వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెలిగొండ: మొదటి టన్నెల్ పూర్తవడంతో చిగురిస్తున్న ఆశలు... ప్రకాశం జిల్లాలోని ఈ ప్రాజెక్టు ఎక్కడివరకూ వచ్చింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

వెలిగొండ ప్రాజెక్టు
Click here to see the BBC interactive

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల ప్రభావం అతి తక్కువగా ఉండేది ప్రకాశం జిల్లాలోనే.

వర్షపాతం అతి తక్కువగా ఉండటంతో తీవ్ర స్థాయిలో సాగు, తాగు నీటి కష్టాలను ఈ జిల్లావాసులు ఎదుర్కొంటున్నారు.

సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్ట్ పనులు మూడు దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్నాయి. ప్రజల్లో నైరాశ్యం కమ్ముకుంటున్న వేళ తాజాగా కీలకమైన టన్నెల్ పనుల్లో ఒకటి పూర్తి కావడంతో మరోసారి ఆశలు చిగురించాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగు, తాగు నీటి వనరులను అందుకునే అవకాశం ప్రకాశం జిల్లా వాసులకు దక్కుతుందనే ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పరిస్థితిపై బీబీసీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

మూడు దశాబ్దాల క్రితం మొదలు

కృష్ణా నదీ జలాలను ప్రకాశం జిల్లాకు తరలించి... సాగు, తాగు నీటి సమస్య పరిష్కరించాలనే ప్రతిపాదన సుదీర్ఘకాలంగా ఉంది. అనేక మంది ప్రయత్నాలు చేసిన తర్వాత చివరకు 1994లో సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేశారు.

దానికి అనుగుణంగా 1996 మార్చి5న చంద్రబాబు తొలిసారిగా వెలిగొండ ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేశారు. అయితే, పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజల్లో నిరాశ ఆవహించింది.

ఆ తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో భాగంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును కూడా చేపట్టింది. స్వయంగా వైఎస్సార్ శంకుస్థాపన చేశారు.

వెలిగొండ ప్రాజెక్టు

కృష్ణా నీటిని తరలించడమే లక్ష్యం

కృష్ణా నదిలో వరదల సమయంలో వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. గడిచిన రెండేళ్లలోనే మొత్తం 1500 టీఎంసీల విలువైన నదీ జలాలు వృథాగా పోయాయి. ఇలాంటి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ప్రతిపాదించారు.

శ్రీశైలం జలాశయం సమీపంలో సంవత్సరంలో 45 రోజులు వరద ప్రవాహం అంచనాతో ఈ ప్రాజెక్టుకు సన్నద్ధమయ్యారు. మిగులు జలాల్లో 43 టీఎంసీల నీటిని కొల్లం వాగు ద్వారా రెండు సొరంగ మార్గాలకు మళ్లించి, అక్కడి నుంచి వరద కాలువ ద్వారా నల్లమల శ్రేణుల సమీపంలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద జలాశయం నిర్మించి తద్వారా సాగు, తాగు నీటి అవసరాలు తీర్చాలని సంకల్పించారు.

43.5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ కీలకమైన టన్నెల్ పనులు, కాలువల నిర్మాణంలో జరిగిన జాప్యంతో రెండున్నర దశాబ్దాలుగా ఫలితాల కోసం ప్రకాశం జిల్లా వాసులు ఎదురుచూడాల్సి వస్తోంది.

రెండు టన్నెల్స్ తవ్వకాల్లో జాప్యం

ప్రకాశం జిల్లాకే ప్రధాన నీటివనరుగా మారబోతున్న ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 18.8 కిలోమీటర్ల పొడవున రెండు టన్నెల్స్ తవ్వాల్సి ఉంది. నల్లమల అడవుల మధ్యలో కొండలను తవ్వి, శ్రీశైలం ప్రాజెక్ట్‌ సమీపంలో కొల్లం వాగుని చేరేందుకు సుదీర్ఘ ప్రయత్నం తప్పలేదు.

