India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: యూపీ ముస్లింలపై అసదుద్దీన్ ప్రభావం లేదా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ముస్లిం ప్రజలు

అమ్రోహా జిల్లాలోని ఒక గ్రామంలో హుక్కా పీలుస్తోన్న ముస్లిం వృద్ధుడిని ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలపై మీ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా... ముందు మా ఉద్దేశం సంగతి పక్కనబెట్టి, అసలు మాకున్న అవకాశాలేంటో మీరే చెప్పండి? అంటూ ఎదురు ప్రశ్నించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లిం జనాభా 20 శాతం. వీరిలో ఎక్కువ మంది పశ్చిమ యూపీలో నివసిస్తుంటారు. పశ్చిమ యూపీలోని 20 జిల్లాల్లో నివసిస్తోన్న ముస్లిం జనాభా 25 శాతం కంటే ఎక్కువే ఉంటుంది.

తొలి దశ పోలింగ్‌లో భాగంగా ఫిబ్రవరి 10న పశ్చిమ యూపీలోని 11 జిల్లాలకు చెందిన 58 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 9 జిల్లాల్లోని 55 సీట్లకు రెండో దశలో పోలింగ్ నిర్వహిస్తారు.

నిరక్షరాస్యత, పేదరికం, నిరుద్యోగంతో పాటు సామాజిక భద్రత కూడా ఇక్కడి ప్రజలకు పెద్ద సమస్యగా ఉంది. ఎన్నికల సమయంలో వీరి సమస్యల కంటే కూడా మత గుర్తింపే ఆధిపత్యం చూపిస్తుందేమో అని ఇక్కడికి చెందిన కొంతమందితో మాట్లాడిన తర్వాత అనిపించింది.

అఖిలేశ్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్

''ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఓటర్లుగా మాకు వాటిపై స్పష్టమైన పరిష్కారం కావాలి. అందులో ఉపాధి కల్పన కూడా ఒకటి. ప్రభుత్వం మాకు రేషన్ ఇవ్వకున్నా పర్లేదు కానీ ఉపాధిని అందించాలని కోరుతున్నాం. మహిళల భద్రత లేమి ఇక్కడ ప్రధాన సమస్య. నేటికీ వరకట్నం సమస్య తీరలేదు. కానీ వీటన్నింటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు'' అని బీబీసీతో హాష్మీ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్, డాక్టర్ హుస్న్ బానో చెప్పారు.

''మనమంతా భారతీయ పౌరులం. భారతీయులుగా మనముందు ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ముస్లింల దురదృష్టమేంటంటే... ఎక్కడో ఒకచోట మతం కారణంగా వారు ఎదుర్కొంటోన్న సమస్యలు మరుగునపడిపోతున్నాయి'' అని ఆయన చెప్పుకొచ్చారు.

''సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అంటూ మాట్లాడుతున్నారు. కానీ అందరి అభివృద్ధి ఎక్కడ జరుగుతోంది? ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నవారే మరింత సంపన్నులుగా మారారు. ఈ పరిణామాన్ని అందరి అభివృద్ధి అని చెప్పలేం. అభివృద్ధి అంటే... ఉదాహరణకు కుర్చీ అవసరమున్నవారికి అది దక్కడం, ఆందోళనలో ఉన్నవారికి ఆపన్నహస్తాన్ని అందించి ఉపశమనాన్ని కలిగించడం. ఇలాంటి అభివృద్ధిలో అందరూ భాగం కావాలని మేం కోరుకుంటున్నాం'' అని ఆయన వివరించారు.

ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛను అందించామని, వారికి మేలు చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ చట్టం రాక వల్ల తమ జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదని, ఇది కేవలం రాజకీయ ఎత్తుగడగా ఇక్కడి మహిళలు భావిస్తున్నారు.

అమ్రోహాలో నివసించే ఒక ముస్లిం మహిళ దీని గురించి మాట్లాడారు. '' ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ చట్టం వల్ల మాకు జరిగిన లాభం ఏంటి? ఈ చట్టాన్ని ముస్లింలు, మహిళలు వ్యతిరేకించారు. దీన్ని తీసుకురావడం వల్ల ముస్లింల స్థితిగతుల్లో ఏమైనా మార్పులొచ్చాయా? ఉద్యోగాలు రాలేదు, ఆర్థిక లబ్ధి కలగలేదు'' అని ఆమె అన్నారు.

