ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో ముస్లింలు ఏమంటున్నారు?

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై భారీ ఎత్తున ఊహాగానాలు, అంచనాలు కొనసాగుతున్నాయి.
గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉత్తర్‌ప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. అందుకే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు సవాల్‌గా మారాయి.
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విపక్షాలు చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళల స్థితిగతులు, దళితులపై హింస, శాంతిభద్రతలు తదితర అంశాలను లేవనెత్తుతున్నాయి.
వీటన్నింటి నడుమ అక్కడ మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల పరిస్థితి గురించి కూడా చర్చ జరుగుతోంది.
ఎన్నికల సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాయి.
రాష్ట్రంలో నివసిస్తున్న ముస్లింల జనాభా పెరుగుదలపై కూడా ప్రధానమైన చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ముందు నుంచీ అది చర్చనీయాంశంగా ఉంది.
లఖ్‌నవూ, హర్దోయ్, ఆజంగఢ్, షామిలీ, ముజఫర్‌నగర్, మేరఠ్, బిజ్నోర్ తదితర ప్రాంతాలను సందర్శించినప్పుడు రాష్ట్ర జనాభాలో 20 శాతంగా ఉన్న సమాజం ఏ స్థితిలో ఉందన్న ప్రశ్న తలెత్తింది.
వారు ఇంకా పేదరికంలోనే ఉన్నారా, వారి స్థితిగతుల్లో మార్పు వచ్చిందా? తన పాలనతో బీజేపీ ప్రభుత్వం రాజకీయ, సామాజిక, ఆర్ధిక శక్తిని సాధించిందా, లేక మరింత దిగజారిందా?
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆరోపించాయి.
క్షేత్ర స్థాయిలో వీటిలో వాస్తవాలు ఏంటో తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధులు ప్రయత్నం చేశారు.
- ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్... ఆమె స్పందన ఏంటి?
- ఎన్నికలకు ముందు యూపీలో బీజేపీని వీడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కారణమేంటి?
ముస్లింలు ఏమనుకుంటున్నారు?
తనకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమాత్రం నమ్మకం లేదని బిజ్నోర్‌లోని నహ్తౌర్ పట్టణవాసి మహ్మద్ షోయబ్ అన్నారు.
గత సంవత్సరం సీఏఏ, ఎన్నార్సీ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో, షోయబ్ తనను తాను రెండవ తరగతి పౌరుడిగా భావించేవారు. తర్వాత ఆ భావన మరింత బలపడింది.
నెలలు గడిచిపోయాయి. కోర్టులపై విశ్వాసం ఉన్నప్పటికీ, న్యాయం కోసం ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
2019 డిసెంబర్ 20న, షోయబ్ సోదరుడు మహ్మద్ సులేమాన్‌ను మసీదు నుంచి బయటకు వస్తుండగా పోలీసులు పట్టుకుని కాల్చిచంపారు. మసీదుకు వంద మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగిందని షోయబ్ ఆరోపించారు.
ముస్లిం అయినందుకు తమను టార్గెట్ చేశారని షోయబ్ ఆరోపించగా, పోలీసులు దీనిని ఖండించారు.
సీఏఏ, ఎన్నార్సీ నిరసనలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదికలో సల్మాన్ మరణం గురించి పోలీసులు వివరించారు.
మొదట ఆందోళనకారుల గుంపు నుంచే బుల్లెట్ వచ్చిందని, ఆ తర్వాత తాము రక్షణ కోసం కాల్పులు జరిపామని, అందులో సల్మాన్ మరణించారని పోలీసులు పేర్కొన్నారు.
తన ఇంట్లో నిస్సహాయ స్థితిలో కూర్చుని, కేసుకు సంబంధించిన కాగితాలను చేతిలో పెట్టుకుని షోయబ్ ఇలా అన్నారు:

'ముస్లింలకు అసలు గుర్తింపు లేదు. వాళ్లను టార్గెట్ చేశారు’
2019 డిసెంబర్ 20న పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా అనేక నగరాల్లో అల్లర్లు జరిగాయి.
గత ఆరు నెలల కాలంలో జరిగిన అల్లర్లలో 21 మంది మరణించారని ఫిబ్రవరి 20, 2020న విధాన సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
అయితే, ఈ నిరసనలు సీఏఏకు వ్యతిరేకంగా జరిగినవా కాదా అన్న విషయం ఆయన స్పష్టంగా చెప్పలేదు.
పోలీసుల కాల్పుల్లో ఎవరూ చనిపోలేదని ముఖ్యమంత్రి అసెంబ్లీలో పేర్కొన్నారు.
సీఏఏ, ఎన్నార్సీ ఆందోళనలను అణచి వేసే విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యహరించారని, ప్రజలు చాలా భయపడ్డారని, తమ మీద కేసులు పెడతారని ఆందోళన చెందారని పలువురు ముస్లింలు బీబీసీతో అన్నారు.
ఈ నిరసనలకు సంబంధించి 15-20 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ఇందులో 15,000-20,000 మంది పేర్లున్నాయని ఈ కేసులను వాదిస్తున్న న్యాయవాది మహ్మద్ తన్వీర్ అన్నారు.
వీరిలో దాదాపు 95 శాతం మంది ముస్లింలేనని ఆయన పేర్కొన్నారు.
ఒకటికంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లలో పేర్లు ఉన్నవారు చాలామంది ఉన్నారని, కొందరిని నగరం నుంచి బయటకు పంపేశారని తన్వీర్ ఆరోపించారు.
''ముస్లిం ప్రజలు హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ, వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అన్నారు తన్వీర్.
కేసులు ఉపసంహరించుకోవాలని తన కుటుంబంపై ఒత్తిడి చేస్తున్నారని, అందుకే తామంతా భయపడుతున్నామని షోయబ్ అన్నారు.
- ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన యూపీ డిప్యూటీ సీఎం, ఏ ప్రశ్న అడిగితే ఆయనకు కోపం వచ్చిందంటే..
- ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన యతి నరసింహానందను ఇంకా జైల్లో ఎందుకు పెట్టలేదు?

ఏ నేరానికి ఈ శిక్ష?
2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాదాపు 20 కోట్లమంది జనాభాలో దాదాపు 20 శాతం, అంటే దాదాపు 4 కోట్లమంది ముస్లింలు ఉన్నారు.
ముస్లింలను ఒక వైరస్‌తో పోల్చారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఆయన అనేకసార్లు ముస్లింలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. కానీ, తాను ముస్లిం వ్యతిరేకిని కానని, దేశ వ్యతిరేకులకు వ్యతిరేకినని యోగి అంటారు.
గత కొన్ని నెలలుగా వస్తున్న వార్తా కథనాలలో ముస్లింలకు వ్యతిరేకంగా, వారిని టార్గెట్ చేసుకున్నట్లున్న ప్రకటనలు అనేకం కనిపిస్తాయి. ముఖ్యంగా వారి జీవనోపాధి మార్గాలను లక్ష్యంగా చేసుకున్న సందర్భాలున్నాయి.
ఆగస్టులో, హిందూ మత సంస్థ క్రాంతి సేన ముజఫర్‌నగర్‌లోని హిందూ మహిళలను ముస్లింల దగ్గర మెహందీ పెట్టించుకోవద్దని కోరినట్లు వార్తలు వచ్చాయి.
కాన్పూర్‌లో ఓ ముస్లిం యువకుడిని జై శ్రీరామ్ నినాదాలు చేయనందుకు కొట్టారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆ సమయంలో అతని ఏడెళ్ల కుమార్తె కూడా ఆయనతోపాటే ఉంది.
మథురలో ఓ ముస్లిం వ్యక్తి శ్రీనాథ్ అనే పేరుతో దోశ స్టాండ్ నడుపుతున్నాడు. హిందువుల పేరుతో దుకాణం ఎలా నడుపుతారని స్థానికులు ఆ వ్యక్తిని కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
'ఎకనామిక్ జిహాద్', 'లవ్ జిహాద్' వంటి పదాలు ఇప్పుడు అక్కడ వాడుక మాటలుగా మారాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లింల స్థితిగతులను వివరించే ఘటనలివి.
''గత ఏడెనెమిదేళ్లు ముస్లింలకు బ్యాడ్ టైమ్. మిగిలిన ప్రజలకు మేం దూరమవుతున్నాం. ప్రజల మనసులో విద్వేషాలు నాటుతున్నారు’’ అని ఆజంగఢ్‌కు చెందిన 25 ఏళ్ల అహ్మద్ వకార్ అన్నారు.
యూపీలో ముస్లింలు చాలా చిన్న చిన్న విషయాలకు కూడా టార్గెట్ అవుతున్నారని ఆజంగఢ్‌లోని ప్రసిద్ధ షిబ్లీ అకాడమీలో సీనియర్ ఫెలో ప్రొఫెసర్ ఉమైర్ సిద్ధిఖీ అన్నారు.
ముస్లింలు ఈ అవమానాలన్నింటినీ గ్రహిస్తున్నారని ఆయన అన్నారు. '' ఒక మతానికి చెందిన ప్రవక్త లేదా అతని తత్వంపై దురుద్దేశపూరితంగా మాట్లాడటం బాధాకరం’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
“యూపీ ముస్లింకి ఏ నేరానికి శిక్ష పడుతుందో అర్థం కావడం లేదు. మమ్మల్ని ఉగ్రవాదులు అంటున్నారు. మేం పెట్టిన కేసులు కూడా తీసుకోవడం లేదు. ఇక్కడ చాలామంది అభద్రతా భావంతో ఉన్నారు’’ అని సిద్ధిఖీ వ్యాఖ్యానించారు.
- యూపీ: 'రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్
- ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: గెలుపోటములను ప్రభావితం చేసే ప్రధాన అంశాలేంటి?

గణాంకాలు ఏం చెబుతున్నాయి?
2019 సంవత్సరంలో FactCheck కు చెందిన వెబ్సైట్ Factchecker ప్రకారం, గత 10 సంవత్సరాలలో, భారతదేశం అంతటా నమోదైన ద్వేషపూరిత నేరాల బాధితుల్లో 59 శాతం మంది ముస్లింలు.
2019 సంవత్సరంలో, ద్వేషపూరిత నేరాలపై ఆమ్నెస్టీ నివేదికలో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
భారతదేశంలో ముస్లింల సంఖ్య దాదాపు 14 శాతం. ఇది దేశంలోనే అతి పెద్ద మైనారిటీ వర్గం. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం అపారమైనది. కానీ, ఈ సమాజం అభివృద్ధి పథంలో మాత్రం వెనకబడి ఉంది.