తొలి టెన్నెల్ పనులను 2008లో వైఎస్సార్ ప్రారంభించారు. ఆ తర్వాత 2009లో నాటి జలవనరుల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రెండో టన్నెల్ పనులకు శంకుస్థాపన చేశారు.

మొదటి టన్నెల్ ద్వారా 10.7 టీఎంసీల నీటిని తరలించేలా నిర్మాణం చేశారు. 7 మీటర్ల వ్యాసం గల ఈ టన్నెల్ ద్వారా 45 రోజుల పాటు నీటిని తరలించవచ్చు. దీనికి దాదాపు రెండు రెట్లు సామర్థ్యంతో రెండో టన్నుల్ పనులు చేపట్టారు. 9.2 మీ వ్యాసంగల ఈ టన్నెల్‌ను సుమారు 33 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు.

తొలుత శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌ను కొల్లం వాగు నుంచి టన్నెల్‌కి తరలించి, అక్కడి నుంచి నీటిని గ్రావిటీతో టన్నెల్‌లోకి మళ్లిస్తారు. 18.8 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ తర్వాత మరో 20 కిలోమీటర్ల పాటు వరద కాలువల ద్వారా కృష్ణా జలాలను వెలిగొండకు తరలిస్తారు. అక్కడి నుంచి మూడు సాగునీటి కాలువల ద్వారా పొలాలకు నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 30 మండలాలకు ప్రయోజనం దక్కుతుందని, ఈ ప్రాంతంలోని సుమారు 16 లక్షల మందికి తాగునీటి సమస్య తీరిపోతుందని అధికారులు లెక్కలేస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు

ఆర్థిక, సాంకేతిక సమస్యలతో జాప్యం

ఐదారేళ్లలో టన్నెల్ పనులు పూర్తి చేసి 2014 నాటికే వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తామని నాటి ప్రభుత్వం చెప్పినప్పటికీ అనేక కారణాలతో అవి నెరవేరలేదు. ముఖ్యంగా నిధుల కేటాయింపులో జాప్యంతో పాటు పలు సాంకేతిక సమస్యలు చుట్టుముట్టినట్టు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.

''టన్నెల్ తవ్వకాలే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకం. తొలుత కాంట్రాక్ట్ పొందిన సంస్థ పనుల విషయంలో తగిన శ్రద్ధ పెట్టలేదని ఇటీవల మేఘ సంస్థకు పనులు అప్పగించారు. టన్నెల్ బోరింగ్ మిషన్లతో ఇరిగేషన్ అవసరాలకు ఇంత పొడవునా ఎక్కడా పనులు జరగలేదు. ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలతో పనులు సాగేలేదు. ఆ తర్వాత అన్నింటినీ అధిగమించి మొదటి టన్నెల్ పూర్తి కావడం సంతృప్తికరంగా ఉంది. రెండో టన్నెల్ పనులు కూడా ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. తొలి టన్నెల్ పూర్తయ్యింది. 18.8 కిలోమీటర్ల పొడవున కాలువ సిద్ధం అయ్యింది. వచ్చే ఖరీఫ్ నాటికి నీటిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో టన్నెల్‌లో 11.5 కిలోమీటర్ల పొడవున తవ్వకం పూర్తయ్యింది. మరో 7 కిలోమీటర్ల పనులు వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రెండు టన్నెల్స్ అందుబాటులోకి వస్తే 43 టీఎంసీల నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుంది. అది జరిగితే ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరులోని ఉదయగిరి, కడప జిల్లా బద్వేల్ ప్రాంతానికి భరోసా వస్తుంది'' అని డీఈ అలీ బీబీసీతో చెప్పారు.

ఏ పార్టీవారు అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటనలు చేయడమే తప్ప దానికి అనుగుణంగా నిధుల మంజూరు విషయంలో తగినంత శ్రద్ధ పెట్టలేదని ప్రకాశం జిల్లా రైతు సంఘం నేత ఎం ఆంజనేయులు అభిప్రాయపడ్డారు.