''ధరలకు రెక్కలొచ్చాయి. ఖర్చులు చాలా పెరిగిపోయాయి. కరెంట్ మీటర్ బిల్లు ఎక్కువ కట్టాల్సి వస్తుందనే భయంతో మా ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు వాడటం కూడా మానేశాం. ధరల పెరుగుదల చాలా పెద్ద సమస్య. కానీ ఎవ్వరూ దీని గురించి ఒక మాటైనా మాట్లాడట్లేదు.''

అసదుద్దీన్ ఒవైసీ

అసదుద్దీన్ ప్రభావం?

పెరిగిపోయిన ఖర్చుల గురించి మహిళలు ఆందోళన చెందుతుండగా... తమ గుర్తింపునకు సంబంధించి ముస్లిం యువత కొంత తర్జనభర్జన పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

రాజకీయ పార్టీలన్నీ ముస్లింలకు దూరం కావడానికి ప్రయత్నిస్తున్నాయని ఇక్కడి యువకులు కొంతమంది భావిస్తున్నారు. అందుకే తమకు నాయకత్వం వహించే వారికి ముస్లిం సమాజం అండగా నిలబడాలని అనుకుంటున్నారు.

వారంతా అసదుద్దీన్ ఓవైసీ వైపు మొగ్గుతున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అసుదుద్దీన్ మాత్రం ఈ ఎన్నికల్లో ముస్లింలను పెద్దగా ప్రభావితం చేసేలా కనిపించడం లేదు.

ముస్లిం అభ్యర్థులు

ముస్లిం అభ్యర్థులను ఎందుకు టికెట్ ఇవ్వలేదు?

తొలి దశ ఎన్నికల్లో 40 స్థానాల్లో బరిలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ 12 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించగా, 58 స్థానాల నుంచి పోటీ చేస్తోన్న బీఎస్పీ 16 మంది ముస్లిం అభ్యర్థులను పోటీలో నిలిపింది. కాంగ్రెస్ నుంచి 11 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీజేపీ మాత్రం ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టిక్కెట్ ఇవ్వలేదు.

ఈ అంశంపై అన్నింటికన్నా ఎక్కువగా ముజఫర్‌నగర్ చర్చల్లో నిలుస్తోంది. ఈ జిల్లాలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా ముస్లిం జనాభే ఉంటుంది. బుఢానా, మీరాపూర్, చరథావల్ నియోజకవర్గాల్లో ముస్లింలు అధికంగా ఉంటారు. కానీ సమాజ్‌వాదీ పార్టీ కూటమి ఈ జిల్లాకు చెందిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బరిలో నిలపలేదు.

''సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్‌లతో కూడిన కూటమి ముజఫర్‌నగర్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాల పరిధిలో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టిక్కెట్ ఇవ్వలేదు. ఈ కారణంగానే ముజఫర్‌నగర్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ముస్లిం ఓటర్లలో ఒక రకమైన అసహనం కనిపిస్తోంది. ముస్లిం సమాజం పూర్తిగా తమ వెంటే ఉందన్న భావనలో కూటమి అభ్యర్థులు కనిపిస్తున్నారు. కానీ ముజఫర్‌నగర్‌లో ఏ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా సీటు కేటాయించకపోవడం పట్ల ఓటర్లు అసంతృప్తిగా ఉన్నారు'' అని స్థానిక జర్నలిస్టు అమిత్ సైనీ వివరించారు.

''ముజఫర్‌నగర్‌లో నెలకొన్న ఈ పరిస్థితిని మాయావతి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న ఆరు అసెంబ్లీ స్థానాలకు గాను మూడింటిలో ముస్లిం అభ్యర్థులను బరిలో దింపారు. ఇదంతా చూస్తుంటే సమాజ్‌వాదీ కూటమి వ్యూహాన్ని చెడగొట్టాలని మాయావతి కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోంది.''

