షాకింగ్ : హెల్మెట్ ధరించలేదని... యువకుడి నుదుటిపై తాళం చెవితో పొడిచిన పోలీస్...
ఉత్తరాఖండ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హెల్మెట్ ధరించలేదన్న కారణంతో ఓ యువకుడి నుదుటిపై తాళం చెవితో పొడిచారు. దీంతో అతని నుదుటి నుంచి రక్తం ధార కట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు పోలీస్ అధికారులపై వేటు పడక తప్పలేదు.

అసలేం జరిగింది...
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్ పట్టణంలో సోమవారం(జూలై 27) రాత్రి 8గం. సమయంలో ప్యాట్రోలింగ్ పోలీసులు బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని ఆపారు. హెల్మెట్ ఎందుకు ధరించలేదని అతన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో కోపోద్రిక్తుడైన ఓ పోలీస్ అధికారి బైక్ 'కీ' తీసి.. ఆ యువకుడి నుదుటిపై బలంగా పొడిచాడు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది.

పోలీస్ స్టేషన్‌కు భారీ ఎత్తున జనం...
పోలీస్ ఆ యువకుడిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పోలీసుల తీరును ఖండిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున రుద్రపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసనకు దిగారు. జనం ఆగ్రహ జ్వాలతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌పై నిరసనకారులు రాళ్లు రువ్వారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రల్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. బాధ్యులైన పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధ్యులైన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.

న్యాయం చేస్తామన్న డీజీపీ...
ఘటనపై ఉత్తరాఖండ్ డీజీపీ మాట్లాడుతూ... బాధ్యులైన ప్యాట్రోలింగ్ పోలీసులను సస్పెండ్ చేశామన్నారు. బాధితుడికి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు. ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందాక మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నదే తమ విధానం అని చెప్పారు. కాగా, ప్రస్తుతం బాధిత యువకుడు రుద్రపూర్ పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.