• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తర్‌ ప్రదేశ్ ఎన్నికలు: ఒవైసీ పార్టీ ముస్లింల ఓట్లను చీలుస్తుందా? దీంతో బీజేపీకే లాభమా?

By BBC News తెలుగు
|
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో 100సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించింది. సుహెల్దేవ్ భారతీయ సమాజ్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంది.

2017లో ఉత్తర్‌‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం ఖాతా కూడా తెరవలేక పోయింది. ఆయన పార్టీకి కేవలం అయిదు లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి.

అయినా, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలకు పోటీ చేస్తామని ఏఐఎంఐఎం ప్రకటించింది.

ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తమ పార్టీ నిర్ణయించిందని, ఈ కూటమికి 'భాగిదారి సంకల్ప్ మోర్చా' అనే పేరు పెట్టామని ఎంపీ అసదుద్దీన్ వెల్లడించారు.

సాధారణంగా ఒవైసీ ఇంగ్లిష్‌లో ట్వీట్ చేస్తారు. కానీ ఈ కూటమికి సంబంధించిన సమాచారాన్ని ఆయన హిందీలో ట్వీట్ చేశారు. ఇది ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హిందీ మాట్లాడే ప్రజలకు సోషల్ మీడియా ద్వారా దగ్గర కావాలని ఆయన చేసిన ప్రయత్నమని స్పష్టంగా కనిపిస్తోంది.

https://twitter.com/asadowaisi/status/1409084003110424576

ముస్లింల జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం తన లక్ష్యం కాదని ఒవైసీ గతంలో పలుమార్లు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.

''నేను ముస్లింల నాయకుడిని కాదు. ములాయం, లాలూ, మమతా బెనర్జీలాంటి వారు ముస్లింల నాయకులు. వారు ఓట్లను తీసుకున్నారు తప్ప చేసింది ఏమీ లేదు'' అని ఓ ఇంటర్వ్యూలో ఒవైసీ వ్యాఖ్యానించారు.

ఒవైసీ లక్ష్యం ఏదైనా, ప్రతి రాష్ట్రంలో తన పార్టీ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారని, చాలా చోట్ల ఆయన విజయం కూడా సాధించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. కానీ, అసదుద్దీన్ పార్టీని ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపింపజేస్తున్నారు. చాలాచోట్ల సక్సెస్ కూడా అవుతున్నారు.

మహారాష్ట్ర-బిహార్‌లో ప్రభావం

ఎంపీగా పని చేసిన ఒవైసీ తండ్రి సలావుద్దీన్ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమయ్యారని, అందుకు భిన్నంగా అసదుద్దీన్ పార్టీని విస్తరింపజేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎంఐఎం పార్టీకి ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కాకుండా ఎంఐఎం పార్టీ తనదైన ఉనికిని చాటుకున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలో సత్తా చూపించిన తర్వాతే, దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిందని విశ్లేషకులు అంటారు.

ఇలాంటి ప్రయత్నాలు బిహార్‌లో సక్సెస్ అయ్యాయి. కానీ, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న బెంగాల్‌లో మాత్రం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్‌కే ఆ వర్గం వారు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో ఎంఐఎంకు తన కమ్యూనిటీ నుంచి పెద్దగా ఓట్లు రాలేదు.

మాయావతి ఏమన్నారు?

అసెంబ్లీ ఎన్నికల కోసం ఒవైసీ స్థానిక రాజకీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడం యూపీలో కలకలం రేపింది. అయితే, తమ పార్టీ ఎంఐఎంతో పాటు మరే ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి అంతకు ముందే ప్రకటించారు.

ఈ పరిస్థితులలో ఉత్తర్‌‌ప్రదేశ్ ఎన్నికల్లో ఓట్ల పోలరైజేషన్‌కు ఎంఐఎం కారణం అవుతుందా? ఇక్కడ ఆ పార్టీ ఉనికి 2022లో అధికారం కోసం కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్ పార్టీలు సాగించే ప్రస్థానంలో అడ్డంకిగా మారుతుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో బీఎస్పీ, ఎంఐఎంలు కలిసి పని చేస్తాయని చాలా కాలంపాటు ఊహాగానాలు సాగాయి. అది లేదని తెలిశాక భీమ్‌ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో రాజ్‌భర్ ఒక దఫా చర్చలు జరిపారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఒవైసీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కానీ ఈసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పార్టీ కాక, పొత్తు కోసం ఏ రాజకీయ పార్టీనీ సంప్రదించలేదని ఒవైసీ చెప్పారు.

ఉత్తర్‌ ప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని మాయావతి నిర్ణయించారు.