2005లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
జస్టిస్ సచార్ నేతృత్వంలో ఏర్పాటైన 'సచార్ కమిటీ' నివేదిక 2006లో వెలువడింది. ప్రతి రంగంలో ముస్లింల దుస్థితిని ఈ నివేదిక బైటపెట్టింది.
గత సంవత్సరం విడుదల చేసిన ఒక నివేదికలో ముస్లింలు అనేక కీలక రంగాలలో గతంలో కంటే చాలా వెనుకబడి ఉన్నారని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) పేర్కొంది.
అయితే, తమ ప్రభుత్వ హయాంలో ఉత్తర్‌ప్రదేశ్ ముస్లింల పరిస్థితి మెరుగుపడిందని అధికార బీజేపీ చెబుతోంది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లు వారిని ఓట్ల కోసమే ఉపయోగించుకున్నాయని బీజేపీ ఆరోపించింది.
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) 2004-05 సంవత్సరానికి సంబంధించిన డేటా ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న ప్రజలలో అత్యధికులు అగ్రవర్ణ హిందువులు (72.6%) కాగా, ఓబీసీ హిందువులు (70.43%) ఉన్నారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో షెడ్యూల్డ్ కులాల (49.91%) వాటా ముస్లింల కంటే ఎక్కువగా ఉంది. చాలా మంది ముస్లింలు వ్యవసాయేతర పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 2011-12లో ఈ సంఖ్య మరింత పెరిగింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 20శాతం మంది ముస్లింలు కూలి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారి సామాజిక-ఆర్థిక స్థితి కాలక్రమేణా మరింత దిగజారిందని సూచిస్తుంది.
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
- 'మాది పేద పార్టీ.. మాకు పెట్టుబడిదారులు, ధనవంతుల అండ లేదు'

మినీ పాకిస్తాన్
మేరఠ్‌లోని ముస్లింలు అత్యధికంగా నివసించే మాచెరన్ లో ప్రజలు దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
చాలామంది స్థానికులు తాము ప్రధాన స్రవంతికి దూరమయ్యామని భావిస్తున్నారు. పేదవారు, పైగా ముస్లింలు కావడంతో తమను ఎవరూ పట్టించుకోరని వారు అంటున్నారు.
తాము నివసించే ఈ ప్రాంతాన్ని 'మినీ పాకిస్తాన్’ గా అభివర్ణిస్తారని ఈ ప్రాంతంలో నివసించే ఆసిఫ్ నయీమ్ అన్నారు. తమ సెటిల్‌మెంట్‌లోకి టాక్సీ డ్రైవర్లు లేదా ఫుడ్ డెలివరీ బాయ్‌లు కూడా రారని ఆయన చెప్పారు.
''అధికారులు మాపై వివక్ష చూపిస్తారు. ప్రైవేట్ వ్యాపారులు కూడా మమ్మల్ని విస్మరిస్తారు. మాకు మాల్స్ లేవు, సినిమా హాళ్లు లేవు, ఏటీఎంలు లేవు. స్కూళ్లు, హాస్పిటళ్లు, మెక్‌డోనాల్డ్, బికనేర్వాలా లాంటివి ఏవీ లేవు’’ అన్నారాయన.
కౌన్సిలర్లుగానీ, ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తమను పట్టించుకోవడం లేదని నయీమ్ చెబుతున్నారు.
ఈ ప్రాంతంలోని పబ్లిక్ టాయిలెట్లు చాలా అపరిశుభ్రంగా ఉంటాయని, ఎన్ని ఫిర్యాదులు చేసినా శుభ్రం చేసే వారు లేరని ఆయన చెప్పారు.
ఒక మేరఠ్ నగరంలోని మాచెరన్ ఒక్కటే పేద ముస్లిం ప్రాంతం కాదు. యూపీలోని దాదాపు ప్రతి ప్రధాన నగరంలో ఇటువంటి స్థావరాలు ఉన్నాయి.
పాత మేరఠ్‌లోని సోహ్రాబ్ గేట్ కూడా ఒక ముస్లిం ప్రాంతం. కొంచెం మెరుగైన స్థితిలో, దుకాణాలతో సందడిగా ఉండే మార్కెట్.
బ్రిటిష్ కాలంనాటి కట్టడాలతో దీని గతం ఎంతో ఘనం అనిపిస్తుంది. కానీ, ఇప్పుడేవీ లేవు. అభివృద్ధి, మార్పు చాలా అవసరం.
పాలకులు ఏళ్ల తరబడి తమను విస్మరిస్తున్నారని ఇక్కడి ముస్లింలు నమ్ముతున్నారు.
''మాలో 90 నుంచి 95 శాతానికి పైగా ఇక్కడ మీకు కనిపిస్తున్న తరహా జీవితాన్ని గడుపుతున్నారని నేను చెప్పగలను’’ అన్నారు ఆసిఫ్ నయీమ్.
- ఉత్తర్‌ప్రదేశ్: ఇక్కడ అనాథ పశువులు కూడా ఓట్లు రాలుస్తాయా?
- కరెన్సీ నోట్ల గుట్టలు దాచిన కాన్పూర్ వ్యాపారి పీయూష్ జైన్ అరెస్ట్

అధికార పార్టీ బీజేపీ ఏం చెబుతోంది?