''జర్మనీ, అమెరికా నుంచి సాంకేతిక పరికరాలను తీసుకొచ్చారు. టీబీఎంకి జియలాజికల్ యాక్సిడెంట్ పేరుతో కొన్నాళ్లు పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత కాంట్రాక్ట్ సంస్థలో కదలిక లేకపోవడం మరో సమస్య. ప్రస్తుతం మొదటి టన్నెల్ పూర్తి చేసినప్పటికీ రెండో టన్నెల్ అందుబాటులోకి వస్తేనే అసలు లక్ష్యం చేరుతాం. మొదటి టన్నెల్ ద్వారా 10 టీఎంసీల నీటిని తరలించినా అది పెద్దగా ప్రయోజనం నెరవేర్చదు. రెండో టన్నెల్ కూడా ప్రభుత్వం చెబుతున్నట్టు ఈ ఏడాది చివరికి పూర్తి చేస్తే తదుపరి ఏడాది నుంచి పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా నీటిని తరలించగలుగుతాం. ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని రైతుల తరుపున కోరుతున్నాం'' అని ఆయన అన్నారు.

ఆలస్యంతో పెరిగిన ప్రాజెక్టు నిర్మాణ వ్యయం

ప్రకాశం జిల్లా డోర్నాల నుంచి కర్నూలు రోడ్డులో కొత్తూరు వద్ద రెండు టన్నెల్స్‌కు సమాంతరంగా తవ్వకాలు ప్రారంభించారు. ఈ పనుల్లో జర్మనీ, అమెరికా నుంచి తీసుకొచ్చిన రెండు టీఎంబీలను వినియోగించారు.

జర్మన్ హెరెన్ కట్, అమెరికా నుంచి వచ్చిన రాబిన్ సన్ కంపెనీల మిషనరీని వినియోగించారు. రెండు టన్నెల్స్‌ని సమాంతరంగా నిర్మించారు. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతం కావడంతో పర్యావరణ హాని జరగకుండా ఈ టన్నెల్స్ నిర్మాణం జరుగుతోంది. వన్యప్రాణి జీవనానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశారు.

1996లో చంద్రబాబు హయంలో శంకుస్థాపన చేసిన నాడు ఐదేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2004 అక్టోబరు 27న వైఎస్సార్ రెండోసారి ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.

తొలుత శంకుస్థాపన చేసిన నాడు రూ. 980 కోట్ల అంచనాగా ఉన్న ప్రాజెక్టు వ్యయం ఆ తర్వాత రూ. 5,500 కోట్లకు చేరింది. 2014 నాటికే 5 ప్రధాన కాలువలు 80% పూర్తి చేసి, 3 ఆనకట్టల నిర్మాణం చేశారు. అయితే తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ. 8వేల కోట్లు దాటుతుందని అధికారులు అంటున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు

మూడు జిల్లాల్లో 30 మండలాలకు ప్రయోజనం

వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి తూర్పు ప్రధాన కాలువ కాకర్ల దగ్గర మొదలై ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 199.9 కి.మీ. ప్రవహించి పెద్దిరెడ్డిపల్లి సమతుల్యన జలాశయంలో కలుస్తుంది. తూర్పు ప్రధాన కాలువలో 24.45 కి.మీ. దగ్గర పశ్చిమ శాఖ కాలువ చీలి, 22.7 కి.మీ. ప్రకాశం జిల్లాలో ప్రవహించి గిద్దలూరు చేరుతుంది. ఆ తర్వాత 86.715 కి.మీ. దగ్గర చీలిన రాయవరం కాలువ 9.8కి.మీ మేర రాయవరం వరకూ ప్రవహిస్తుంది.

