ఎగ్జిట్ పోల్స్‌కు వేళాయె: యూపీలో చివరి విడత రేపే: మోడీ కంచుకోటపై ఫోకస్
లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు చివరిదశకు చేరుకుంది. తుది విడత పోలింగ్ మాత్రమే మిగిలివుంది. ఉత్తర ప్రదేశ్‌లో సోమవారం నిర్వహించిన తుది, ఏడవ విడతతో అది కూడా ముగుస్తుంది. ఈ నెల 10వ తేదీన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కోట్లాదిమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీలు, నాయకుల తలరాతలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేశారు. రాజెవరో.. బంటు ఎవరో తేలడానికి గడువు సమీపించింది.

తొమ్మిది జిల్లాల్లో..
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో చివరివిడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఆజంగఢ్, మవు, జౌన్పూర్, ఘాజీపూర్, చందౌలి, వారణాశి, భదోహి, మిర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. దీనితో ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ పరిసమాప్తి అవుతుంది.

అయిదు రాష్ట్రాల్లో..
ఉత్తర ప్రదేశ్‌లో ఆరు దశల్లో, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల్లో ఒకే విడతలో, మణిపూర్‌లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇదివరకే ముగిసిపోయింది. ఏడో దశతో ఉత్తర ప్రదేశ్‌లోనూ పోలింగ్ ముగుస్తుంది. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటిదాకా 349 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా 57 సీట్లు మిగిలివున్నాయి. ఉత్తరాఖండ్-70, గోవా-40, పంజాబ్-117, మణిపూర్-60 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

మేజిక్ రిపీట్..
పంజాబ్ మినహాయిస్తే- మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ప్రత్యేకించి- ఉత్తర ప్రదేశ్‌లో 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీవినీ ఎరుగని మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకుంది. 403 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిసి 312 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అదే గెలుపును పునరావృతం చేస్తామనే ధీమా బీజేపీ నేతల్లో వ్యక్తమౌతోంది. 350కి పైగా స్థానాలను సాధిస్తామంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలుమార్లు చెప్పుకొచ్చారు.

గెలవడం.. బీజేపీకి అత్యవసరం..
ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోకూడదని భావిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో మెజారిటీ తగ్గితే.. దాని ప్రభావం 2024 నాటి లోక్‌సభ ఎన్నికలపై పడుతుందనే ఆందోళన బీజేపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 80 లోక్‌సభ స్థానాలను కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్‌పై రాజకీయంగా పట్టు కోల్పోతే- 2024 నాటి ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం ఖాయమనే భావన నెలకొంది.

వారణాశిపై ఫోకస్..
ఈ చివరి విడత ఎన్నికల్లో వారణాశి జిల్లా ఉండటం అందరి దృష్టీ దీనిపైనే నిలిచింది. బీజేపీ హెవీ వెయిట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత లోక్‌సభ నియోజకవర్గం ఇది. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వారణాశిలో పర్యటించారు కూడా. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. దీని ఫలితం ఎలా ఉంటుందనేది 10వ తేదీన స్పష్టమౌతుంది. వారణాశి సహా దాదాపు అన్ని జిల్లాలను కూడా క్లీన్ స్వీప్ చేస్తామంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తోన్నారు.

ఎగ్జిట్ పోల్స్..
చివరి విడత పోలింగ్ గడువు ముగిసిన వెంటనే ఇక ఎగ్జిట్ పోల్స్ హడావుడి ఉంటుంది. దాదాపు అన్ని న్యూస్ ఛానళ్లు కూడా దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. సర్వే సంస్థలతో ఓటర్ల నాడీని పట్టే ప్రయత్నం చేశాయి. అయిదు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తమ అంచనాలను రూపొందించుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా వాటిని విడుదల చేయనున్నాయి. ఈ అంచనాలన్నీ ఖచ్చితమైనవిగా తేలుతాయా? తలకిందులవుతాయా అనేది 10వ తేదీన తేలుతుంది.