ఈ వెనుకబాటుతనంపై బీజేపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ మాట్లాడారు.
ఉత్తర్‌ప్రదేశ్ వెనుకబడి ఉంటే దానికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని, 50 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఓట్ల కోసమే ముస్లింలను ఉపయోగించుకున్నారని ఆయన విమర్శించారు.
సమాజ్‌వాదీ పార్టీ గురించి కూడా ముస్లింల ఓట్లను మాత్రమే కోరుకుంటుందని, వారి అభివృద్ధిని కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ముస్లింలు సురక్షితంగా, సంతోషంగా ఉన్నారని చెప్పారు.
''ఈ ఏడేళ్లలో (ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి) 5.5 కోట్ల మంది ముస్లిం పిల్లలకు స్టైఫండ్లు ఇచ్చారు. వీటిలో ముస్లిం బాలికలకు మూడు కోట్ల స్కాలర్షిప్లు అందించారు. గత 70 ఏళ్లలో ఐదు కోట్ల మంది పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వలేదు’’ అని కున్వర్ బాసిత్ అలీ అన్నారు.
''ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద మైనారిటీలకు 37 శాతం దక్కింది. ముద్రా రుణంలో 39% వాటా మైనారిటీ సొసైటీదే. ఉజ్వల్ పథకంలో 38% వాటా ముస్లిం మహిళలదే. ఇది కాకుండా, మా ప్రభుత్వం ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ సమస్య లేకుండా చేసింది’’ అని అలీ చెప్పుకొచ్చు.
- బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన
- లఖీంపుర్ ఖేరీ హింసపై సిట్ రిపోర్ట్: రైతులను తొక్కించేందుకు పక్కా ప్రణాళికతో కుట్ర, కేంద్ర మంత్రి కొడుకుపై హత్య కేసు

విద్య, ఉద్యోగాలలో యూపీ ముస్లింల వెనకబాటు
యూపీలో ముస్లింలు విద్యా రంగంలో అట్టడుగున ఉన్నారని, వారి పరిస్థితి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకన్నా అధ్వాన్నంగా ఉందని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ రిపోర్ట్ చెబుతోంది.
ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ ప్రకారం 2004-05లో ముస్లిం ఓబీసీలలో నిరక్షరాస్యత అత్యధికంగా 61.12% ఉంది.
2011-12 సంవత్సరంలో, ఈ రేటు 10శాతం తగ్గి 50.87%కి పడిపోయింది, అయితే షెడ్యూల్డ్ కులాలు, తెగలతో పోలిస్తే ఈ రేటు ఇంకా ఎక్కువగానే ఉంది.
2011-12లో అగ్రవర్ణ హిందువులలో నిరక్షరాస్యత రేటు అత్యల్పంగా 21.25%గా ఉంది. అగ్రవర్ణ ముస్లింలు, హిందూ ఓబీసీలకు కూడా ఇదే వర్తిస్తుంది. 2004-05 నుండి 2011-12 వరకు షెడ్యూల్డ్ తెగలలో నిరక్షరాస్యత ఎక్కువగా తగ్గింది.
''ఈ వెనుకబాటుకు ముస్లింల విద్యపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవడం, వారి కోసం పాఠశాలలు నిర్మించకపోవడమే కారణం’’ అని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఎన్ఎస్ఓ డేటాను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలలో ముస్లింల భాగస్వామ్యం కూడా తక్కువగా ఉంది. పాఠశాలల నుండి డ్రాప్ అవుట్ రేటు ఎక్కువగా ఉంది.
ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే ప్రకారం, గత మూడేళ్లలో ఉన్నత విద్యలో ముస్లింల భాగస్వామ్యం పెరిగింది. అయితే గత ఐదేళ్లలో పెరుగుదల రేటు చాలా నెమ్మదిగా ఉంది.
మరోవైపు, 2014-15 సంవత్సరంలో, ముస్లింలు పాఠశాల నుండి మానేయడం లేదా ఏదైనా కారణం వల్ల పాఠశాల చదువు కొనసాగించలేక పోవడం అనేది 20.83శాతానికి పెరిగింది.
2019-20 సంవత్సరానికి గాను ఉన్నత విద్యపై నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం ఉన్నత విద్యలో ముస్లింల భాగస్వామ్యం 5.5 శాతం మాత్రమే.
కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ 2018 నివేదిక ప్రకారం, డిసెంబర్ 2017 వరకు సేకరించిన డేటా ప్రకారం మొత్తం పోలీసు సిబ్బందిలో కేవలం రెండు శాతం మాత్రమే ముస్లింలు ఉన్నారని తేలింది.
''ముస్లింలు పోటీ పరీక్షలలో ఎంపిక కాకపోవడానికి కారణం మతం ఆధారంగా ఎంపిక చేయకపోవడమే’’ అని ఉర్దూ వారపత్రిక జదీద్ మర్కజ్‌కు చెందిన హిసామ్ సిద్ధిఖీ అన్నారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు.
''ప్రభుత్వ ఉద్యోగాలు తమ కోసం కాదని ప్రజలు భావిస్తున్నారు. అందుకే చాలామంది మధ్యప్రాచ్యానికి తరలివెళ్లారు’’ అని ఆజంగఢ్‌లోని జామియా మిలియా ఇస్లామియా నుండి ఎలక్ట్రానిక్స్‌లో మాస్టర్స్ చేసిన అహ్మద్ వకార్ అన్నారు.