కాన్షీరామ్ ఫార్ములా

బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ అనుసరించిన విధానాలనే తాము అనుసరిస్తున్నామని ఎంఐఎం ఉత్తర్‌ప్రదేశ్ చీఫ్ షౌకత్ అలీ బీబీసీతో అన్నారు.

''మొదటి ఎన్నికల్లో ఓడిపోయేందుకు పోరాడాలని, రెండో ఎన్నికల్లో ఓడిపోవాలని, మూడో ఎన్నికల్లో గెలవాలని కాన్షీరామ్ చెప్పేవారు. మేము కూడా అదే పద్ధతిని పాటిస్తున్నాం'' అన్నారు షౌకత్ అలీ.

బిహార్‌ను ఇందుకు ఉదాహరణగా చూపిన షౌకత్ అలీ ''2015లో తమ పార్టీ 6 సీట్లలో అభ్యర్ధులను నిలబెడితే, అయిదుగురికి డిపాజిట్లు దక్కలేదు. కానీ, 2020 ఎన్నికల్లో మేం అయిదు సీట్లు గెలిచాం. ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా వచ్చే ఎన్నికల్లో ఇదే తరహాలో విజయం సాధిస్తాం'' అన్నారు.

'గీత గీశారు'

ఇప్పటి వరకు సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాంటి కూటమిని ప్రకటించ లేదు. అయితే, ఒవైసీ, ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పార్టీలు కలవడం వల్ల వచ్చే మార్పేమీ ఉండదని సమాజ్‌వాదీ పార్టీ అంటోంది.

''ప్రజలు ఆ కూటమిని సీరియస్‌గా తీసుకోలేదు. రాష్ట్రంలో పోటీ ఎస్పీ, బీస్పీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే జరుగుతుంది'' అని ఎస్పీ నేత రాజేంద్ర చౌధరి అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీని ఎదిరించగలిగే శక్తి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు లేదని, తామే ఢీ కొంటామని ఎంఐఎం నేతలు వ్యాఖ్యానించారు.

'బీజేపీని ఎదురించేది మేమే'

కాంగ్రెస్‌తో పొత్తు గురించి తాము ఆలోచించ లేదని ఉత్తర్‌ప్రదేశ్ ఎంఐఎం చీఫ్ షౌకత్ అలీ స్పష్టం చేశారు. ''ఆ పార్టీతో చేతులు కలిపిన అన్ని పార్టీలు దెబ్బతిన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు, బిహార్‌లో ఆర్జేడీ అలాగే వెనకబడి పోయాయి. ఏది ఏమైనా బీజేపీని ఎదిరించగలిగేది మేమే'' అన్నారు షౌకత్.

బీజేపీకి బీ టీమ్ అవుతుందా?

ఒవైసీ కన్నౌజ్ పర్యటన గురించి వ్యాఖ్యానిస్తూ, ఎంఐఎం ఉనికి బిహార్‌లో తమకు ప్రయోజనం కలిగించిందని, యూపీలో కూడా లాభం చేకూరుస్తుందని బీజేపీ నేత సాక్షి మహరాజ్ ఈ ఏడాది జనవరి 14న వ్యాఖ్యానించారు.

అయితే, ఆయన ప్రకటన తర్వాత చాలా రాజకీయ పక్షాలు ఎంఐఎంను బీజేపీ బీ-టీమ్‌గా అభివర్ణించడం మొదలు పెట్టాయి. దీనిపై స్పందించిన బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ''బీజేపీ ఎన్నికల్లో సొంతంగానే గెలుస్తుంది. దానికి బీ టీమ్, సీ టీమ్ అవసరం లేదు'' అని వ్యాఖ్యానించారు.

''ముస్లింల జాతీయ పార్టీగా మారడం ఇష్టం లేదంటూ ఎంఐఎం నటిస్తోంది. అలాగే, ఎంఐఎం రాజకీయాలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది'' అని రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్ ఉర్మిలేశ్ వ్యాఖ్యానించారు.

''ఎంఐఎంతో జట్టు కట్టినా, ప్రాంతీయ పార్టీలతో పెట్టుకున్నా, అధికార పార్టీని ఎదిరించడానికి పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీలా, కేరళలో పినరయి విజయన్‌లా, తమిళనాడులో ఎంకే స్టాలిన్‌లా బలమైన నాయకుడు లేడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కూడా ఓడిపోయారు'' అన్నారు ఉర్మిలేశ్.

ఉత్తర్‌ప్రదేశ్‌లో పొత్తుల సంగతి ఎలా ఉన్నా అన్ని పార్టీలు గట్టిగా హోంవర్క్ చేయాల్సిన అవసరమైతే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Uttar Pradesh elections: Will Owaisi party split Muslim votes? Does this benefit the BJP?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X