''ముస్లిం ఓటర్లు ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. వారు బహిరంగంగా ఏమీ మాట్లాడటం లేదు. గెలిచే అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్లు భావిస్తుంటారని మనం అనుకుంటాం. ముస్లింలందరూ తమతోనే ఉన్నారని సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్‌డీ కూటమి భావిస్తోంది. కానీ నిజానికి పరిస్థితి అలా లేదు'' అని ఆయన చెప్పుకొచ్చారు.

సహాన్‌పూర్‌లో ప్రముఖ మైనారిటీ నేత ఇమ్రాన్ మసూద్. ఆయన కాంగ్రెస్ పార్టీకి తిలోదకాలు ఇచ్చి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అయినప్పటికీ ఆయనకు సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్ దక్కలేదు. మరోవైపు ముజఫర్‌నగర్‌కు చెందిన రాణా కుటుంబీకులు కూడా ఈసారి ఎన్నికల క్షేత్రానికి దూరంగానే ఉన్నారు.

కైరానా మాజీ ఎంపీ ముజఫర్‌నర్ దిగ్గజ నేత అమీర్ ఆలమ్ ఖాన్, ఆయన కుమారుడు నవాజిశ్ ఆలమ్ కూడా ఆర్‌ఎల్‌డీ నుంచి టిక్కెట్‌ను ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది.

మీరట్‌లో యాకూబ్ ఖురేషీ, షాహిద్ అక్లాక్ లాంటి నేతలు కూడా టిక్కెట్ పొందలేకపోయారు. మరోవైపు కిఠోర్ అసెంబ్లీ స్థానం నుంచి షాహిద్ మంజూర్ బరిలో నిలిచారు.

అమ్రోహాలోని నౌగావా సాదత్ అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్‌ను ఆశించిన మాజీ మంత్రి కమల్ అక్తర్‌కు సమాజ్‌వాదీ పార్టీ మొరాదాబాద్‌లోని కాంఠ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిపింది.

మొరాదాబాద్ జిల్లాలో ఎక్కువ మంది ముస్లిం అభ్యర్థులకే పార్టీ టిక్కెట్లు లభించాయి. కుందార్కీ స్థానంలో ఎమ్మెల్యే హాజీ రిజ్వాన్‌కు కేటాయించాల్సిన టిక్కెట్‌ను సంభాల్ ఎంపీ డాక్టర్ షఫీకుర్ రహమాన్ బర్క్ మనవడు జియావుర్ రహమాన్‌కు అప్పగించింది. దీంతో హాజీ రిజ్వాన్, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ తరఫు నుంచి బరిలో దిగుతున్నారు.

సంభాల్ ఎంపీ డాక్టర్ షఫీకుర్ రహమాన్ బర్క్ మనవడు జియావుర్ రహమాన్‌

పశ్చిమ యూపీలోని ముస్లింలు అయోమయంలో పడ్డారా?

పశ్చిమ యూపీలో మేం మాట్లాడిన చాలామంది ముస్లిం ఓటర్లు... సమాజ్‌వాదీ పార్టీ నేతల పట్ల ఆగ్రహంతో ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఆ పార్టీ వైపే మొగ్గు చూపారు.

ముస్లిం ఓటర్లు అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

''అభద్రతా భావం, వివక్ష కారణంగా పశ్చిమ యూపీలోని ముస్లిం ఓటర్లు ఈసారి అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయినప్పటికీ వారేం చేయలేదు. ఎప్పటిలాగే ఒక పార్టీకి అధికారం ఇవ్వడం, మరో పార్టీని ఓడించడం మినహా మరే ఇతర రాజకీయ వ్యూహం వారి దగ్గర లేదు. అయితే కొంతమంది ముస్లిం ఓటర్లు మాత్రం తమ మతానికి ప్రాతినిధ్యం వహించే నాయకుడికి అనుకూలంగా నిలబడాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు'' అని సీనియర్ జర్నలిస్ట్ ఒబైదుర్ రహమాన్ అన్నారు.