సౌకర్యాలు లేకపోవడం, పేదరికంలాంటివి ఆజంగఢ్‌లో ముస్లిం విద్యార్ధులు చదువుపై ఆసక్తి చూపకపోవడానికి కారణమని కొందరు విద్యార్ధులు అభిప్రాయపడ్డారు.

అయితే, కొందరు యువకులు ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్ష చూపుతున్నారని ఆరోపించగా, మరికొందరు ఆ ఆరోపణలను ఖండించారు.
ఎన్కౌంటర్లో ఇద్దరు యువకులు మరణించిన బాట్లాహౌస్ ప్రాంతం ఆజంగఢ్లోనిదే. వకార్ ఆ ప్రాంతానికి చెందిన వారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపణలు రాగా, కోర్టు దానిని తోసిపుచ్చింది.
ఈ సంఘటన తర్వాత ఈ ప్రాంతపు ముస్లిం విద్యార్ధులకు రూమ్‌లు అద్దెకు కూడా ఇవ్వడం లేదని వకార్ గుర్తు చేసుకున్నారు. ముస్లింల ఆర్థిక దుస్థితి వారి విద్య, డ్రాపౌట్ రేటును ప్రభావితం చేసింది.
సామాన్య ముస్లింలకు విద్యా వనరుల అందుబాటు అంతంత మాత్రమేనన్నది నిజం. అయితే మరోవైపు ముస్లిం సమాజం తమ పిల్లలను ఆధునిక విద్యను పట్టించుకోకుండా మదర్సాలకు పంపించి చదివించే ప్రయత్నం చేసింది.
అక్కడ విద్యా ప్రమాణాలు సరిగా ఉండవన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడ చదువుతున్న పిల్లలు ఇస్లాం గురించి చదువుకుంటారు, వారు ఈ పోటీ ప్రపంచంలో వెనకబడి ఉంటారు.
మదర్సాలు పిల్లలను తీవ్రవాదులుగా మారుస్తున్నాయన్న ఆరోపణలు కూడా వినిపించాయి.
ఇటీవల, యూపీ మంత్రి రఘురాజ్ సింగ్ మదర్సాలను ఉగ్రవాదుల స్వర్గధామంగా అభివర్ణించారు.
అయితే, ఇటీవలి కాలంలో ఆధునికీకరణ కోసం అనేక చర్యలు తీసుకున్నామని, మదర్సాలో చదువుతున్న పిల్లలు ఎంతో ఎదుగుతున్నారని మదర్సా యాజమాన్యాలు వాదిస్తున్నాయి.
ఆజంగఢ్‌లోని ఓ మదర్సాను నిర్వహిస్తున్న సాదీ, మదర్సాలపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు.
మదర్సా విద్య ప్రాథమిక లక్ష్యం ప్రజలను మతపరమైన పుస్తకాలు, సాహిత్యం పట్ల ఆకర్షితులను చేయడమేనని, కేవలం నాలుగు నుండి ఆరు శాతం మంది ముస్లిం పిల్లలు మాత్రమే మదర్సాలలో చదువుతున్నారని చెప్పారు.
ఒక అంచనా ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లో 16,000 కంటే ఎక్కువ మదర్సాలు ఉన్నాయి.
ఇటీవలి సంవత్సరాలలో ముస్లింలకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతోందని హిసామ్ సిద్ధిఖీ అన్నారు.
“మా గ్రామం లఖ్‌నవూ నుంచి 15 కి.మీ దూరంలోని మహబూబాబాద్ రోడ్డులో ఉంది. ఈ రోడ్డులోని చాలా గ్రామాలు ముస్లింలకు చెందినవి. ఉదయం స్కూలు బస్సులు వచ్చినప్పుడు అందులో వెళ్లే వారిలో చాలామంది ముస్లిం బాలికలు ఉంటారు. వారంతా లఖ్‌నవూ వెళ్లి చదువుకుంటున్నారు’’ అని సిద్ధిఖీ అన్నారు.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ ముస్లింలలో చదువుకోవాలన్న ధోరణి పెరిగిందని ఆయన అన్నారు. ''విద్యే సర్వస్వం. మెజారిటీవాదాన్ని విద్య ద్వారా మాత్రమే ఎదుర్కోవచ్చు’’ అని సిద్ధిఖీ వ్యాఖ్యానించారు.
- ప్రధాని మోదీ ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రత్యేకతలేంటి
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా

ముస్లింలకు రాజకీయ అవకాశాలు
మతపరంగా మెజారిటీ వాదం కనిపించే యూపీ రాజకీయాలలో ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది.
గత ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 24మంది ముస్లిం అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. 1991లో 23 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత ఇదే అత్యల్ప సంఖ్య.
అంతకు ముందు 2012 ఎన్నికల్లో 403 అసెంబ్లీ సీట్లలో 69 మంది ముస్లిం అభ్యర్థులు అసెంబ్లీకి రావడం ఇప్పటి వరకు రికార్డు.
