• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు: టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా

By BBC News తెలుగు
|

ఆంధ్రప్రదేశ్‌‌లో విజయవాడ మునిసిపల్ ఎన్నికలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. విజయవాడ రాజకీయంగా కీలకమైన మునిసిపల్ కార్పొరేషన్ కావడం ఒక కారణం అయితే... జగన్ ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత అమరావతిని ఆనుకుని ఉన్న విజయవాడలో ఓటర్ల మనోగతం ఎలా ఉండబోతోందన్నది మరో కారణం.

ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మార్చి 10న పోలింగ్ జరగనుంది.

రాష్ట్రంలోని అధికార పార్టీ వైసీపీ తరఫున మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ ఎన్నికల ప్రచారంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల్లో మాత్రం సఖ్యత కానరావడం లేదు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రెండు వర్గాలుగా సాగుతున్నారు. చివరకు ఎంపీ కేశినేని నానిని మరో వర్గం నేతలు రోడ్డుపై నిలదీసే వరకూ పరిస్థితి వచ్చింది.

ఈ వ్యవహారంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరినీ సముదాయించే ప్రయత్నం చేశారు.

విజయవాడ

ఎస్ఈసీ నిర్ణయంతో..

విజయవాడ సహా రాష్ట్రంలోని మునిసిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ గత ఏడాది పూర్తికావాల్సి ఉండగా కరోనా కారణంగా అప్పట్లో వాయిదా పడ్డాయి. వాయిదా పడిన దశ నుంచి ఎన్నికలను మళ్లీ ప్రారంభిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయం తీసుకుంది.

పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రస్తుతం పట్టణ ఓటర్ల తీర్పు వైపు అందరి దృష్టి మళ్లింది. అన్ని పార్టీలూ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి.

ఇప్పటికే పంచాయితీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగడంతో ఎవరికి వారే తమకే ఎక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు.

మునిసిపల్ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరుగుతుండటంతో ప్రజలు ఎవరికి మద్దతిచ్చారన్నది బహిరంగం కాబోతోంది. దాంతో అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్

రాజకీయంగా కీలకం

2014 మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో విజయవాడ మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. గత ఏడాది వరకూ మేయర్‌గా కోనేరు శ్రీధర్ బాధ్యతలు నిర్వహించారు.

1981లో విజయవాడకు మునిసిపల్ కార్పొరేషన్ హోదా దక్కింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నగరాల్లో మొట్టమొదట మునిసిపల్ కార్పొరేషన్ హోదా దక్కించుకున్న నగరం విజయవాడనే. ఆ తర్వాత సమీప గుణదల, పటమట, భవానీపురం, పాయకాపురం, ఖండ్రిగ వంటి ప్రాంతాలను కూడా నగర పాలకసంస్థ పరిధిలోకి తీసుకురావడంతో కార్పొరేషన్ విస్తరించింది.

మొదటి నుంచి విజయవాడ రాజకీయ కేంద్రంగా ఉండడంతో ఇక్కడి మేయర్ పీఠం కోసం గట్టి పోటీ ఉంటుంది.

ఏపీ రాజధాని ప్రాంతంగా ఐదేళ్ల పాటు సందడిగా కనిపించిన విజయవాడపై పట్టు సాధించాలని ప్రధాన పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో నగర పరిధిలోని మూడు అసెంబ్లీ సీట్లకు గానూ వెస్ట్, సెంట్రల్ సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఈస్ట్ స్థానాన్ని టీడీపీ నిలబెట్టుకుంది.

వెస్ట్ నుంచి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగానూ, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గానూ ఉన్నారు.

దాంతో వారిద్దరికీ వ్యక్తిగతంగా కూడా విజయవాడ మేయర్ పీఠం ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకు అనుగుణంగానే వారు పార్టీని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో తమ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయనే విశ్వాసంతో సాగుతున్నారు.

టీడీపీలో తలోదారి..

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి విజయవాడలో గట్టి పట్టు ఉంది. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానాన్ని టీడీపీ నిలబెట్టుకోవడం దానికి నిదర్శనం.

సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయవాడలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఆ పార్టీ భావిస్తోంది. దానిని సొమ్ము చేసుకుంటే విజయం సులభమని ఆశిస్తోంది.

రాజధాని తరలింపు అంశం వల్ల విజయవాడ వాసుల్లో వైసీపీ మీద పెరిగిన వ్యతిరేకత తమకు ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఆపార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో తలోదారి అన్నట్టుగా సాగుతున్నారు.

ఆధిపత్యం కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాల వల్లనే ఇలాంటి పరిస్థితి అని సీనియర్ జర్నలిస్ట్ ఎం.శ్రీనివాసరావు అంటున్నారు.

''ఎంపీగా ఉన్న కేశినేని నాని నగర రాజకీయాల్లో కూడా తన హవా ప్రదర్శించాలని చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా కుమార్తెకు మేయర్ పీఠం ఆశిస్తున్నారు. ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా ఉత్సాహంగా నగరంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

కార్పొరేటర్‌గా గెలిస్తే మేయర్ అవకాశం తనదేననే ధీమాతో ఉన్నారు. అందులో భాగంగా 39వ డివిజన్‌కి తమ వర్గీయుడైన శివవర్మని అభ్యర్థిగా ప్రకటించారు.

గతంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన టీడీపీ నేత కుమార్తె గుండారపు పూజితకు అక్కడ అవకాశం ఇవ్వాలని బుద్ధా వెంకన్న వంటి వారు వాదించారు.

అది టీడీపీలో విభేదాలకు తావిచ్చిందని చెబుతున్నారు. కానీ వాస్తవానికి మేయర్ అవకాశం కూడా నాని కుటుంబానికే ఇవ్వాలనుకోవడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.

బుద్ధా వెంకన్న, నాగూల్ మీరా వంటి వారు మాత్రమే కాకుండా బోండా ఉమా కూడా మేయర్ సీటు విషయంలో పలు ఇతర పేర్లు ప్రతిపాదిస్తున్నారు. ఇది టీడీపీలో గందరగోళానికి దారితీస్తోంది. నేతల మధ్య సఖ్యత లేదన్నది జనంలోకి వెళుతోంది. ఇది ఆపార్టీకి సమస్యగా మారకుండా చూసుకోవాల్సి ఉంది’’ అని ఆయన అన్నారు.

నాని పర్యటనకు టీడీపీ నేతలే అడ్డంకి

తెలుగుదేశం నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. కేశినేని నాని పర్యటనను ఆ పార్టీకి చెందిన నేతలే అడ్డుకున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం పట్ల కింద స్థాయి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

బుద్ధా వెంకన్న వర్గీయులు తనను అడ్డుకున్న తీరు పట్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఇతర పార్టీలకు చెందిన వారిని టీడీపీలోకి ఆహ్వానించినప్పుడు ఇప్పుడు విపక్షంలో ఉండగా బలోపేతం కావడానికి మనవైపు తీసుకొస్తే తప్పేముందంటూ ఆయన కార్యకర్తలతో వాగ్వాదానికి కూడా దిగారు.

ఇది తీవ్ర వివాదంగా మారింది. నేతల మధ్య విమర్శలకు తావిచ్చింది. ఓవైపు కేశినేని నాని... మరోవైపు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే నాగూల్ మీరా సహా నాని వ్యతిరేకులంతా ఒకటి అన్నట్టుగా పరిస్థితి మారింది.

అధినేత జోక్యం... చర్చలు

మునిసిపల్ ఎన్నికలకు ముందు విజయవాడ నేతల మధ్య విబేధాలపై టీడీపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. రెండు వర్గాలను సమన్వయం చేసే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు రంగంలో దిగారు. బుద్ధా వెంకన్న, నాగూల్ మీరాని పిలిచి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో విబేధాలకు అవకాశం లేకుండా పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.

అదే సమయంలో కేశినేని నానికి కూడా చంద్రబాబు పలు సూచనలు చేశారు. అందరినీ సమన్వయం చేసుకునే దిశలో ముందుకు సాగాలని సూచించినట్టు టీడీపీ ప్రకటించింది.

''కేశినేని నానితో కలిసి పనిచేయడానికి మాకేమీ ఇబ్బందులు లేవు. అధినేత మాటే మాకు శిరోధార్యం. ఆయన మాట పాటిస్తాం. పార్టీలో సమస్యలన్నీ అధినేతకు తెలియజేశాం. పరిష్కరిస్తామని చెప్పారు. టీడీపీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. విజయవాడ కార్పొరేషన్‌లో మరోసారి మా జెండా ఎగురుతుంది. వివాదాలకు తావు లేకుండా అందరూ ముందుకు సాగాలి’’ అంటూ తాజా పరిణామాలపై బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.

'శ్రేయస్కరం కాదు’

సాధారణంగా అధికార పార్టీలో ఇలాంటి వర్గపోరులు కనిపిస్తాయని... ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ఈ పరిస్థితి ఉండటం వారికి శ్రేయస్కరం కాదని రాజకీయ విశ్లేషకులు డానీ అభిప్రాయపడ్డారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ... ''విజయవాడలో కేశినేని నానికి మంచి గుర్తింపు ఉంది. ఎదురుగాలిలో కూడా ఆయన ఎంపీ స్థానం నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత కూడా మైనార్టీల్లో ఆయనకు మంచి ఆదరణ ఉంది. ఎన్నార్సీ బిల్లు ఆమోదించే సమయంలో ఆయన పార్లమెంటుకి గైర్హాజరయ్యారు.

ఇలాంటి అనేక అంశాలు ఆయన పట్ల ఆదరణకు కారణంగా ఉన్నాయి. సానుకూలతను ఉపయోగించుకోవడం టీడీపీ నేతల మీద ఆధారపడి ఉంటుంది. సహజంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అలాంటి సమయంలో విపక్షం ఐక్యంగా ఎదుర్కోవాలి.

అందుకు చంద్రబాబు చొరవ చూపాలి. మేయర్ విషయంలో టీడీపీ అధినేత ఇప్పటికే స్పష్టత ఇచ్చి ఉండాల్సింది. అది లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. సర్దుబాటు చేసుకుని ముందుకు సాగితేనే టీడీపీ‌కి అవకాశాలు ఉంటాయి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Vijayawada Corporation elections: MP vs MLC in TDP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X