నెల్లూరు జిల్లాలో పెద్దిరెడ్డిపల్లి జలాశయం నుండి ప్రారంభమైన ఉదయగిరి కాలువ వరికుంటపాడు, దుత్తలూరు, మరిపాడు, ఉదయగిరి మండలాల్లో 18 కి.మీ. ప్రవహించి బొగ్గేరు నదిలో కలుస్తుంది. చెర్లపల్లి గ్రామం దగ్గర ప్రారంభమైన తీగలేరు కాలువ 48.15 కి.మీ. ప్రవహించి చిన్నకందలేరుకి చేరుతుంది.

గొట్టిపడియ ఆనకట్ట దగ్గర ప్రారంభమైన మరో కాలువ 12 కి.మీ. ప్రవహించి ఇదుపూరు దగ్గర గుండ్లకమ్మలో నదిలో కలుస్తుంది. మొత్తంగా ఈ కాలువల ద్వారా ప్రకాశం జిల్లాలో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84 వేల ఎకరాలు, కడప జిల్లాలో 27.2 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అధికారులు చెబుతున్నారు.

'వలసలు పోవాల్సివచ్చింది’

ఈ ప్రాజెక్టు నిర్మాణం మూలంగా 11 గ్రామాల ప్రజలు నిర్వాసితులవుతున్నారు. అందులో ఎనిమిది గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిర్వాసితులకు పూర్తి న్యాయం జరగలేదని గొట్టిపడియకు చెందిన ఎం చెన్నకేశవయ్య బీబీసీతో అన్నారు.

''అన్నింటా మా గ్రామంలోనే ఎక్కువ మంది నిర్వాసితులు. వేముల కోట వద్ద పునరావాసం కల్పించారు. కానీ ప్యాకేజీ అమలు సరిగా లేదు. దశలు దశలుగా ఇచ్చిన పరిహారం కూడా అక్రమార్కుల పాలయ్యింది. అనేక మార్లు అధికారులు, ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా న్యాయం జరగలేదు. మా ప్రాంత పొలాలకు సాగునీరు వస్తుందని సంతోషంగా సిద్ధమయ్యాం. కానీ మా కుటుంబాలకు మాత్రం చెప్పినట్టుగా పరిహారం అందించకపోవడంతో చాలామంది వలసలు పోవాల్సి వచ్చింది'' అని ఆయన అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు

'త్వరలోనే సాగునీరు అందిస్తాం..'

వెలిగొండ ప్రాజెక్టు సాధన, ప్రకాశం జిల్లా సాగు నీటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పూల వెంకట సుబ్బయ్య పేరుతో ఈ ప్రాజెక్టు నిర్మాణం అవుతోంది.

సుదీర్ఘకాల నిరీక్షణ తర్వాత వచ్చే ఖరీఫ్‌లో ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్దమవుతున్నారు. మొదటి టన్నెల్ పూర్తి కావడంతో రెండో టన్నెల్ నిర్మాణం పూర్తి చేయడంపై శ్రద్ధ పెడుతున్నామని ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి బీబీసీతో అన్నారు.

''రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో సాగునీటి అవసరాలు తీర్చడం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కొంత ప్రయోజనం దక్కుతుంది. రాబోయే సీజన్‌లో నీటిని విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. అయ్యింది. రెండో టన్నెల్ కూడా అందుబాటులోకి వస్తే 43.5 టీఎంసీల పూర్తి సామర్థ్యం చేరుకునేందుకు అవకాశం వస్తుంది. మొదటి టన్నెల్ ద్వారా నీటిని తరలిస్తూనే రెండో టన్నెల్ కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. దానికి అవసరమైన నిధుల కేటాయింపు జరుగుతోంది. కాంట్రాక్ట్ సంస్థ కూడా తగిన కృషి చేస్తోంది. దాంతో పూర్తి ఫలితాలు త్వరలోనే అందుతాయి'' అని ఆయన వివరించారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Veligonda: Hopes are high with the completion of the first tunnel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X