ఆ ఎన్నికల్లో 17.1 శాతం ముస్లిం అభ్యర్థులు విజయం సాధించగా, 2017లో అది 5.9 శాతానికి తగ్గింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 310 సీట్లు వచ్చినా ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. అన్ని పార్టీలకు చెందిన ముస్లిం అభ్యర్దులలో 86% మంది బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.
దిల్లీ నుంచి దేశాన్ని ఏలాలంటే ఉత్తర్‌ప్రదేశ్ కీలకం. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది.
ఈ రెండు ఎన్నికల్లోనూ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బీజేపీ నిలబెట్టలేదు. దీంతో బీజేపీకి ముస్లిం ఓట్లు అవసరం లేదని తేల్చేశారు.
పంచాయతీ నుంచి విధానసభ, పార్లమెంటు వరకు ముస్లిం ప్రాతినిధ్యం తగ్గింది. ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు వెనుకాడుతున్నాయి. ఇది తమ గెలుపు అవకాశాలను తగ్గిస్తుందన్న అభిప్రాయం ఉంది.
సమాజ్‌వాదీ పార్టీ ముస్లిం ఓట్లపై ఆశలు పెట్టుకుంది. అయితే, ముస్లిం ప్రజాప్రతినిధులను గుర్తించేందుకు ఆ పార్టీ ప్రత్యేకంగా ఏమీ చేయలేదని కొందరు ముస్లింలు ఆరోపించారు.
అయితే, 2017 ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో ముస్లిం అభ్యర్థులను బీఎస్పీ నిలబెట్టింది. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ నిలిచింది.
బీఎస్పీ నిలబెట్టిన ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 14 శాతం నుంచి 31.25 శాతానికి పెరగగా, 2007 నుంచి 2017 మధ్య ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది.
2017లో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేల్లో మూడింట ఒక వంతుమంది ముస్లింలు.
2002- 2017 మధ్య స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య తగ్గగా, ముస్లిం స్వతంత్ర అభ్యర్ధుల సంఖ్య 8 నుంచి 10 శాతానికి పెరిగింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో, ఏ స్వతంత్ర ముస్లిం అభ్యర్థి కూడా గెలవలేదు.
ముస్లిం పార్టీల విషయానికొస్తే, 2012లో పీస్ పార్టీ నాలుగు సీట్లు గెలుచుకుంది. అంతకు ముందు 1996, 2002 సంవత్సరాల్లో రాష్ట్రీయ డెమోక్రటిక్ పార్టీ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేందుకు ప్రయత్నించింది. కానీ దానికి సీట్లు రాలేదు. ఈ పార్టీని అర్షద్ ఖాన్ 1995లో ప్రారంభించారు.
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లమీన్ (ఏఐఎంఐఎం) 2017లో యూపీలో అడుగుపెట్టింది. ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన 38 స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
ఈసారి 100 స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది.
ఏఐఎంఐఎం రాజకీయాల గురించి కొందరు ఎంపిక చేసిన ముస్లింలతో మాట్లాడినప్పుడు ఈ పార్టీ కారణంగా రాష్ట్రంలో ఓట్ల పోలరైజేషన్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
- వసీం రిజ్వీ ఇప్పుడు జితేంద్ర త్యాగి అయ్యారు.. ఇస్లాం విడిచిపెట్టి హిందువుగా మారారు
- ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు మహారాష్ట్రలో మతపరమైన ఉద్రిక్తతలకు సంబంధం ఏంటి?

ఈ సారి ముస్లింలకు బీజేపీ టిక్కెట్లు ఇస్తుందా?
''మా పార్టీ కుల, మత ప్రాతిపదికన టిక్కెట్లు ఇవ్వదు. జిల్లాల నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగానే కేటాయిస్తాం. సమర్ధులైన వారికే టిక్కెట్లు దక్కుతాయి’’ అని కున్వర్ బాసిత్ అలీ అన్నారు.
ఈసారి ఎన్నికల పోరులో కొంతమంది ముస్లిం అభ్యర్థులను పార్టీ నిలబెడుతుందని బాసిత్ అలీ భావిస్తున్నారు.
''ఉత్తర్‌ప్రదేశ్‌లోని మా పార్టీలో చాలామంది ముస్లిం ప్రముఖులు ఉన్నారు. ఈసారి 10-12 మంది ముస్లింలకు టిక్కెట్లు లభిస్తాయని అనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ అదే ప్రాతిపదికన గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తారు. కుల ప్రాతిపదికన కాదు’’ అన్నారాయన.
కున్వర్ బాసిత్ అలీ ప్రకారం, 44,000 మంది ముస్లిం కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు తన పార్టీలో మండలాలు, జిల్లాల్లో పని చేస్తున్నారు. ''బూత్ స్థాయికి వెళితే ఈ సంఖ్య లక్షలకు చేరుకుంటుంది. వారంతా కృషి చేస్తే అఖిలేశ్, ప్రియంక ఇలా ఎవరైనా ఓడిపోతారు’’ అన్నారు.
ముస్లింల వెనుకబాటుకు సుదీర్ఘ చరిత్ర ఉందనడంలో సందేహం లేదు.
''ముస్లింలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అట్టడుగున ఉంచే పని 30 సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది. తాము చేయాల్సిందల్లా బీజేపీని ఓడించడమేనని వారికి చెబుతున్నారు’’ అని లఖ్‌నవూ కు చెందిన రాజకీయ విశ్లేషకుడు వీరేంద్రనాథ్ భట్ అన్నారు.