తాజా ఎన్నికల వాతావరణంలో ముస్లింల సమస్యలు వెనుకబడిపోయాయని రహమాన్ అభిప్రాయపడ్డారు. ''మతపరమైన పోటీ కారణంగా విద్య, వైద్యం, ఉద్యోగాలు, శాంతి భద్రతలు వంటి అంశాల్లో ముస్లింలు ఎదుర్కొంటోన్న సమస్యలు వెనుకబడిపోయాయి. వీటిని పరిష్కరించే బదులుగా, ఓట్లను రాబట్టుకునేందుకు కులమతాలకు అనుకూలంగా మాటల గారడీ చేస్తూ రాజకీయ నేతలంతా బిజీగా ఉన్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

ముస్లిం ఓటర్లు

మతతత్వ ప్రాదిపదికన ఎలాగైన ఓట్లు పొందాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నట్లు స్థానిక రాజకీయాలపై మంచి పట్టున్న సీనియర్ జర్నలిస్టు ముస్తకీమ్ అభిప్రాయపడ్డారు. అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మతానికి సంబంధించిన విషయాలు, మతతత్వ భాష మాట్లాడటం ద్వారా ఓటర్లను ఆకర్షించవచ్చని నేతలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మురాదాబాద్‌కు చెందిన అత్యధిక స్థానాల్లో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు సమాజ్‌వాదీ పార్టీ కూటమి సహా ఇతర పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేశాయి.

ఇతర వెనుకబడిన వర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. కానీ ముస్లిం ఓటర్లు మాత్రం ఏ ఒక్క పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు... ఒక అభ్యర్థి వైపు ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపించడం లేదు.

ముస్లిం ఓటర్లు

బరిలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటిలో సమాజ్‌వాదీ పార్టీ కూటమి వైపే ముస్లిం ఓటర్లు మొగ్గు చూపుతారని రాజకీయ విశ్లేషకులు, స్థానిక ఓటర్లు భావిస్తున్నారు.

అయితే అఖిలేశ్ యాదవ్ మాత్రం ముస్లింలకు కాస్త దూరం పాటిస్తున్నారు. '' ముస్లింలకు చేరువ కావాలని అఖిలేశ్ యాదవ్ అనుకోవడం లేదు. అలా చేస్తే మిగతా అంశాలపై ప్రభావం ఉంటుందని ఆయన భావిస్తున్నారు'' అని సీనియర్ జర్నలిస్ట్ రామ్‌దత్తా త్రిపాఠి అన్నారు.

''ముస్లింలకు 18 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అఖిలేశ్ గతంలో హామీ ఇచ్చారు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పాఠశాలలు, కాలేజీల్లో ఉర్దూ టీచర్ల ఖాళీలు భర్తీ చేయకుండా అలాగే ఉన్నాయి. ముస్లింల పట్ల అఖిలేశ్ చెప్పేవాటికి, చేసేవాటికి చాలా తేడా ఉంది. అందుకే విద్యాధికులైన ముస్లింలు అఖిలేశ్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ముస్లింలకు తాము తప్ప మరో దారి లేదని అఖిలేశ్ అనుకుంటున్నారు'' అని ముస్తకీమ్ పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ముస్లిం ఓటర్లు బీజేపీకి ఓటు వేస్తారా? ఈ ప్రశ్నకు కూడా ముస్తకీమ్ బదులిచ్చారు. ''ముస్లిం ఓటర్లు బీజేపీకి ఓటు వేయరనేది స్పష్టం. ముస్లింల పట్ల బీజేపీ ఉదారంగా వ్యవహరించకపోవడమే ఇందుకు కారణం. ముస్లింల పట్ల బీజేపీ ఉపయోగించిన పరుష పదజాలం కూడా వారిని పార్టీకి దూరం చేసింది. బీజేపీ ఇలా ప్రవర్తించకపోయుంటే పెద్ద సంఖ్యలో ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేసేవాళ్లు. ప్రభుత్వ పథకాల్లో ముస్లింల పట్ల వివక్ష చూపకపోయినప్పటికీ... వారితో గబీజేపీ కఠినంగా వ్యవహరిస్తుందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే ముస్లింలలో ఆగ్రహానికి కారణమైంది'' అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Uttar Pradesh elections: Is Asaduddin's influence there on muslim voters or not
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X