్చాం. టికెట్ కేటాయించిన మహిళల్లో కొంతమంది జర్నలిస్టులు, ఒక నటి, న్యాయం కోసం పోరాడుతున్నవారు ఉన్నారు. వారు తమ జీవితాల్లో వేధింపులు, హింసను ఎదుర్కొన్నారు.''

ఆశాసింగ్ పేరు గురించి ప్రస్తావిస్తూ '' ఆమె, తన పోరాటాన్ని కొనసాగించాలి అనుకుంటున్నారు. తను అధికారంలోకి వచ్చి, సొంతంగా పోరాడాలని మేం ఆశిస్తున్నాం'' అని ప్రియాంక అన్నారు.

https://twitter.com/RahulGandhi/status/1481516814102589442

దీనిపై రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. ''ఉన్నావ్‌లో బీజేపీ కారణంగా ఎవరి కూతురుకైతే అన్యాయం జరిగిందో, ఇప్పుడు ఆమె న్యాయానికి ముఖ చిత్రంగా మారనున్నారు. అన్యాయంపై పోరాడి గెలుస్తారు'' అని ట్వీట్ చేశారు.

ఆశాసింగ్‌తో పాటు ప్రియాంకా గాంధీ ప్రకటించిన ప్రముఖ మహిళా అభ్యర్థుల్లో పాజహాన్‌పుర్‌కు చెందిన ఆశావర్కర్ పూనమ్ పాండే కూడా ఉన్నారు. ఆమె గురించి మాట్లాడుతూ... పూనమ్ పాండే పోలీసుల చేతిలో హింసకు గురైందని ప్రియాంక వ్యాఖ్యానించారు.

సదరఫ్ జాఫర్‌కు కూడా కాంగ్రెస్ టికెట్ లభించింది. సీఏఏకు వ్యతిరేకంగా జరిపిన ప్రదర్శనలకుగానూ ఆమెను అరెస్ట్ చేశారు. ఆలిండియా మహిళా కాంగ్రెస్‌కు ఆమె సమన్వయకర్త కూడా.

జూలై 28న బాధితురాలి కారు ప్రమాదానికి గురైంది

ఉన్నావ్ రేప్ కేసు: ఎప్పుడెప్పుడు ఏం జరిగింది?

4 జూన్ 2017: ఉద్యోగం విషయంలో సహాయం అడిగేందుకు ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు కలిసేందుకు వెళ్లానని, ఎమ్మెల్యే ఇంట్లోనే తనపై అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పింది.

11 జూన్ 2017: దీని తర్వాత జూన్ 11న బాధితురాలు కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

20 జూన్ 2017: ఔరయాలోని ఒక గ్రామంలో బాధితురాలి ఆచూకీ దొరికింది. మరుసటి రోజు ఆమెను ఉన్నావ్‌కు తీసుకొచ్చారు.

22 జూన్ 2017: బాధితురాలిని కోర్టులో హాజరు పరిచారు. సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. వాంగ్మూలంలో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ పేరును చెప్పనివ్వలేదని ఆమె పోలీసులపై ఆరోపణలు చేశారు.

3 జూన్ 2017: వాంగ్మూలం రికార్డు చేసిన 10 రోజుల తర్వాత పోలీసులు, బాధితురాలిని కుటుంబానికి అప్పగించారు. బాధితురాలు ఢిల్లీకి వచ్చారు. పోలీసులు తనను బెదిరించారని చెప్పారు. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌తో పాటు ఆయన సోదరుడు అతుల్ సింగ్ సెంగర్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని ఆమె యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసింది.

24 ఫిబ్రవరి 2018: సీఆర్‌పీసీ సెక్షన్ 156 (3) ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బాధితురాలి తల్లి, ఉన్నావ్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును అభ్యర్థించారు.

3 ఏప్రిల్ 2018: కుల్దీప్ సింగ్ సెంగర్ సోదరుడు అతుల్ సింగ్ సెంగర్ బాధితురాలి తండ్రిపై దాడి చేశారు.