- వారణాసి: మోక్షానికే కాదు, శాకాహార భోజన ప్రియులకు కూడా స్వర్గధామంగా మారిన ప్రాచీన నగరం
- ఉత్తర్ ప్రదేశ్: మూక దాడులు, హత్యలపై విచారణల్లో న్యాయం జరుగుతోందా? బాధితులు ఏమంటున్నారు?
'ముస్లిం రహిత' గ్రామం
మంచి భవిష్యత్తు కోసం ఆశిస్తూ భారంగా కాలం వెళ్లదీస్తున్నారు కొందరు ముస్లింలు.
2013లో ముజఫర్‌నగర్ మత అల్లర్లలో తన గ్రామం లిసాద్ నుండి ప్రాణాలను కాపాడుకుని పారిపోయిన అబ్దుల్ బాసిత్ నేటికీ తన పాత ఇంటికి తిరిగి రాలేకపోయారు.
ఈ అల్లర్లలో సుమారు 50 మంది మరణించారు. నేటికీ అల్లర్ల గాయాలు మానలేదు.
అబ్దుల్ బాసిత్ ఎనిమిదేళ్ల తర్వాత మొదటిసారిగా బీబీసీ బృందంతో గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు, ఆయన భయ పడుతూనే ఉన్నారు.
కారులో కూర్చున్నప్పటికీ ఎవరూ గుర్తు పట్టకుండా కండువాతో ముఖాన్ని కప్పుకున్నారు. భయంతో కారు దిగలేదు.
అల్లర్లకు ముందు లిసాద్ గ్రామంలోని 6,000 జనాభాలో, 2,000 మంది ముస్లింలు ఉన్నారు. కానీ ఇప్పుడు లిసాద్ 'ముస్లిం రహిత' గ్రామం.
ఎన్జీఓలు చెబుతున్న దాని ప్రకారం, ముజఫర్‌నగర్‌లోని 20,000 మంది మాత్రమే తమ గ్రామాలకు తిరిగి వచ్చారు. చాలామంది ఇప్పటికీ ఇతర గ్రామాలు, శిబిరాల్లో నివసిస్తున్నారు.
''ముస్లింలను ఇక్కడి నుండి శాశ్వతంగా తొలగించాలనేది వారి ఉద్దేశం’’ అన్నారు బాసిత్.
బాసిత్ లిసాద్ గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాండ్లా సెటిల్మెంట్లో స్థిరపడ్డారు. అక్కడ ఆయన మతానికి చెందిన వారు మాత్రమే నివసిస్తున్నారు. 'నేనిక్కడ సురక్షితంగా ఉన్నాను’ అన్నారు బాసిత్.
''ముస్లింలను అణచి వేస్తున్నారు.అయినా వారు మౌనంగా ఉన్నారు. వారు కేవలం అల్లాపై నమ్మకం ఉంచారు. ప్రస్తుతం ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం’’ అన్నారాయన.
హిందూ బాధితుల పునరావాసం కోసం మాత్రమే యోగి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అల్లర్ల బాధితులైన కొందరు ముస్లింలు ఆరోపించారు.
అబ్దుల్ బాసిత్, షోయబ్ లాగా, ఉత్తర్‌ప్రదేశ్ లోని అనేక ఇతర ముస్లింలలో ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉందనే భావన ఉంది. ప్రస్తుత కాలంలో తిండి, గుడ్డ, ఇల్లు, రక్షణ మాత్రమే ముస్లింలకు ప్రాధాన్యత.
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే తమపైనే తప్పుడు కేసులు పెడతారని, అరెస్టు చేస్తారని చాలామంది ముస్లింలు భావిస్తున్నట్లు బీబీసీతో కొందరు ముస్లిం యువకులు బీబీసీకి చెప్పారు.
ఘర్‌వాపసీ, లవ్ జిహాద్ వంటి వాటి ముసుగులో ముస్లిం సమాజాన్ని భయపెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఉదాహరణకు ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసే స్వామి ఆనంద్ స్వరూప్ ముస్లింల నుంచి ఏమీ కొనరాదంటూ ఇటీవలే ఓ బహిరంగ సభలో చెప్పారు.
''మీరు వారిని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీస్తే, వారు ఇస్లాం నుండి హిందూ మతంలోకి మారడం ప్రారంభిస్తారు’’ అని ఆయన అన్నారు.
ఇలాంటి ప్రకటనలు ముస్లిం నేత కార్మికులకు ఆందోళన కలిగించాయని మేరఠ్‌కు చెందిన ఖలీద్ అన్సారీ అన్నారు.
హిందూ ముస్లింల పరస్పర సహకారంతో ఈ వ్యాపారం నడుస్తుందని ఆయన అన్నారు. అయితే, ఈ ప్రకటన చేసి నెల కావస్తున్నా, ఇక్కడి ప్రజల మధ్య సామరస్యం ఏమాత్రం దెబ్బతినలేదని అన్సారీ అభిప్రాయపడ్డారు.
