• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వారణాసి: ప్రధాని సొంత నియోజకవర్గంలో ఇంత పెద్దసంఖ్యలో ప్రజలు మరణించడానికి కారణమేంటి

By BBC News తెలుగు
|

పుణ్య క్షేత్రంగా పేర్కొనే వారణాసిలో కరోనా సెకండ్ వేవ్ తాకిడి తీవ్రంగా ఉంది.

'విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలతో వారణాసి అట్టుడికిపోతుంటే మా ఎంపీ నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?’ అంటూ అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియాలో కరోనా కేసులు 2 కోట్లు దాటిపోయాయి. 2 లక్షలకు పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

వారణాసిలో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, అంబులన్సుల కొరత తీవ్రంగా ఉంది. కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే వారం వరకు ఫలితాలు రావట్లేదు.

గత పది రోజులుగా మందుల షాపుల్లో విటమిన్ మాత్రలు, పారాసిటమాల్‌లాంటి సాధారణ మందులు కూడా దొరకట్లేదు.

"బెడ్ కావాలని, ఆక్సిజన్ కావాలని నిర్విరామంగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. సాధారణ మందులు కూడా దొరకట్లేదు. ఎక్స్పైరీ అయిపోయిన మందులు వేసుకుంటున్నారు. ఎక్స్పైరీ అయిపోయినవాటి ప్రభావం తక్కువగా ఉండొచ్చు కానీ ఎంతో కొంత ఉంటుంది కదా అంటున్నారు. అంత విషాదం అలుముకుని ఉంది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక డాక్టర్ తెలిపారు.

వైరస్ ఇంతలా వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి?

మార్చి నుంచి కేసులు ప్రారంభమయ్యాయని వారణాసి ప్రజలు చెబుతున్నారు.

దిల్లీ, ముంబైలలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం, ఆ ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడం, పాక్షిక లాక్‌డౌన్ విధించడంతో వలస కూలీలు కిక్కిసిన రైళ్లు, బస్సులు, ట్రక్కులు ఏది దొరికితే అది పట్టుకుని వారణాసి, దాని చుట్టుపక్కల గ్రామాలోని తమ ఇళ్లకు చేరుకోవడం ప్రారంభించారు.

చాలామంది మార్చి 29న హోలీ పండుగ జరుపుకోవడానికి ఇళ్లకు వెళ్లారు.

అలాగే ఏప్రిల్ 18న జరిగిన గ్రామ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చారు.

ఈ ఎన్నికలు నిర్వహించవద్దని నిపుణులు ఎంతా వారించినా, ఫలితం లేకపోయింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ విధులకు హాజరైన టీచర్లలో 700 మందికి పైగా మరణించారని, ఎన్నికల కారణంగా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని రిపోర్టులు చెబుతున్నాయి.

దాంతో, వారణాసిలో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఎక్కడా బెడ్స్, ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఏర్పడింది.

25 ఏళ్ల వ్యాపారి రిషభ్ జైన్ వాళ్ల అత్త కరోనాతో అనారోగ్యం పాలైనప్పుడు, ఆక్సిజన్ సిలిండర్ నింపించుకోవడానికి రోజూ 30 కిలోమీటర్లు కారులో వెళ్లి అక్కడ ఐదు గంటలపాటూ క్యూలో నిలబడాల్సి వచ్చేదని చెప్పారు.

"మా అత్తకు 55 ఏళ్లు. ఆమె ఆక్సిజన్ స్థాయి 80 కన్నా తగ్గిపోతుంటే మేము చాలా కంగారుపడిపోయాం. ఆస్పత్రుల్లో బెడ్ దొరకలేదు. ఇంక ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టేందుకు ప్రయత్నించాం. ఒక 25 నంబర్లకు ఫోన్ చేసి ఉంటాం. 12-13 గంటలు ప్రయత్నిస్తే, సోషల్ మీడియా, జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహాయంతో ఒక ఆక్సిజన్ సిలిండర్ దొరికింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు" అని రిషభ్ తెలిపారు.

పరిస్థితులు దిగజారుతుండడంతో వారణాసిలోనూ, ఉత్తర్ ప్రదేశ్‌లోని మరో నాలుగు నగరాల్లోనూ ఒక వారం పాటూ లాక్‌డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 19న ఆదేశించింది.

అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించేందుకు అంగీకరించలేదు.

"ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని కూడా మనం కాపాడాలి" అంటూ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది.

అయితే ఈ రెండిటిని కూడా ప్రభుత్వం కాపాడలేకపోయిందని విమర్శకులు అంటున్నారు.

వారాంతంలో కొన్ని గంటలసేపు కర్ఫ్యూ విధించడం, ప్రజలు భయంతో తమ వ్యాపారాలు, దుకాణాలు మూసివేయడంతో వేలాదిమంది తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. వైరస్ మాత్రం మెరుపు వేగంతో వ్యాపిస్తూనే ఉంది.

గణాంకాలపై సందేహాలు

వారణాసిలో ఇప్పటివరకు 70,612 కోవిడ్ కేసులు, 690 మరణాలు నమోదయ్యాయి.

అయితే 46,280 కేసులు అంటే 65 శాతం కేసులు ఏప్రిల్ 1 తరువాత నమోదైనవే.

అధికారిక గణాంకాల ప్రకారం రోజువారీ మరణాలు 10 నుంచి 11 ఉంటున్నాయి.

ఆదివారం అధికంగా 16 మరణాలు సంభవించినట్లు ప్రభుత్వ డాటా చెబుతోంది.

కాగా, వారణాసి ప్రజలు మాత్రం ఈ అంకెలన్నీ వాస్తవ దూరం అంటున్నారు.

హరిశ్చంద్ర, మణికర్ణిక ఘాట్లలో గత నెల రోజులుగా చితులు నిరంతరంగా మండుతూనే ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా వారణాసిలో నివసిస్తున్న ఒక వ్యక్తి తెలిపారు.

సాధారణంగా ఈ రెండు ఘాట్లలో రోజుకి 80 నుంచి 90 దహన సంస్కారాలు జరుగుతాయి. కానీ గత నెల రోజులుగా ఈ సంఖ్య 300-400కు పెరిగి ఉంటుందని ఆయన అన్నారు.

"వీళ్లందరూ ఎలా మరణిస్తున్నారు? కోవిడ్ కాకుండా వేరే అనారోగ్య కారణాలతో ఇంతమంది చనిపోతున్నారా? చాలామందికి కార్డియోపల్మనరీ ఫెయిల్యుర్ అవుతోందని రిపోర్టులు వస్తున్నాయి. ఇన్ని వందలమంది, యువత సైతం హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారా? ఇది నమ్మశక్యంగా ఉందా?" అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఈమధ్యనే వారణాసి నివాసి ఒకరు తీసిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో స్మశానవాటికకు ఒక కిలోమీటర్ దూరం వరకూ రోడ్డుకు ఇరుపక్కలా మృతదేహాలు లైను కట్టి ఉన్న దృశ్యం చూడవచ్చు.

పది రోజుల క్రితం రెండు కొత్త స్మశానవాటికలను తెరిచారు. వీటిల్లో కూడా 24 గంటలూ దహన సంస్కారాలు జరుగుతూనే ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నాయి.

వారణాసిలో కోవిడ్ తీవ్రత

వైరస్ గ్రామాలకు కూడా పాకింది

వారణాసిలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలకు కూడా కరోనావైరస్ పాకింది.

గత కొన్ని రోజులుగా ప్రతీ గ్రామంలో రోజుకు ఐదు నుంచి పది మరణాలు సంభవిస్తున్నాయని, కొన్ని గ్రామాల్లో 15 నుంచి 30 మంది చనిపోతున్నారని చిరైగావ్ బ్లాక్ చీఫ్ సుధీర్ సింగ్ పప్పు తెలిపారు.

"మా బ్లాక్‌లో ఆస్పత్రి లేదు. ఆక్సిజన్, మందులు కూడా లేవు. ప్రభుత్వ ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ప్రైవేటు ఆస్పత్రులలో రోగిని చేర్చుకోకముందే 2 లక్షల నుంచి 5 లక్షలు డిపాజిట్‌గా కట్టమని అడుగుతున్నారు. ఇంక మేమెక్కడికి వెళ్లాలి?" అని ఆయన అన్నారు.

మా ఉర్లో అందరికీ టెస్టులు చేయిస్తే ఉన్న 2,700 మందిలో సగం కన్నా ఎక్కువమందికే కోవిడ్ ఉంటుంది ఎవర్ని చూసినా దగ్గుతూనో, జ్వరంతోనో కనిపిస్తున్నారు. నీరసం, వెన్నునొప్పి, వాసన, రుచి తెలియడం లేదని చెబుతున్నారు. పట్టణాల్లో కన్నా మా ఊర్లోనే ఎక్కువ కేసులు ఉన్నట్లు ఉన్నాయి" అని ఐదే నివాసి కమల్ కాంత్ పాండే తెలిపారు.