4 ఏప్రిల్ 2018: దీని తర్వాత, ఉన్నావ్ పోలీసులు బాధితురాలి తండ్రిని 'ఆర్మ్ యాక్ట్' కేసు కింద అరెస్ట్ చేశారు.

8 ఏప్రిల్ 2018: ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు తమను వేధిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

9 ఏప్రిల్ 2018: పోలీసు కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి మరణించారు.

10 ఏప్రిల్ 2018: ఆయన శరీరంపై 14 చోట్ల గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసి మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు.

11 ఏప్రిల్ 2018: ఈ కేసును సీబీఐకి అప్పగించాలని యోగి ప్రభుత్వం ఆదేశించింది.

12 ఏప్రిల్ 2018: మైనర్‌పై అత్యాచారం కేసులో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను నిందితుడిగా చేర్చారు. కానీ ఆయనను అరెస్ట్ చేయలేదు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు, ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను అరెస్ట్ చేస్తారా? లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

13 ఏప్రిల్ 2018: విచారణ కోసం కుల్దీప్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత అరెస్ట్ చేసి, కొత్త ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది.

11 జూలై 2018: ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ పేరును చేర్చి సీబీఐ తొలి చార్జిషీట్‌ను నమోదు చేసింది.

13 జూలై 2018: ఈ వ్యవహారంపై సీబీఐ రెండో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. బాధితురాలి తండ్రి మరణం కేసులో కుల్దీప్ సింగ్, ఆయన సోదరుడు అతుల్ సెంగర్ సహా మరికొంత మంది పోలీసులను నిందితులుగా చేర్చింది. మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు.

28 జూలై 2019: తన పిన్ని, అత్త, వకీలుతో కలిసి రాయ్‌బరేలీకి వెళ్తోన్న బాధితురాలి కారును ట్రక్కు ఢీకొట్టింది. చాలా భీకరంగా జరిగిన ఈ ప్రమాదంలో బాధితురాలి అత్త, పిన్ని ఇద్దరూ మరణించారు.

బాధితురాలి భద్రత కోసం మొత్తం తొమ్మిది మంది భద్రతా సిబ్బందిని కేటాయించారు. కానీ ప్రమాదం జరిగిన రోజున ఆమెకు రక్షణగా ఒక్కరు కూడా లేరు. కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనుచరులు తమను వేధిస్తున్నారని, తమను చంపేందుకే ఈ ప్రమాదం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

16 డిసెంబర్ 2019: రేప్ కేసులో కుల్దీప్ సింగ్ సెంగర్‌ను దోషిగా నిర్దారించారు.

20 డిసెంబర్ 2019: కుల్దీప్‌కు జీవిత ఖైదు విధించారు.

4 మార్చి 2020: జ్యూడియల్ కస్టడీలో బాధితురాలి తండ్రి మరణం కేసులో కూడా కుల్దీప్‌ను దోషిగా నిర్ధారించారు.

కుల్దీప్ సింగ్ సెంగర్

కుల్దీప్ సింగ్ సెంగర్ ఎవరు?

రాజకీయ కెరీర్ ప్రారంభంలో కుల్దీప్ సింగ్ కాంగ్రెస్‌లో ఉన్నారు.

2002 ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరి, కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలిచారు. 2007 నాటికి రాజకీయాల్లో ప్రముఖుడిగా మారారు. ఆ తర్వాత ఎస్పీ పార్టీలో చేరారు.

2012లో సమాజ్‌వాద్ పార్టీ తరఫున గెలుపొందిన ఆయన, 2017లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2002 నుంచి 2017 వరకు యూపీలోని ప్రముఖ పార్టీలన్నింటి తరఫు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీఎస్పీ, ఎస్పీ పార్టీల్లో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు.

2019 డిసెంబర్‌లో ఢిల్లీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. అలాగే పార్టీ నుంచి ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Uttar Pradesh elections: Congress ticket for Asha Singh, mother of Unnao rape victim
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X