శిశిర్ చతుర్వేది వృత్తిరీత్యా న్యాయవాది. హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేస్తున్న ఆయన, తన విద్వేష ప్రకటనలతో ముస్లింలపై విషం చిమ్ముతారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
లవ్ జిహాద్ బాధితులైన 550మంది హిందూ అమ్మాయిలను తాను వారి కుటుంబాలతో కలిపానని, 125మంది ముస్లిం అమ్మాయిలను హిందూ అబ్బాయిలతో పెళ్లి చేశానని బీబీసీ ప్రతినిధులతో సంభాషణ సందర్భంగా గర్వంగా చెప్పారు.
యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లింలు చేస్తున్న ఫిర్యాదులను 'విక్టిమ్ కార్డ్’గా ఆయన అభివర్ణించారు.
''ప్రపంచంలో ఇస్లాంను విశ్వసించే వ్యక్తులు ఎక్కడ ఉన్నా, వారి మతంలో లేని వారిని చంపుతున్నారు’’ అని ఆయన అన్నారు.
''ముస్లింలు ఎక్కడ ఉన్నా బాధపడుతూనే ఉంటారు. ఈ దేశంలో క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు లాంటి వారు ఎప్పుడూ మైనారిటీలను హింసిస్తున్నారని ఫిర్యాదు చేయరు’’ అన్నారాయన.
- చేతిలో ఏకే-47, వెంట 100 మంది సాయుధ సైన్యం.. అయినా ఈ బందిపోటు ఎందుకు లొంగిపోయాడు
- ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఎన్నికల నియమావళి అంటే ఏమిటి?
అభద్రతలో ముస్లింలు
సెప్టెంబరులో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గాజులు అమ్మే ముస్లిం వ్యక్తి తస్లీమ్ అలీ పై దాడి వీడియో వైరల్‌గా మారింది.
ఆయనపై 'పోక్సో’తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
హిందువులు నివసించే ప్రాంతంలో ఒక ముస్లిం హిందువుగా చెప్పుకుంటూ గాజులు అమ్ముతున్నాడన్నది తస్లీమ్‌పై ఆరోపణ. మూడు నెలల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది.
ఇండోర్ ఘటన తర్వాత యూపీలోని తస్లీమ్ గ్రామమైన బైరాయ్చామౌ గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఆయన అరెస్టు కావడంతో ఆయన కుటుంబం ఆకలి బాధలను ఎదుర్కొంది.
''నాకు ఐదుగురు పిల్లలున్నారు. వారికి తినిపించడానికి ఏమీ లేదు. ఎవరైనా పెడితే తినడం లేదంటే ఆకలితో ఏడ్చి ఏడ్చి నిద్రపోతారు’’ అని భర్త విడుదలకు ముందు తస్లీమ్ భార్య నీతా ఏడుస్తూ చెప్పారు.
తన భర్తపై దాడి ఘటన వీడియో చూసిన తర్వాత ఆమె ఇండోర్ జైలుకు పరుగెత్తారు. '' ఆయన నోరు వాచింది. ఒంటి మీద గాయాలున్నాయి’’ అన్నారామె.
జైపూర్, దిల్లీ వంటి ప్రాంతాల నుండి గాజులు కొని గ్రామాలు, నగరాల్లో అమ్మడం బైరాయ్చామౌ గ్రామస్తులు తరతరాలుగా చేస్తున్న పని. ఇండోర్ ఘటన తరువాత వారు గ్రామం దాటి వెళ్లడం దాదాపు మానేశారు.
త్వరలో జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా మరోసారి ముస్లింల పరిస్థితి చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితిని మార్చడానికి ముస్లింలు రాజకీయంగా ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
వారి రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది, సామాజికంగా వారు ఒంటరిగా ఉంటారు. ఆర్థికంగా వారు సమాజంలోని అట్టడుగున ఉన్నారు.
గణాంకాల ప్రకారం, ఏ పార్టీ ప్రభుత్వ హయాంలో ముస్లింల ఆర్థిక, సామాజిక స్థితిలో పెద్ద మార్పు లేదు. కానీ ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ హయాంలో ముస్లింలలో అభద్రతాభావం పెరిగిపోయిందని, ఈ ఎన్నికల్లో వారికి ఇదే పెద్ద సమస్యగా మారిందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
- తిరుపతి ఎమ్మెల్యే కొడుక్కి కోపమొస్తే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు నీటి సరఫరా ఆగిపోయిందా.. ఇంతకూ ఏం జరిగింది?
- పాతికేళ్ల కిందట పంది గుండెను మనిషికి అమర్చిన భారతీయ వైద్యుడిని జైలులో ఎందుకు పెట్టారు?
- జొకోవిచ్: టీకా వేసుకోలేదు, రెండుసార్లు కోవిడ్ వచ్చినా ఈవెంట్లలో పాల్గొనడం ఆపలేదు.. ఎందుకిలా
- 'ఆన్లైన్ చీకటి మార్కెట్’లో డ్రగ్స్ దందా ఎలా సాగుతుందంటే...
- కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ వ్యాపించటం ఎన్ని రోజులకు ఆగిపోతుంది?
- జగన్‌తో చిరంజీవి భేటీ, గంటపాటు ఏం చర్చించారంటే..
- దళిత్ పాంథర్: ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఎందుకు ముక్కలైంది, దళితుల పోరాటాల్లో దాని పాత్ర ఏంటి?
- రెండేళ్ల తర్వాత కూడా కోవిడ్ గురించి మనకు తెలియని 3 కీలక విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)