"ఐదేలో మరణాల సంఖ్య అధికారిక గణాంకాల్లోకి ఎక్కట్లేదు ఎందుకంటే అక్కడ టెస్టులే జరగట్లేదు. ఇది ప్రధాన మంత్రి నియోజకవర్గం. అయినా కూడా మేము ఊపిరి అందక కష్టపడుతున్నాం" అని పాండే అన్నారు.

'మోదీ దాక్కున్నారు'

మోదీ ఎప్పుడూ వారణాసిలోని గంగా నదితో తనకు ప్రత్యేక సంబంధం ఉందని, అక్కడి ప్రజలు తనకెంతో ఆత్మీయులను చెబుతూ ఉంటారు.

అయితే తన సొంత నియోజకవర్గాన్ని కరోనా ధ్వంసం చేస్తూ ఉంటే, ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుంటే మోదీ దూరంగానే ఉండిపోయారు.

కానీ, బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్యకాలంలో 17 సార్లు అక్కడకు వెళ్లడం వారణాసి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

వారణాసిలో కోవిడ్ సంక్షోభాన్ని సమీక్షించేందుకు ఏప్రిల్ 17న మోదీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అయితే, అదంతా 'బూటకపు ప్రహసనం' అని ఆగ్రహంతో రగిలిపోతున్న ఒక రెస్టారెంట్ యజమాని అన్నారు.

"ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా అజ్ఞాతంలోకి వెళ్లి దాక్కున్నారు. వారణాసి ప్రజలను వారి కర్మానికి వదిలేశారు" అని ఆయన అన్నారు.

"స్థానిక బీజేపీ మంత్రులు కూడా ఎక్కడా కనిపించట్లేదు. అందరూ దాక్కున్నారు. వాళ్ల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసేశారు. వాళ్లంతా ప్రజలకు సహాయం చేయాల్సిన సమయం ఇది. కానీ ఎవరూ ఏమీ పట్టించుకోవట్లేదు. ఇక్కడంతా అరాచకంగా మారింది. ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు" అని ఆయన వివరించారు.

"నిందించాల్సి వస్తే ప్రధానమంత్రినే నిందించాలి. గత నెలరోజులుగా ఇండియాలో, వారణాసిలో సంభవించిన ప్రతీ మరణానికి కారణం ఆయనే" అని కాంగ్రెస్ నేత గౌరవ్ కపూర్ అన్నారు.

గౌరవ్ కపూర్‌కు కూడా కోవిడ్ సోకింది. కరోనా కారణంగా తన కుటుంబ సభ్యుల్లో, స్నేహితుల్లో కొందరిని పోగొట్టుకున్నారు.

"కేసులు పెరుగుతున్నప్పుడు బెడ్స్, అంబులెన్సుల విషయంలో సహాయం చేయమని నాకు నిరంతరం కాల్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఎవరికి ఫోన్ చేసి, ఏం ప్రయోజనం లేదు. ప్రస్తుతం ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటి కోసం కాల్స్ మొదలయ్యాయి" అని ఆయన తెలిపారు.

వారణాసి అస్తవ్యస్తంగా ఉంది. పరిస్థితులు మరింత దిగజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

"డాక్టర్ల దగ్గర ఆక్సీమీటర్లు కూడా లేవని చెబుతున్నారు. నిద్రలోనే రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయని కూడా వారికి తెలియడం లేదు" అని వారణాసిలోని ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ యజమాని తెలిపారు.

"నా భార్య, బిడ్డకు కోవిడ్ సోకింది. డాక్టర్‌కు ఫోన్ చేసి ఏం మందులు వాడాలో తెలుసుకున్నాను. కానీ, గ్రామాల్లో నివసిస్తున్నవారు ఎంతమంది ఇలా చేయగలరు? అక్కడ ఫోన్ చేసి అడగడానికి డాక్టర్లు కూడా లేరు. అక్కడి ప్రజలు ఎలా బతుకుతారో తెలుసా? దేవుడి దయ అనుకుంటారు" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Varanasi: Why did such a large number of people die in the Prime Minister's own constituency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X